2011 క్యాలెండర్ సంవత్సరంలో మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో చైనా, ఇండియాలు జిడిపి వృద్ధికి సంబంధించి తమ స్ధానాలను కోల్పోయాయి. వాటి స్ధానాలను టర్కీ, అర్జెంటీనాలు ఆక్రమించాయి. ఇప్పటివరకూ చైనా, ఇండియాలో జిడిపి వృద్ధి రేటులో ప్రపంచంలో మొదటి రెండు స్ధానాల్లో కొనసాగుతున్నాయి. ఆర్ధిక సంక్షోభం తర్వాత ఇంతవరకూ అవి తమ స్ధానాలను కాపాడుకుంటూ వచ్చాయి. మొదటి క్వార్టర్ జిడిపి వృద్ధి రేటులో మొదటి ఐదు స్ధానాల్లో ఉన్న దేశాలను కింది పట్టికలో చూడవచ్చు.
పై పట్టిక ప్రకారం ఈ సంవత్సరం మొదటి క్వార్టర్ లో జిడిపి వృద్ధి రేటు అత్యధికంగా టర్కీ 11 శాతం నమోదు చేయడం గమనార్హం. సాధారణంగా ఈ స్ధానాన్ని చైనా ఆక్రమించేది. రెండో స్ధానంలో ఉండే ఇండియా ఏకంగా ఐదో స్ధానానికి దిగజారింది. ప్రపంచ వ్యాపితంగా ఆర్ధిక వృద్ధి రేటు తగ్గిపోతుండడంతో ఆ ప్రభావం చైనా, ఇండియాలపై బాగా పడుతోంది. ముఖ్యంగా ఈ రెండు దేశాల ఎగుమతి మార్కెట్లయిన అమెరికా, యూరప్ దేశాలు రుణ సంక్షోభంలో ఉండడంతో చైనా, ఇండియాల ఎగుమతులు పడిపోయి ఉత్పత్తి తగ్గిపోయింది.
అయితే 2011 క్యాలండర్ ఆర్ధిక సంవత్సరానికి గాను జిడిపి వృద్ధి రేటు అంచనాలను చూస్తే చైనా ఇంకా తన అగ్ర స్ధానాన్ని కొనసాగించినా ఇండియా స్ధానం రెండు నుండి మూడుకి పడిపోయింది. ఇండియా స్ధానాన్ని అర్జెంటీనా 8.3 శాతం వృద్ధి రేటుతో ఆక్రమించింది. భారత పాలకులు ఊహల్లో విహరించడం మాని వాస్తవంలో ఏం చెయ్యాలో ఆలోచిస్తే మంచిదని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.
