ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మరోసారి మాంద్యంలోకి జారే అవకాశాలు కనిపిస్తున్నాయని సింగపూర్ ఆర్ధిక మంత్రి మంగళవారం జోస్యం చెప్పాడు. మాంద్యం సంభవించకుండా ఉండడం కంటే సంభవించడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నాడు. చైనా ఆర్ధిక వృద్ధి (జిడిపి వృద్ధి రేటు) గత పది సంవత్సరాలలోనే అత్యంత తక్కువ నమోదు చేయవచ్చని చైనా అధికారి ఒకరు వేరే సందర్భంలో తెలిపాడు. ఏసియాన్ దేశాల కూటమి ద్రవ్య విధానం సమీక్ష కోసం రానున్న శుక్రవారం సమావేశం కానున్నాయి. అమెరికా, యూరప్ ల సంక్షోభాలు వాటివలన సంభవిస్తున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మందగమనం నేపధ్యంలో, ఈ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచకుండా అదే స్ధాయిలో కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
సింగపూర్ ఆర్ధిక మంత్రి, చైనా అధికారిలు తమ తమ ఆర్ధిక వ్యవస్ధల గురించి వెల్లడించిన అభిప్రాయాలు ప్రపంచ ఆర్ధిక వృద్ధి బాగా నెమ్మదించవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయనడానికి నిదర్శనంగా నిలుస్తాయి. యూరో జోన్ దేశాల రుణ సంక్షోభం మరింత తీవ్రమైనా, అంటే ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్సులు కూడా రుణ సంక్షోభంలో కూరుకుపోయినా, అమెరికా వరుసగా రెండవ మాంద్యంలోకి జారినా ఆ ప్రభావం ఆసియా దేశాలు చైనా, జపాన్, సౌత్ కౌరియా తదితర దేశాలపైన గణనీయ ప్రభావం చూపించడం ఖాయం. అమెరికాకి చేస్తున్న ఎగుమతులు వారి ఆర్ధిక వ్యవస్ధలలో గణనీయ పాత్ర పోషించడం దానికి కారణం.
అమెరికా, యూరప్ దేశాల ప్రభుత్వాలు బడ్జెట్ లోటు తగ్గించడానికి ప్రజలపైన పొదుపు ఆర్ధిక విధానాలు రుద్ధుతున్నాయి. ఇప్పటికి నిజవేతనాలు దారుణంగా పడిపోయిన పరిస్ధుతుల్లో కార్మికులు, ఉద్యోగుల వేతనాలలో మరింతగా కోత పెడుతున్నాయి. ఉద్యోగాలు ఇవ్వడం బంద్ చేశాయి. ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నాయి. సంక్షేమ సదుపాయాలను రద్దు చేయడమో, కోత విధించడమో చేస్తున్నాయి. ఆర్ధిక సంక్షోభం నుండి బైటపడడానికి ఈ విధానాలను అమలు చేయక తప్పదంటూ కార్పొరేట్ పత్రికలు తీవ్ర ప్రచారం చేస్తూ ప్రజల చేత బలవంతంగా ఔషధం కాని చేదు మాత్ర మింగించడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ఆ దేశాల్లో కొనుగోలు శక్తి పడిపోయింది. ప్రజలు భవిష్యత్తు మీద భయంతో ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేసుకుంటున్నారు. దానితో వినియోగం తగ్గి ఉత్పత్తులు షాపుల్లో మిగిలిపోతున్నాయి. ఆ విధంగా ఆర్ధిక వ్యవస్ధలో చురుకుదనం తగ్గిపోయింది. ఫలితంగా అమెరికా, యూరప్ లకు వినియోగవస్తువలను ఎగుమతి చేసే చైనా, జపాన్, సౌత్ కొరియా తదితర దేశాల ఆర్ధిక వ్యవస్ధల ఎగుమతుల భాగం తగ్గిపోయి జిడిపి వృద్ధి తగ్గడానికి దారితీస్తున్నది. ప్రపంచ ఆర్ధిక గమనంపై భయాలతో అసియా దేశాల షేర్లు పడిపోతున్నాయి. ఆర్ధికవేత్తలు ఆసియా దేశాల ఆర్ధిక వృద్ధి అంచనాలను గణనీయంగా తగ్గించుకుంటున్నారు.
