టర్కీ దేశస్ధుల హత్య – ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ కోర్టుకి వెళ్ళనున్న టర్కీ


గాజా ప్రజలకోసం అంతర్జాతీయ సహాయం తీసుకెళ్తున్న ఓడలపైన ఇజ్రాయెల్ రక్షణ బలగాలు దాడి చేసి తొమ్మింది మంది టర్కీ దేశస్ధులను చంపివేశాక టర్కీ ప్రభుత్వం ఇజ్రాయెల్ దేశంపై కారాలు మిరియాలు నూరుతోంది. పాలస్తీనీయులకు చెందిన గాజా ప్రాంతాన్ని సైన్యంతో చుట్టుముట్టి ఎటువంటి సరుకులూ అందకుండా కాపలా కాస్తుండడంపై ‘అంతర్జాతీయ న్యాయ స్ధానం’ ను ఆశ్రయించాలని టర్కీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ సహాయాన్ని పట్టుకెళ్తున్న ఓడల వరుసపైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) బలగాలు, అంతర్జాతీయ జలాల్లో ఉండగానే దాడి చేసి మావి మర్మారా అన్న ఓడపైకి హెలికాప్టర్ల ద్వారా దిగి దగ్గర్నుండి తుపాకులతో కాల్చి తొమ్మిదిమంది టర్కీ దేశస్ధులను చంపివేశాయి. అప్పటినుండీ టర్కీ, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. అప్పటివరకూ మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్‌కు, టర్కీ ఏకైక ముస్లిం మిత్ర దేశంగా ఉండేది.

టర్కీ విదేశాంగ మంత్రి అహ్మద్ డవుతోగ్లు గాజా బ్లాకేడ్ పైనా, టర్కీ ఓడలపై ఇజ్రాయెల్ దాడిపైనా ఐక్యరాజ్య సమితి నియమించిన కమిటీ నివేదికను తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించాడు. ఇజ్రాయెల్, గాజా ప్రాంతంపైన చుట్టుముట్టి నిర్బంధం చేయడాన్ని “చట్టబద్ధమైన బధ్రతా చర్య”గా అభివర్ణిస్తూ సమర్ధించింది. ఈ బ్లాకేడ్ వలన గాజా ప్రజలకు కనీస నిత్యావసరాలు సైతం సరిగా అందడం లేదు. ఇజ్రాయెల్ బాంబుదాడుల్లో ధ్వంసమైన అనేక ఇళ్లను పునర్మించుకోవడానికి సిమెంటు ఇసుకలను సైతం గాజాకి రవాణా కావడానికి ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు. పిల్లలకు కావలసిన పాలడబ్బాలు, ఔషధాలు ఏవీ సరిగా అందకుండా ఇజ్రాయెల్ నిర్బంధం విధిస్తోంది. గాజాకి 2006లో జరిగిన ఎన్నికలలో అక్కడి పాలస్తీనీయులు హమాస్ సంస్ధను గెలిపించుకోవడమే గాజా ప్రజలు చేసిన పాపం. హమాస్ సంస్ధ ఇజ్రాయెల్ అస్ధిత్వాన్ని గుర్తించదు. హమాస్ చర్చలకు సిద్ధపడినప్పటికీ ఇజ్రాయెల్ దానితొ చర్చలకు అంగీకరించదు. గాజా ప్రజలు అత్యధిక మెజారిటితో హమాస్‌ను గెలిపించుకున్నప్పటికీ ఆ ఎనికను గుర్తించడానికి అమెరికా ఇజ్రాయెల్ లు నిరాకరిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ లకు లొంగకుండా తమ ప్రజలతరపున నిర్ణయాలు తీసుకోవడంతో హమాస్ ను అవి హర్షించలేకపోతున్నాయి.

