‘ఓటుకి నోటు’ కుంభకోణం, రాజకియ దళారీ ‘అమర్ సింగ్’ కస్టడీకి


కేంద్ర స్ధాయిలో చాన్నాళ్ళుగా రాజకీయ దళారిగా చురుగ్గా వ్యవహరిస్తూ వచ్చిన అమర్ సింగ్‌ కటకటాల పాలయ్యాడు. ‘ఓటుకి నోటు’ కుంభకోణంలో చురుకైన పాత్ర పోషించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్, మొదట ఆరోగ్య కారణాల రీత్యా కోర్టు హాజరునుండి మినహయింపు కోరుతూ పిటిషన్ వేసినప్పటికీ, చివరి నిమిషంలో కోర్టుకి హజరు కావడానికే నిశ్చయించుకున్నాడు. ఇటీవలే కిడ్నీ మార్పిడి చికిత్స జరిగినందున, కిడ్నీ ఇన్‌ఫెక్షన్ సోకిందనీ, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలున్నాయనీ కనుక వ్యక్తిగత హాజరునుండి మినహాయింపు ఇవ్వాలనీ అమర్ సింగ్ లాయర్ పిటిషన్ దాఖలు చేశాడు. అమర్ సింగ్ దాక్కున్నాడని టి.వి వార్తల్లో చూసిన అమర్ సింగ్ కోర్టుకి హాజరుకావలని నిర్ణయించుకున్నట్లుగా అమర్ సింగ్ కోర్టుకి తెలిపాడు. తాను దాక్కోలేదనీ జబ్బు పడ్డాననీ తెలిపాడు.

అమర్ సింగ్ తో పాటు, ఇద్దరు బి.జె.పి మాజీ ఎం.పిలు ఫగ్గన్ కులస్తే, మహావీర్ సింగ్ భగోరా లకు కూడా తీస్ హజారి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అమర్ సింగ్ రెగ్యులర్ బెయిలుకు సెప్టెంబరు 19 న దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు సూచించింది. 2008 నాటి ఓటుకు నోటు కుంభకోణంలో పాత్ర పోషించారని బి.జె.పి ఎం.పిలపై కూడా కేసు దాఖలయ్యింది. బి.జె.పి మద్దతుదారు సుధీంధ్ర కులకర్ణి అమెరికాలో ఉన్నందున ఆయన రెండు వారాల్లో హాజరు కాగలడని ఆయన లాయరు తెలిపాడు. స్టింగ్ ఆపరేషన్ కు సుధీంద్ర కులకర్ణి మాస్టర్ మైండ్ గా పని చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మరో ఇద్దరు నిందితులు సొహాయిల్ హిందూస్తానీ, సంజీవ్ సక్సేనాలు ఇప్పటికే కస్టడీలో ఉన్నారు. వారి బెయిల్ పిటిషన్ కూడా విచారణకు వచ్చినప్పటికీ కోర్టు ఉత్తర్వులు ఇంకా వెలువడవలసి ఉంది.

అమెరికాతో పౌర అణు ఒప్పందం లోని కొన్ని అంశాలకు వ్యతిరేకంగా 2008 సంవత్సరంలో యు.పి.ఎ మొదటి సీజన్ ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవడంతో అది మైనారిటీలో పడిపోయింది. దానితో ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ ఎం.పిల మద్దతు, తెలుగు దేశం లాంటి చిన్న పార్టీల ఎం.పిల గోడదూకుడుల సహాయంతో యు.పి.ఎ ప్రభుత్వం గండం గట్టెక్కింది. అయితే విశ్వాస పరీక్ష సందర్భంగా ముగ్గురు బి.జె.పి ఎం.పిలు పార్లమెంటులో నోట్ల కట్టలను ప్రదర్శిస్తూ, వాటిని తమకు అమర్ సింగ్ ద్వారా అందాయనీ, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటువేయాలంటూ తమను కొనడానికి ప్రయత్నించారనీ ఆరోపించారు. అది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ప్రతిపక్షాలు తమ ఎం.పిల ఓట్లకోసం కాంగ్రెస్ పార్టీ నోట్లను విరజిమ్మిందని ఆరోపించాయి.

ఈ కేసు విషయంలో పోలీసుల విచారణ ముందుకు సాగకపోవడంతో పిటిషన్ దారు మాజీ ఎన్నికల కమిషనర్ జె.ఎం.లింగ్డో మళ్లీ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఢిల్లీ పోలీసులకు ఇప్పటికి మూడు సార్లు అక్షింతలు వేసింది. ముందే కొన్ని నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారని తలంటింది. ఇప్పటివరకూ పోలీసులు సమర్పించిన ఛార్జి షీట్లు రెండూ అసలు ఛార్జి షీట్లే కావు పొమ్మంది. అవన్నీ అయ్యాక మంగళవారం అమర్ సింగ్, ఇద్దరు బి.జె.పి మాజీ ఎం.పిలను జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం వరకూ దారితీసింది.

అయితే, మొత్తం ఎపిసోడ్ లో అర్ధం కాని విషయం ఒకటి కనపడుతోంది. వాస్తవంగా ‘ఓటుకి నోటు’ కుంభకోణానికి పాల్పడింది కాంగ్రెస్, అమర్ సింగ్ లు. బి.జె.పి ఎం.పి లు ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. వారు తీసుకున్న సొమ్ముని పార్లమెంటులో బయట పెట్టి ప్రభుత్వ అనైతిక వ్యవహారాన్ని బైటపెట్టారు తప్ప వారు ఆ డబ్బు తీసుకుని ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయలేదు. బి.జె.పి ఎం.పిలు నేరానికి పాల్పడలేదు. అటువంటిది వారిని కూడా నిందుతులుగా పరిగణించడం ఏమిటి? కాంగ్రెస్‌వైపునుండి ఒక్కరూ కుట్రదారులు బైటికి రాకపోవడం విచిత్రంగా కనిపిస్తోంది. పార్లమెంటులో ఫిర్యాదు చేసినవారు పోలీసులు, కోర్టు దృష్టిలో నిందితులుగా ఎలా మిగిలారు? ఏమిటీ వైరుధ్యం?

లబ్ది పొందిన కాంగ్రెస్ వైపు నుండి నిందుతులెవ్వరూ లేకపోవడం, ఫిర్యాదు చేసిన బి.జె.పి, నిందితులను సరఫరా చేయడం… … … ఇందులో అర్ధం కాని విషయం ఎక్కడుంది?

One thought on “‘ఓటుకి నోటు’ కుంభకోణం, రాజకియ దళారీ ‘అమర్ సింగ్’ కస్టడీకి

వ్యాఖ్యానించండి