
ఆదివారం బిబిసి ఒక కధనం ప్రచురించింది. దాని ప్రకారం అమెరిక టెర్రరిజంపై యుద్ధం చేస్తున్న కాలంలోనే, అంటే గత పది సంవత్సరాలలో అమెరికా, బ్రిటన్ ల గూఢచారి సంస్ధలు సి.ఐ.ఎ, ఎం.ఐVI సంస్ధలు గడ్డాఫీ గూఢచార సంస్ధతో దగ్గరి సంబంధాలు నెరిపాయి. గడ్డాఫీ ప్రభుత్వంలో గూఢచార శాఖ అధిపతిగా పనిచేసి తిరుగుబాటు ప్రారంభంలో తిరుగుబాటు శిబిరంలోకి దూకిన మౌసా కౌసా కార్యాలయంలో ఈ విషయం తెలియజేసే డాక్యుమెంట్లు దొరికాయని బిబిసి తెలిపింది. 2002 నుండి 2004 వరకూ సి.ఐ.ఏ సంస్ధ అనేక మందిని టెర్రరిస్టులు మిలిటెంట్ల పేరుతో అడ్డుకొని నిర్బంధించి విచారణ నిమిత్తం లిబియా ప్రభుత్వానికి అందజేసినట్లుగా ఈ పత్రాలు తెలుపుతున్నాయి. Extraordinary rendition పేరుతో అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు ప్రపంచమంతటా ముస్లిం అనుమానితులను నిర్బంధించి ఈజిప్టు, లిబియా, పాకిస్ధాన్, జోర్డాన్ లాంటి మూడో దేశానికి పంపించి అక్కడ చిత్ర హింసల క్యాంపుల్లో పెట్టేవి. ఇప్పుడవి లేవని అమెరికా చెబుతున్నప్పటికీ దాని మాటలపై పెద్దగా ఎవరికీ నమ్మకం లేదు.
ఇంగ్లండుకి చెందిన ఎం.ఐVI కూడా ఇటువంటి అకృత్యాలకు పాల్పడిన చరిత్ర ఉంది. బ్రిటన్ దేశస్ధులయిన ముస్లింలు కూడా బ్రిటన్ ప్రభుత్వాల దారుణాలను ఎదుర్కొన్నారు. అమెరికా, ఇంగ్లండ్, లిబియా ల గూఢచర్య సంస్ధల మధ్య సంబంధాలను వెలువరించే పత్రాలు ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్ధ చేతికి చిక్కినట్లు బిబిసి తెలిపింది. మౌసా కౌసా కార్యాలయం నుండి అనేక పత్రాలను విలేఖరులు, కార్యకర్తలు స్వాధీనం చేసుకున్నారనీ అందులో అమెరికా, బ్రిటన్‌లతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మౌసా కౌసా ఆ తర్వాత విదేశాంగ మంత్రిగా నియమితుడయ్యాడు. మానవహక్కుల సంస్ధలు మౌసా కౌసాకు చిత్రహింసలు పెట్టించిన చరిత్ర ఉందని చెబుతూ ఆయనని అరెస్టు చేయమని డిమాండ్ చేశాయి. కాని ఆయన తిరుగుబాటు పక్షం చేరడమూ, ఆయన నిర్వహించిన చిత్రహింసల కొలిమిలు కూడా అమెరికా, బ్రిటన్ ల కోసమే చేయడంతో ఆయనని అరెస్టు చేయడం కుదరని పని.