దానితో గాజా ప్రజలకు గుణపాఠం నేర్పాలన్న ఏకైక లక్ష్యంతో ఇజ్రాయెల్ 2006 నుండి గాజాను అష్ట దిగ్బంధనం కావించింది. ఐ.డి.ఎఫ్ అనుమతి లేకుండా చీమ కూడా గాజాలో ప్రవేశించకుండా చర్యలు తీసుకుంది. గాజా ప్రజలు జబ్బులు, ఆకలి, పోషకాహార లోపాలతో అలమటిస్తున్నా కక్షతో ఇజ్రాయెల్ వ్యవహరిస్తోంది. తమ రక్షణ కోసమే దిగ్బంధనం అని ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ అదంతా అబద్ధమేననీ, కేవలం హమాస్ సంస్ధను గెలిపించినందుకే దిగ్బంధనం విధించామని వికీలీక్స్ వెల్లడించిన అమెరికా కేబుల్స్ ద్వారా స్పష్టమయ్యింది. హమాస్ పైన గాజా ప్రజలకు విముఖత రావడానికి దిగ్బంధనం విధించినప్పటికీ ప్రజలు హమాస్‌ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. మహమ్మద్ అబ్బాస్ నాయకత్వంలోని పాలస్తీనా అధారటీ సంస్ధను ఎన్నుకోవాలన్నది అమెరికా, ఇజ్రాయెల్ ల కోరిక. పాలస్తీన అధారిటీ అమెరికా, ఇజ్రాయెల్ లకు అమ్ముడుబోవడంతో పాలస్తీనా ప్రజలు ఆ సంస్ధను విశ్వసించడం లేదు. అది ప్రభుత్వంలో ఉన్న వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో కూడా అత్యధికులు హమాస్ సంస్ధకే మద్దతు ఇస్తారు. కాని అమెరికా, ఇజ్రాయెల్ లు బలవంతంగా పాలస్తీనా అధారిటీ పాలనను వెస్ట్ బ్యాంక్ ప్రజలపై రుద్దుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే గాజాకి సహాయం నిమిత్తం మానవతా సాయం తెస్తున్న ఓడపైన అమానుషంగా ఐడిఎఫ్ దాడి చేసి తొమ్మిదిమంది టర్కీ దేశస్ధులను చంపివేసింది. అందుకు ఇజ్రాయెల్ క్షమాపణ చెప్పాలని, జరిగిన నష్టాన్ని చెల్లించాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. నష్టపరిహారం చెల్లిస్తానని అంగీకరించిన ఇజ్రాయెల్, బహిరంగ క్షమాపణ చెప్పడానికి నిరాకరించింది. దానితో కొద్ది రోజుల క్రితం టర్కీ ఇజ్రాయెల్ రాయబారిని బహిష్కరించింది. రెండవ స్ధాయి సంబంధాలకు దౌత్య సంబంధాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ తో కుదుర్చుకున్న మిలట్రీ సంబంధాలను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ లోగా ఐక్యరాజ్య సమితి మావి మర్మారా హత్యలపై అంతర్జాతీయ కమిటీ నియమించింది. కమిటీలో న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెఫ్రీ పామర్, కాంబోడియా మాజీ అధ్యక్షుడు అల్వారో యూరిబ్ లను సభ్యులుగా నియమించింది. అది కొద్ది రోజుల క్రితం తన నివేదికను ప్రకటించింది. ఆ నివేదికను తాము అంగీకరించనందున దానికి కట్టుబడమని టర్కీ ప్రకటించింది.

ఇజ్రాయెల్ డెప్యుటీ విదేశాంగ మంత్రి డేనీ ఐలాన్, తమ దేశం అపాలజీ చెప్పవలసిన అవసరం లేదనీ, టర్కీతో సంక్షోభం పరిష్కరించుకోవడానికి చేయగలిగన ప్రయత్నాలన్నింటినీ చేశామనీ తెలిపాడు. ఇజ్రాయెల్ తో ఉద్రిక్తతలు రేపడం ద్వరా తామేదో సొంత ప్రయోజనాలు సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించాడు. “వారు రాజీకి సిద్ధంగా లేరు. పరిమితిని నిరంతరం పెంచుతూ పోతున్నారు” అని ఐలాన్ ఇజ్రాయెలి టివితో అన్నాడని బిబిసి తెలిపింది. “టర్కులకు మేమొక విషయం చెప్పాలనుకుంటా. మాకు సంబంధించినంతవరకూ ఈ అంశం ముగిసింది. ఇపుడు మనం పరస్పరం సహకరించుకోవలసిన అవసరం ఉంది. అది లేకుంటే మాకే కాకుండా టర్కులకు కూడా నష్టమే” అని ఐలాన్ పేర్కొన్నాడు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంటు ఇద్దరి మధ్య సయోధ్య నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటించింది.

ఐక్యరాజ్యసమితి కమిటీ దారుణంగా గాజా బ్లాకేడ్ ను సమర్ధించింది. గాజా ప్రజలను అష్టకష్టాలను పెడుతున్న ఇజ్రాయెల్ దిగ్బంధనాన్ని సమర్ధించడానికి ఆ కమిటీకి మనసెలా ఒప్పిందన్నది అర్ధం కాని విషయం. దేశాల మధ్య ఉన్న తగాదాలని ప్రజలపై కక్ష సాధించడం ద్వారా తీర్చుకోవడం అమెరికా, పశ్చిమ రాజ్యాలకు కొత్త కాదు. ఇరాక్ పైన పది సంవత్సరాల పాటు ఆంక్షలు విధించి అమెరికా అక్కడి ప్రజలకు నరకం చూపింది. ఇరాన్ పైన కూడా ఆంక్షలు విధించి ఆ దేశ ప్రజలకు సౌకర్యాలు అందకుండా చేస్తోంది. వీటన్నింటినీ చూస్తూ ఊరకుండడమే కాక ఇరాన్ లాంటి దేశాలపై తాను స్వయంగా దుర్మార్గ విధానాలను యు.ఎన్ అనుసరిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ గాజాప్రజల జీవనంపై విధించిన బ్లాకేడ్ ను చట్టబద్ధ భద్రతా చర్యగా సమర్ధించి మరో పాపాన్ని మూటకట్టుకుంది.

