తెలంగాణ ఉద్యమంపై, అసెంబ్లీ మాజీ డిప్యుటి స్పీకర్, ప్రస్తుత స్పీకర్ నాదెండ్ల మనోహర్ అమెరికా రాయబారితో అభిప్రాయాలు పంచుకున్న సంగతి వికీలీక్స్ బైటపెట్టింది. భారత దేశంలోని అమెరికా రాయబారి అమెరికా ప్రభుత్వానికి రాసిన కేబుల్ ఉత్తరంలో తెలంగాణ ఉద్యమం గురించి విశ్లేషణ రాశాడు. ఈ విశ్లేషణ లోని అంశాలు ఇప్పటికే తెలంగాణ అంశంపై జరుగుతున్న చర్చలలో నానుతున్నవే అయినప్పటికీ, స్పీకర్ ద్వారా అమెరికా రాయబారికి చేరడమే, తెలంగాణ వాదుల్లో వ్యతిరేకతను రగిలిస్తోంది. నాదెండ్ల వెలిబుచ్చిన అభిప్రాయాల్లో కొన్ని పోలీసులు ఏమని అభిప్రాయపడుతున్నదీ వివరించగా, మరి కొన్ని తన పరిశీలనలు కూడా ఉన్నాయని స్పష్టమవుతున్నది.
గత సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 3 తేదీన ‘విద్యార్ధి గర్జన’ సభ అనంతరం జనవరి 5 తేదీన ఈ కేబుల్ పంపారు. కాగా ఆగస్టు 30 తేదీన ఈ కేబుల్ ను వికీలీక్స్ తన వెబ్‌సైట్ లో ప్రచురించింది. ఈ కేబుల్ ‘అన్ క్లాసిఫైడ్ / అధికారిక ఉపయోగం కొరకు మాత్రమే’ గా వర్గీకరించబడింది. కేబుల్ మొత్తం తెలంగాణ కోసమే కేటాయించబడింది. అందులో విద్యార్ధి గర్జన కు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతున్నది. తెలంగాణ విద్యార్ధుల జె.ఎ.సి ఐదు లక్షల మందిని సమీకరిస్తామని గర్జించినా 80,000 మందితో సరిపెట్టిందని చెబుతూ “తెలంగాణ విద్యార్ధులు ఎంత అరిచినా, కరవలేకపోయారు” అని ఒక సబ్ హెడ్డింగ్ పెట్టింది. “విద్యార్ధి గర్జన” వరకు జరిగిన పరిణామాలు, సభను గురించిన వివరణలతో కేబుల్ నిండిపోయింది.
శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఎనిమిదవ ఛాప్టర్‌లో ఉన్నాయని చెప్పిన అంశాలే కేబుల్‌లో చర్చకు రావడం గమనార్హం. విద్యార్ధులు సొంత రాజకీయ పార్టీ నెలకొల్పుకునే వైపుగా వారి ఉద్యమం ఉన్నదని రాయబారి తన కేబుల్ లో పేర్కొన్నాడు. తెలంగాణ విద్యార్ధి జాయింట్ ఏక్షన్ కమిటీ నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాల్లో నగ్జలైట్ల ప్రోత్సాహం, సహాయం ఉన్నట్లుగా రాయబారికి సమాచారం ఇస్తున్న స్ధానికులు, పత్రికలు చెబుతున్నట్లుగా కేబుల్ వెల్లడించింది. ఈ సందర్భంలోనే డిప్యూటి స్పీకర్ నాదెండ్ల చెప్పారంటూ కొన్ని అంశాలను కేబుల్ పేర్కొన్నది.
నాదెండ్ల మనోహర్ కి సంబంధించినంతవరకూ కేబుల్ లో ఇలా ఉన్నది, “1969లో లాగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం ఈ ప్రాంతంలో నగ్జలైట్ల రిక్రూటింగ్ కార్యక్రమానికి విజయవంతమైన వనరుగా ఉపయోగపడుతుందని పోలీసులు నమ్ముతున్నట్లుగా డిప్యుటీ స్పీకర నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. గతంలోని అనేకమంది నగ్జలైట్ల నాయకులు గత ఆందోళనలనుండే ఉద్భవించిన సంగతిని ఆయన ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా తెలంగాణ అంతటా గణనీయమైన సానుభూతిని వారు కూడగట్టగలిగారు. కోస్తాంధ్ర ప్రాంతంలోని తెనాలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మనోహర్, తెలంగాణ విద్యార్ధి జె.ఎ.సి లోని అనేక రాడికల్ కార్యకర్తలలో చాలామంది ‘మాదిగ’ కులం నుండి వచ్చిన 30 ఏళ్ళ పైబడ్డవారేనని ఎత్తి చూపాడు. వారికి భవిష్యత్తు కెరీర్ గురించిన భయాలేవీ లేవనీ అందువలన ప్రస్తుత అకడమిక్ సంవత్సరం కోల్పోయినా లేకున్నా వారు ఉద్యమంలో కొనసాగుతారనీ పేర్కొన్నాడు.”
