గ్లోబల్ రీసర్చ్ సంస్ధ తన వెబ్‌సైట్ లో ఈ వీడియోను ప్రచురించింది. లిబియా ప్రజలకోసం నాటో బలగాలు వైమానిక దాడులు, బాంబు దాడులు చేశాయని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు తెంపు లెకుండా అబద్ధాలు ప్రచారం చేశాయి. వారి బాంబుదాడుల్లో పౌరులు మరణించిన ఘటనలకు సమాధానం ఇవ్వకపోగా, యుద్ధంలో అనుబంధ నష్టం సహజమేనని అహంకార పూరితంగా బదులిచ్చారు. తద్వారా లిబియాపై తాము సాగిస్తున్నది యుద్ధమేనని అంగీకరించారు. కాని ఫ్రాన్సు, అమెరికా, బ్రిటన్ లు ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు లిబియా ప్రజల రక్షణ కోసం బాంబుదాడులు చేశామని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు.
కొద్ది మంది జర్నలిస్టులు తయారు చేసిన ఈ వీడియో ద్వారా నాటో దాడుల్లో బలయింది లిబియా పౌరులేనని గ్రహించవచ్చు. ఈ వీడియో చూపిన నష్టం కేవలం కొద్దిపాటిదే. ఆరు నెలల బాంబింగ్ లో లిబియా మౌలిక నిర్మాణాలన్నీ ధ్వంసం అయ్యాయి. రైలు మార్గాలు, రోడ్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు… ఇలా ప్రజలు వినియోగించుకునే సౌకర్యాలు సమస్తం నాశనం అయ్యాయి. ఇరాక్‌పై చేసిన తరహాలోనే లిబియాపైనా దాడి చేసి, ఆ దేశానికి చేసినట్లుగానే లిబియాకు కూడా సరైన ప్రభుత్వం లేకుండా తమ కీలుబొమ్మల చేతుల్లో ముక్కలుగా విడిపోయే పధకాన్ని పశ్చిమ దేశాలు రచించాయి.