“గడ్డాఫీ అనంతర లిబియా (ప్రజల) కోసం పశ్చిమ దేశాలు -ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా, ఇటలీ మొ.వి- ఒక ప్రణాళికను తయారు చేశాయి. ఈ ప్రణాళిక ప్రఖ్యాత లండన్ పత్రిక ‘ది టైమ్స్’ పత్రిక చేతికి చిక్కింది. ప్రణాళికలోని కొన్ని అంశాలను ఆ పత్రిక ప్రచురించింది. టైమ్స్ తో పాటు ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక కూడా ఆ వివరాలను ప్రచురించింది. ఈ బ్లూప్రింట్ తయారు చేయడంలో పశ్చిమ దేశాలు లిబియా తిరుగుబాటు ప్రభుత్వం ‘నేషనల్ ట్రాన్సిషన్ కౌన్సిల్’ (ఎన్.టి.సి) సహాయం తీసుకుంది. లేదా ఎన్.టి.సి యే పశ్చిమ రాజ్యాల సహాయం తీసుకుంది. మొత్తం మీద ఇరువురూ కలిసి గడ్డాఫీ అనంతరం లిబియా కోసం బ్లూప్రింట్ లేదా ప్రణాళిక రూపొందించారని అర్ధం చేసుకోవాలి……” సారీ. ఇదంతా నిజం కాదు. అటువంటిది ఒక ప్రణాళిక ఉందనీ, అది లీకయిందనీ నాటకమాడుతున్నాయి పశ్చిమ పత్రికలైన ‘ది టైమ్స్’, ‘ది ఆస్ట్రేలియన్’ లు.
70 పేజీల ప్రణాళికలో కొన్ని అంశాలను మాత్రమే పత్రికలు ప్రచురించాయి. లీక్ చేసిన పత్రికలు స్వయంగా లిబియా యుద్ధం జరిగినంతకాలం లిబియా అధ్యక్షుడు గడ్డాఫి పైనా, నాటో బాంబింగ్ పైనా, పౌరుల మరణాలపైనా పచ్చి అబద్ధాలు ప్రచారం చేసినవే. అలాంటి పత్రికలు పశ్చిమ దేశాల దురాక్రమణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం ఏమిటా అన్న అనుమానాలు సహజంగానే తలెత్తుతాయి. తీరా చూస్తే ఇప్పటిదాకా ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాలు గానీ, తిరుగుబాటు బలగాలు గానీ చేసిన క్రూరమైన నరహంతక కార్యకలాపాలను కప్పిపుచ్చేదిగానే ఈ లీకేజిని ప్లాన్ చేశారని అర్ధమవుతోంది.
ఈ ప్రణాళిక ప్రధానంగా గడ్డాఫీ కూల్చివేత అనంతరం కొద్ది నెలల కోసం రూపొందించినట్లుగా చెప్పారు. ఇరాక్ లో సద్దాం ప్రభుత్వాన్ని కూల్చివేసిన అనంతరం ఏర్పడిన పరిస్ధితులను, అలాగే తూర్పు లిబియాలో తిరుగుబాటు ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పరిణామాలను గుణపాఠంగా తీసుకుని ఈ బ్లూ ప్రింట్ రూపిందించినట్లుగా అధికారులు తెలిపారని ది టైమ్స్ తెలిపింది. సద్దాం అనంతరం అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు ఇరాక్ దేశాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాయి. అప్పటివరకూ మధ్య ప్రాచ్యంలో ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి నివేదికలో ఇతర దేశాలకంటే ఉన్నత స్ధాయిలో ఉన్న ఇరాక్, అమెరికా తదితర పశ్చిమ రాజ్యాల దురాక్రమణతో అట్టడుగుకి పడిపోయింది. అనేక అరబ్బు మత మౌఢ్యుల మధ్య సెక్యులర్ రాజ్యంగా వెలుగొందిన ఇరాక్ ఇప్పుడు వివిధ ముస్లిం గ్రూపుల బంధిఖానాగా, నిరంతరం కొట్లాడుకుంటున్న మత గ్రూపులకు నిలయంగా మారింది. అంతే కాకుండా అమెరికా ఆయిల్ ప్రయోజనాలు కూడా ఇరాక్ లో అంచనా వేసినంతగా సాధించలేకపోయాయి.
తూర్పు లిబియాను తిరుగుబాటు దారులు నియంత్రించినప్పటికీ వారిలో వారికి అనేక విబేధాలు తలెత్తాయి. పశ్చిమరాజ్యాలు అందించే ఆయుధాలు, మందుగుండు సామాగ్రి దగ్గర్నుండి ఔషధాల వరకు ఎవరు నియంత్రించాలన్నదానిపైన నిరంతరం కొట్లాడుకున్నారు. చివరికా కొట్లాటలు కొద్దివారాల క్రితం ముఖ్యమైన జనరల్ ను హత్య చేశేదాకా వెళ్లాయి. ఈ నేపధ్యంలోనే ఇరాక్, తూర్పు లిబియాల నుండి గుణపాఠాలు తీసుకుని ఈ ప్రణాళిక రూపొందించామని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లుగా ది టైమ్స్ తెలిపింది. ఈ పత్రిక వెల్లడించిన అంశాలు ఏవీ ఈ డాక్యుమెంటును లీక్ చేయడానికి తగిన అర్హత ఉందని రుజువు చేశేలా లేకపోవడం గమనార్హం.