“ఇస్లామిక్ మిలిటెంట్లుగా అనుమానితులైనవారిని అరెస్టు చేసి లిబియా గూఢచార సంస్ధకు అప్పగించడం మాత్రమే కాదిది. సి.ఐ.ఎ సంస్ధ తాను అప్పగించిన అనుమానితులను లిబియా గూఢచార సంస్ధ అడగవలసిన ప్రశ్నలను కూడా రాసి లిబియాకు ఇచ్చింది. ఫైళ్ళనుండి దొరికిన సమాచారం బట్టి నిర్బంధితులను విచారించే (చిత్ర హింసలు పెట్టే) సమయంలో సి.ఐ.ఏ గూఢచారులు కూడా అక్కడే ఉన్నారు” అని హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్.ఆర్.డబ్ల్యూ) సంస్ధ ప్రతినిధి పీటర్ బౌకర్ట్ తెలిపాడు. అనేక మంది అనుమానితులను లిబియాకు అప్పగించినట్లుగా పత్రాల ద్వారా తెలుస్తోందని హెచ్.ఆర్.డబ్ల్యూ తెలిపింది. వారిలో అబ్దెల్ హకీమ్ బెల్‌హాజ్ కూడ ఒకరనీ, పత్రాల్లో అబ్దుల్లా ఆల్-సాదిక్ గా పేర్కొన్నారని ఆ సంస్ధ తెలిపింది. అమెరిన్లు అతనిని 2004లో ఆగ్నేయాసియా నుండి బలవంతంగా లాక్కెళ్ళి ట్రిపోలికి అప్పగించారని హెచ్.ఆర్.డబ్ల్యూ తెలిపింది.
2000 ప్రారంభంలో బెల్‌హాజ్ గడ్డాఫీని కూలదోయడానికి కంకణం కట్టుకున్న ఇస్లామిక్ గ్రూపులో సభ్యుడని బిబిసి తెలిపింది. తనను అమెరికన్లు లిబియాకు అప్పగించారని చెబుతూ ఆయన అయినా అమెరికన్లపై కోపం లేదని తెలిపినట్లుగా బిబిసి చెబుతోంది. సి.ఐ.ఎ ఈ ఆరోపణలపై ఏమీ వ్యాఖ్యానించడానికి నిరాకరించిందని బిబిసి వివరించింది. కాని సి.ఐ.ఎ ప్రతినిధి జెన్నిఫర్ యంగ్‌బ్లడ్, ఈ సందర్భంగా ఒక నిజం చెప్పింది. “మా దేశాన్ని టెర్రరిజం నుండి రక్షించుకోవడానికి సి.ఐ.ఎ విదేశీ ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుంది. దానిలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు” అని. దానికామే సిగ్గుపడడం లేదు. ఆశ్చర్యపోకండి అని కూడా చెబుతోంది. తమకు అంటే సి.ఐ.ఎ కి సిగ్గూ ఎగ్గు లేకపోవడం చూసి అంతగా ఆశ్చర్యపోకండి అని ఆమె చెబుతోంది.
లేదంటే… టెర్రరిజంపై యుద్ధం అంటే అమెరికా చెబుతున్నది ఆల్-ఖైదాపై యుద్ధం అనే కదా? ఆల్-ఖైదా నరహంతక సంస్ధ అనీ అత్యంత క్రూరమైనదనీ పది సంవత్సరాలపాటు ప్రచారం చేసిన అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలు, ఆల్-ఖైదా మిలిటెంట్లను విచారణ చేయడానికి గడ్డాఫీ ప్రభుత్వ సేవలను వాడుకుని, 2011కి వచ్చేసరికి గడ్డాఫీ ప్రభుత్వంపైన కత్తిగట్టి పరమ క్రూర, పచ్చి నెత్తురు తాగే ఆల్-ఖైదా తోనే జట్టుకడుతుందా? పైగా విదేశీ ప్రభుత్వాలతో కలిసి పనిచేయడం ఆశ్చర్యకరం కాదు అని నిస్సిగ్గుగా చెప్పగలదా? తాము చేయగలిగనన్నాళ్ళూ లిబియా అధ్యక్షుడు గడ్డాఫీతో స్నేహం చేసి గడ్డాఫీని పడగొట్టడానికి తాము వ్యతిరేకించిన ఆల్-ఖైతాతోనే చెలిమి చేసి చివరికి వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమవుతుందా? అటువంటి పనులు చేయడానికి ఒక్క సిగ్గేం ఖర్మ, అన్ని విలువలూ వదిలేస్తేనే సాధ్యం అవుతుంది.