అయితే కమిటీ మరీ బాగోదన్నట్లుగా ఇజ్రాయెల్ ఎక్కువ బలగాన్ని ఓడలపై ప్రయోగించిందని తప్పు పట్టింది. కమిటీ విచారణలో బైటపడిన విషయాలకు తగ్గట్లుగా దాని తీర్పు ఉండకపోవడం గమనార్హం. “అంత పెద్ద బలగంతో, బ్లాకేడ్ జోన్ కి అత్యంత దూరంలో ఉన్నప్పటికీ చివరి హెచ్చరికల్లాంటివేవీ జారీ చేయకుండా కాల్పులు జరపడం అకారణం, సమర్ధించలేనిది అని కమిటి పేర్కొన్నది. అవసరాని కంటే ఎక్కువ బలాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఉపయోగించిందని కమిటీ నివేదికలో తెలిపింది. ఓడపైన దిగడంతోటే కాల్పులు ప్రారంభించడం సరైంది కాదని చెప్పింది. ఫోరెన్సిక్ సాక్ష్యాలను బట్టి చనిపోయినవారిలో అధికులు ఒకటికంటే ఎక్కువ సార్లు కాల్చబడ్డారని తెలుస్తున్నదనీ, వెనుకనుండి కూడా కాల్చారని పేర్కొన్నది. దగ్గర్నుండి కూడా కాల్పులు చంపివేశారని కమిటీ వెల్లడించింది. అంటే గాజా బ్లాకేడ్ జోన్ కి ఓడలు ఇంకా చాలా దూరంలోనే ఉన్నాయని కమిటీ అంగీకరించింది. హెలికాప్టర్లనుండి దిగంగానే కాల్పులు మొదలుపెట్టారన్నది. ముందస్తు హెచ్చరిక కూడా ఇవ్వకుండా కాల్చారన్నది. దగ్గర్నుండీ, వెనకనుండి కూడా కాల్చారని చెప్పింది. ఏ ఆయుధమూ లేనివారిని వెనకనుండీ, దగ్గర్నుండీ కాల్చడాన్ని బట్టి ఐ.డి.ఎఫ్ బలగాలు ఎంత కక్షతో దాడి చేశాయో అర్ధమవుతోంది. ముందస్తు హెచ్చరికలేకుండా నిరాయుధులను కాల్చడం కనీసం యుద్ధ న్యాయం కూడా కాదు. అటువంటిది అంత క్రూరంగా ఐడిఎఫ్ పౌరులపైన, ఒక అంతర్జాతీయ సందేశాన్ని మోసుకొస్తున్న వారిపైన దాడి చేసి కాల్చి చంపితే అది ఇజ్రాయెల్ ఆత్మ రక్షణకి చేసారని సమర్ధించడం యు.ఎన్ కమిటీకే చెల్లింది.

యు.ఎన్ కమిటీ నివేదికను తిరస్కరిస్తున్నామని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐ.ఎస్.జె) లో గాజా బ్లాకేడ్ ను సవాలు చేయనున్నామని టర్కీ చెబుతోంది. హాలండ్ లోని హేగ్ లో ఉన్న అంతర్జాతీయ న్యాయ స్ధానం చరిత్ర కూడా అంత పవిత్రంగా ఏమీ లేదు. గడ్డాఫీ పైనా, సూడాన్ అధ్యక్షుడిపైనా పక్షపాత ధోరణితో అరెస్టు వారెంటు జారీ చేసిన ఐసిజె గాజా ప్రజలకు న్యాయం చేకూర్తుస్తుందని ఆశ పెట్టుకోనవసరం లేదు. కేవలం ప్రచారం నమ్మి గడ్డాఫీపై అరెస్టు వారెంటు జారీ చేసిన ఐ.సి.జె న్యాయస్ధానానికి ఉండవలసిన లక్షణాలే తనకి లేవని పరోక్షంగా ప్రకటించుకుంది.

వ్యాఖ్యానించండి