జపాన్, చైనా, దక్షిణ కొరియా దేశాల ఆర్ధిక నియంత్రణాధికారులు మంగళవారం ఫోన్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ఎదుర్కొంటున్న భయాలపై చర్చలు జరిపారని జపాన్ ద్రవ్య సేవల మంత్రిని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. సింగపూర్ ఆర్ధిక మంత్రి ధర్మన్ షణ్ముగ రత్నం, “ప్రపంచ ఆర్ధిక మాంద్యానికి ఆసియా మినహాయింపు కాదిక” అని పేర్కొన్నాడు. “అమెరికా, యూరప్ లలో ఆర్ధికవృద్ధి దాదాపు ఆగిపోయిన విషయం మనం చూస్తున్నాం. దానర్ధం మరొక మాంద్యం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే” అని ఆయన పేర్కొన్నాడు.
సింగపూర్ ఆర్ధిక వ్యవస్ధ ఈ సంవత్సరం రెండవ క్వార్టర్ (ఏప్రిల్, మే, జూన్) లో కుచించుకుపోయింది. జులై, ఆగస్టు, సెప్టెంబరు క్వార్టర్ లో కూడా అది కుచించుకున్నట్లయితే సింగపూర్ సాంకేతికంగా మాంద్యంలోకి జారుకున్నట్లే. ప్రపంచ వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా విలసిల్లుతున్న సింగపూర్‌లో మాంద్యం తటస్ధించడం ఏమంత శుభ సూచకం కాదు. అయితే సింగపూర్ ఆర్ధిక మంత్రి విశ్లేషణ కంటే అమెరికా యూరప్ ఆర్ధికవేత్తల విశ్లేషణ కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ అనేక వాస్తవాలను వారు విస్మరిస్తున్నారన్న అవగాహన వ్యక్తం అవుతోంది. అమెరికా, యూరప్ ల ఆర్ధిక వేత్తలు కొందరు కూడా తమ ఆర్ధిక వ్యవస్దలు మాంద్యం లోకి జారుతున్నాయని చాలా నెలలనుండి హెచ్చరిస్తున్నారు కూడా.
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్ జోయెలిక్ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో ఆర్ధిక మాంద్యం ప్రమాదం ఎక్కుగా ఉన్నప్పటికీ అమెరికా, యూరప్ లు అంతిమంగా వాటినుండి బయటపడతాయన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. కాని ఆయనే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ కొత్త ప్రమాదం ముంగిట ఉందని కూడా అంటున్నాడు. కొత్త ప్రమాదం ఏమిటో ఆయన ఇంకా వివరించలేదు. బహుశా అమెరికా, యూరప్ దేశాల్లో అమలువుతున్న కఠిన పొదుపు విధానాల పర్యవసానంగా కార్మిక వర్గ ఉద్యమాల సమ్మెలు తీవ్రం అవుతాయని ఆయన పరోక్షంగా ఎత్తి చూపుతుండవచ్చు.
అమెరికా, యూరప్ ల మాంద్యం భయాలతో మదుపుదారులు ఎమర్జింగ్ దేశాలవైపు దృష్టి సారించినప్పటికీ చైనా, ఇండియాలలో ఇప్పటికే ఆర్ధిక వృద్ధి తగ్గుముఖం పట్టింది. 2012లో చైనా ఆర్ధిక వృద్ధి తొమ్మిది కంటే తక్కువ నమోదు చేస్తుందని చైనా ప్రభుత్వంతో పాటు ఇతర విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే గత దశాబ్ద కాలంలో చైనా అతి తక్కువ వృద్ధి నమోదు చేసినదవుతుంది. చైనా, ఇండియాలో ఫిస్కల్ మద్దతు చర్యలు తీసుకోవడానికి ఆ దేశాల అధిక ద్రవ్యోల్బణం ఆటంకంగా పరిణమించింది. చైనా ద్రవ్యోల్బణం 6.5 శాతానికి చేరుకోగా, ఇండియా ద్రవ్యోల్బణం తొమ్మిదికి పైగానే ఉంది. చైనా, ఇండియాల లక్ష్యం ద్రవ్యోల్బణాన్ని 4 నుండి 4.5 శాతం వరకూ తగ్గించాలని. లక్ష్యానికి రెండు దేశాలూ దూరంగానే ఉన్నాయి. ప్రవేటు ఆర్ధికవేత్తలు చైనా ఆర్ధిక వృద్ధి అంచనాలను కూడా తగ్గించుకున్నారు.