పత్రాలలో గడ్డాఫికి బ్రిటన్ కీ గల సంబంధాలను కూడా వెల్లడించాయి. 18 మార్చి, 2004 తేదీన రాసిన, లండన్ ఎస్.ఇ1 అడ్రస్ గల ఒక మెమో ద్వారా “బెల్‌హాజ్ లిబియా చేరుకున్నందుకు గడ్డాఫికి “అభినందనలు” తెలిపింది. అంటే తాము గడ్డాఫీకి కావలసిన వ్యక్తిని పట్టిచ్చామని దానికి భవిష్యత్తులో బదులు తీర్చుకోవాల్సి ఉంటుందని చెప్పడం అన్నమాట. లేదా అప్పటికె లిబియా చేసిన సాయానికి బదులు తీర్చుకున్నామని గుర్తు చేస్తూ బాకీలేమీ లేవన్న సిగ్నల్ కూడా కావచ్చు. మెమోలో ఇంకా “మౌసా కౌసా అర్జెంటుగా వ్యక్తిగతంగా దృష్టి సారించడాం కోసం” అని ఉంది. మెమోలోని విషయానికి “ట్రిపోలీలోని ముసాకు లండన్ లోని మార్క్ నుండి సందేశం రానున్నది” అని హెడ్డింగ్ పెట్టారు. ఫైనాన్షియల్ టైమ్స్ ఈ విషయం రాస్తూ ఇండిపెండెంట్ వనరులద్వారా ఈ వార్తను నిర్ధారించుకోలేకపోయామని తెలిపింది. వీళ్ళు అలా నిష్పక్షపాత వనరులద్వారా నిర్ధారించుకోకుండా రాసిన అబద్ధాలు లేదా తమ తమ ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీలు చెప్పగా రాసిన పచ్చి అబద్ధాలు బోల్డన్ని ఉన్నాయి.
ఇంకా ఘోరం ఏమిటంటే బ్రిటన్ గూఢచార సంస్ధ 2004లో కల్నల్ గడ్డాఫీకి ప్రసంగ పాఠాన్ని తయారు చేసిందట! ప్రధాని టోనీ బ్లెయిర్, గడ్డాఫీ ఆయుధ కార్యక్రమాన్ని వదిలిపెట్టడాని ప్రోత్సహిస్తున్న తరుణంలో ఈ ఘటన జరిగిందట. అదే సంవత్సరంలో టోనీ బ్లెయిర్, గడ్డాఫీతో జరిపిన ప్రఖ్యాత సమావేశం గడ్డాఫీకి చెందిన గుడారంలో జరగాలని బ్రిటన్ అధికారులు పట్టు పట్టారని “ది ఇండిపెండెంట్” వార్తా సంస్ధ తెలిపింది. “ప్రధాని గడ్డాఫీని ఆయన గుడారంలో కలుసుకోవడానికి కడు ఆసక్తితో ఉన్నాడు” అని మెమో తెలిపిందని ఆ పత్రిక తెలిపింది. ఇండిపెండెంట్ చూసిన మరొక మెమో లో ఎం.ఐ6 సంస్ధ లిబియా అసమ్మతివాది వివరాలను గడ్డాఫీకి అందించడానికి ఆత్రుత చూపింది. ఆ అసమ్మతివాదిని బ్రిటన్ జైలునుండి విడిచిపెట్టిన సందర్భంలో ఆయన వివరాలను గడ్డాఫీకి (ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి) ఇవ్వడానికి ప్రయత్నం చేశారు.
బ్రిటన్ విదేశాంగ మంత్రి విలియం హేగ్ ఈ వెల్లడింపులను కొట్టిపారేయడానికి ప్రయత్నించాడు. ఆయన స్కై న్యూస్ తో మాట్లాడుతూ “అవన్నీ పాత ప్రభుత్వానికి సంబంధించినవి. నాకు వాటి గురించేమీ తెలియదు. ఆ కాలంలో తెరవెనుక ఏం జరిగిందీ నాకు తెలియదు” అని తప్పించుకున్నాడు. సెప్టెంబరు 11 దాడుల తర్వాత జార్జి బుష్, టోనీ బ్లెయిర్ లు, గడ్డాఫీని అంతర్జాతీయ ఏకాకితనం నుండి బైటికి తేవడానికి పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిపారని బిబిసి ఆనాటి ఘటనలకు తానే సమాధానం ఇస్తోంది. అంత లాబీయింగ్ జరిపినపుడు అవే దేశాలు గడ్డాఫీని కూలదోయడానికీ, వీలయితే అతన్ని చంపడానికి కూడా ఎందుకు అంత గట్టిగా ప్రయత్నించారో, బిబిసి అదే కలంతో చెప్పి ఉండవలసింది.