నగ్జలైట్లకు సంబంధించినంతవరకూ పోలీసుల అభిప్రాయాలను చెప్పిన నాదెండ్ల మనోహర్ దానికి తన అభిప్రాయాలను, పరిశీలనలను కూడా కొన్ని జోడించాడు. ‘మాదిగ’ విద్యార్ధుల గురించి ఆయన చేసిన వ్యాఖ్య మాత్రం ఆయన సొంతదే. నాదెండ్ల మనోహర్ ఇప్పుడు తాను అలా ఎవరితోనూ వ్యాఖ్యానించలేదని చెబుతున్నా అవి అబద్ధాలనడంలో సందేహం అనవసరం. కేబుల్స్ అధికారికమైనవేననీ, అమెరికా రాయబారులు దాదాపు వాస్తవాలే తమ ప్రభుత్వానికి రాస్తారనీ భారత్ లో రాయబారిగా పని చేసినాయన ధృవీకరించారు. కనుక మన ప్రధాని మన్మోహన్, నాదెండ్ల మనోహర్ లాంటివారు కన్నంలో దొంగలు గా పట్టుబడగానే ‘వికీలీక్స్’ ని నమ్మలేమనో లేదా ‘నేనలా అన్లేదు, ఒట్టు’ అనో చెప్పినా అవన్నీ వారు మామూలుగా చెప్పె అబద్ధాల పరంపరలో భాగమే. వీళ్ళకి తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పగల దమ్ములు ఉండవు. ఆయన చెప్పాక కూడా వాటిని ఆయన అభిప్రాయాలుగా తీసుకుని అభిప్రయాల వరకే విమర్శలను పరిమితం చేయగల రాజకీయ వాతావరణం దేశంలో లేదు. దానితో యధేచ్ఛగా అబద్ధాలు వల్లించడం మామూలుగా జరిగిపోతోంది.
నగ్జలైట్ల వలన తెలంగాణ ఉద్యమం బలపడిందన్న అభిప్రాయంలో వాస్తవం లేదని చాలామంది గ్రహించడం లేదు. తెలంగాణ ఉద్యమం ద్వారా కార్యకర్తలను తయారు చేసుకోవడానికి వారు ప్రయత్నిస్తుండవచ్చు, కానీ వారు మద్దతు ప్రకటించడం వలన ఉద్యమానికి అదనపు కార్యకర్తలు లేదా ప్రజలు మద్దతునిస్తున్నారని భావించడం సరైనది కాదు. మావోయిస్టు పార్టీ వారు అప్పుడప్పుడూ ప్రకటనల ద్వారా తెలంగాణా ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ, ఉద్యమాన్ని కొనసాగించడంటూ పిలుపునిస్తున్నారు. క్రియాశీలక పాత్ర లేకుండా కేవలం పిలుపుల ద్వారా ఉద్యమాలు నడవడమో, ఉద్యకాలకు అదనపు శక్తి సమకూరడమో జరగడం అసాధ్యమైన విషయం. క్రియాశీలక పాత్ర ఉండగానే వస్తున్న మద్దతును సంఘం పరంగా, పార్టీ పరంగా స్వంతం చేసుకోవడానికి ప్రత్యేక కృషి చేయవలసి ఉంటుంది. ప్రత్యేక కృషి చేయాలంటే క్రియాశీలక పాత్రా తప్పని సరి. ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉండే ఈ అంశాలను వేరు వేరుగా ఏ ఒక్క సంస్ధకు ఆపాదించినా అది వాస్తవ విరుద్ధంగానే తేలుతుంది.
మావోయిస్టు పార్టీవారు అప్పుడప్పుడూ వివిధ సమస్యలపై రాష్ట్ర బంద్ లూ, ఏరియా బంద్ లూ, ఒక్కోసారి ఆల్ ఇండియా బంద్ లకు కూడా పిలుపునివ్వడం కద్దు. కాని అటువంటి బంద్ లు విజయవంతమైనఆట్లుగా ఎక్కడా దాఖాలాలు లేవు. వారు ఉన్నారని భావిస్తున్న ఏజెన్సీ ప్రాంతాల్లో బస్ సర్వీసులు రద్దు కావడం జరుగుతుంది. అది కూడా బస్ లను తగలబెట్టకుండా ట్రాన్స్ పోర్ట్ వారు బస్సు సర్వీసులను బంద్ రోజు వరకూ సస్పెండ్ చేయడం వలన బస్సులు తిరగవు. కాని బంద్ లకు పిలుపిచ్చాక క్రియాశీలకంగా వాటిని అమలు చేయగల పరిస్ధితి ఆ పార్టీవారికి లేదు. ప్రభుత్వాలు వారిపై విధించిన నిషేధమే దానికి కారణం. నిషేధం ఉండగా మావోయిస్టు పార్టీవారు తెలంగాణ ఉద్యమంలో జొరబడడం కూడా అసాధ్యం. అందులో ఎ.పి లో ఇంకా అసాధ్యంగా కనిపిస్తుంది. ఆంద్ర పోలీసులు అమలు చేసే తీవ్రమైన నిర్భంధం వారికా పరిస్ధితిని తెచ్చిపెట్టింది.
ఈ నేపధ్యంలో నగ్జలైట్లు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారన్నది ఒట్ఠి ప్రచారమే తప్ప నిజం కాదు. ఉద్యమాలు తమ చేయిని దాడిపోయినప్పుడల్లా పోలీసులు క్రూరంగా అణచివేయదలుచుకున్నపుడు ఉద్యమంలోనికి నగ్జలైట్లు జొరబడ్డారని ప్రచారం చేయడం ఈ రోజుల్లో మామూలు విషయంగా మారింది. వారి మాటలను నమ్మిన మంత్రులు, అధికారులు కూడా అవే అభిప్రాయలను వల్లె వేస్తూ ఉంటారు. ప్రతిపక్ష పార్టీలయిన టి.డి.పి, సి.పి.ఐ, సి.పి.ఎంల ఆందోళనలు కూడా చేయిదాటితే నగ్జలైటు జొరబడ్డారని పోలీసులు నిస్సందేహంగా ప్రచారం చేయగలరు. చంద్రబాబు నాయుడు సి.ఎం గా ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీయే స్వయంగా విద్యుత్ ఉద్యమం నడిపినా ఆ ఉద్యమంలో కూడా నగ్జలైట్లు జొరబడ్డారని బాబు ప్రభుత్వం ప్రచారం చేసి నిర్భంధం ప్రయోగించింది. అణచివేయాలనుకున్నప్పుడు పోలీసుల దృష్టిలో ఉద్యమంలో ఆటోమేటిగ్గా నగ్జలైట్లు జొరబడతారు. నగ్జలైట్లు లేకపోతే తీవ్రవాదులు కనపడే వాళ్ళు. వారూ లేనట్లయితే ఏ విదేశీ హస్తమో కనిపిస్తుంది. మొత్తం మీద ఏదో ఒక మిషతో ఉద్యమాలను అణిచివేయడం పోలీసుల కర్తవ్యంగా ఉంటుంది. వారికి పాలకులు పూర్తిమద్దతు ఇస్తారని వేరే చెప్పనవసరం లేదు.
నాదెండ్ల మనోహర్ వెలిబుచ్చిన అభిప్రాయాలు నిజంగా ఆయన చెప్పాడా లేదా అన్న అనుమానాలు అనవసరం. ఆ విషయంలో అనుమానం రావడం అంటే కేబుల్స్ అబద్ధం అని చెప్పడమే. కాని కేబుల్స్ నిజమైనవని అమెరికా రాయబారే అంగీకరించాడు. పాలక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అభిప్రాయాలే నాదెండ్ల మనోహర్ వ్యక్తం చేశాడు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పడక ముందే ఈ అభిప్రాయాలను పోలీసులు ప్రభుత్వం వ్యాప్తి చెందించారు. కనుక మనోహర్ ను ప్రత్యేకంగా తప్పుపట్టావలసింది ఏమీ లేదు. కాని ‘మాదిగ’ విద్యార్ధులపై ఆయన చేసిన వ్యాఖ్యలకి ఆయన బాధ్యతవహించవలసిందే. అది అనవసర ప్రసంగం. ఆ వర్గం వారికి కించపరిచే వ్యాఖ్యలవి. మనోహర్ తనకు తెలియదంటూ అబద్ధాలు చెప్పడం మాని తన వ్యాఖ్యలకి బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకుని వారికి క్షమాపణ చెప్పాలి.