గడ్డాఫీ వైపునుండి తిరుగుబాటుదారుల వైపుకి దూకిన పాత గడ్డాఫీ విధేయులపైనే ప్రణాళిక ప్రధానంగా ఆధారపడిందని రాశారు. అదే నిజమైతే గడ్డాఫి వైపునుండి వివిధ మంత్రులు, మిలట్రీ అధికారులు రాకమునుపే అమెరికా పెంచి పోషించిన కీలుబొమ్మ మనుషులు దీనిని మనఃపూర్వకంగా అంగీకరించబోరు. అందుకే ట్రిపోలి ప్రజలకు అనుకూలంగానే అంతా జరిగిందంటూ ప్రణాళిక లీకేజీ ద్వారా పశ్చిమ దొంగలు అసలు ప్రణాళిక రచించారు. ఆల్-ఖైదా గ్రూపు కూడా తిరుగుబాటు పేరుతో జరిగిన పశ్చిమదేశాల దురాక్రమణలో భాగం పంచుకున్నందున ఆ సంస్ధ పాత గడ్డాఫీ అనుచరులను ఉన్నత స్ధానాల్లో ఉంచడానికి అంగీకరించేది అనుమానం. మొదటినుండి రెబెల్స్ గా ఉన్న వారు అన్నీ అధికార స్ధానాలను వశం చేసుకోవాలని భావిస్తున్న నేపధ్యంలో పశ్చిమ రాజ్యాల బూటకపు బ్లూప్రింట్ అమలు పరిస్ధితి ఎలా ఉండేదీ ఆసక్తికరం.
మొదటగా 10,000 నుండి 15,000 మధ్య సైనికులతో “ట్రిపోలీ టాస్క్ ఫోర్స్” ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ బలగాలకు వనరులు సమకూర్చిపెడుతుంది. వీరు లిబియా రాజధాని ట్రిపోలిని తమ వశం చేసుకుంటారు. ట్రిపోలీలోని కీలక ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా చేసుకుంటారు. ఉన్నత స్ధాయి గడ్డాఫీ మద్దతుదారులను అరెస్టు చేసే బాధ్యత వీరిదే. గడ్డాఫీ ప్రభుత్వ భద్రతాధికారులలోనే 800 మందిని ముందుగానే గుర్తించి కోవర్టులుగా ఉంచామనీ వారు కొత్తగా ఏర్పరిచిన భద్రతా బలగాలకు వెన్నెముకగా ఉంటారని ప్రణాళిక పేర్కొంది.
గడ్డాఫీ పాలనకు సైద్ధాంతికంగా కట్టుబడకుండా ఉన్న 5000 మంది పోలీసు అధికారులను వెంటనే తిరుగుబాటు బలగాలలోకి రిక్రూట్ చేసుకోవాలని తద్వారా భద్రతకు సంబంధించిన బలగాలలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసుకోవాలని నిర్ణయించినట్లుగా ప్రణాళిక తెలిపింది. వీరు ఇప్పటికే గడ్డాఫీ ప్రభుత్వంలో సర్వీసులో ఉన్నప్పటికీ గడ్డాఫీ సిద్ధాంతానికి కట్టుబడనందున తిరుగుబాటుదారులకు సహకరిస్తారని భావిస్తున్నట్లుగా రాసుకున్నారు. మధ్యంతర ప్రభుత్వ బలగాలుగా వీరు విధులను నిర్వర్తిస్తారనీ డాక్యుమెంట్ లో తెలిపారు. ట్రిపోలి, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో తిరుగుబాటు గ్రూపులకు 8660 మద్దతుదారులు ఉన్నారనీ, వారిలో 3255 మంది గడ్డాఫీ సైన్యంలోనే ఉన్నారని డాక్యుమెంటు పేర్కొనడాన్ని బట్టి గడ్డాఫీకి వాస్తవంగా మద్దతు లేదని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నం జరిగింది.
ఉన్నత స్ధాయిలోని అధికారులు పెద్ద ఎత్తున తిరుగుబాటు ప్రభుత్వం వైపుకి వస్తారని అంచనావేస్తున్నట్లుగానూ, వారిలో 70 శాతం మంది భయం వల్లనే గడ్డాఫీ ప్రభుత్వంలో సేవకులు ఉన్నారని భావిస్తున్నట్లుగానూ పత్రం పేర్కొంది. వారు భయం వల్లనే తిరుగుబాటు ప్రభుత్వం వైపుకి ఎందుకు రాకూడదో తెలియవలసి ఉంది. కాని ఇప్పుడు తిరుగుబఆటు ప్రభుత్వం ఉన్న పరిస్ధితుల్లో, ఆయిల్ సామ్రాజ్యాన్ని పునర్విభజించుకోవాలని పశ్చిమ రాజ్యాలకు ఉన్న తొందరలో లిబియా ప్రజలను మోసం చేయడానికి తిరుగుబాటు నాయకులు, ఫ్రాన్సు, అమెరికా, బ్రిటన్ లు ఈ విధంగా బూటకపు లీకేజీల ద్వారా ప్రయత్నిస్తున్నారు. నాటో దాడులు భరించలేనంత స్ధాయికి విస్తరించే అవకాశాలు బలంగా ఉన్నాయని బ్లూప్రింట్ రచయితలు రాశారు. అంటే లిబియా పూర్తిగా తిరుగుబాటుదారుల వశం కాలేదని ఇంకా నరమేధం జరగాల్సి ఉందనీ, అదంతా కూడా లిబియా ప్రజల కోసమేననీ రచయితలు చెబుతున్నారు.
లీకేజి నిఖార్సయినదేనని లిబియా తిరుగుబాటుదారుల చేత ప్రకటన చేయించారు. లీకయిన ప్రణాళిక అధికారికమైనదేనని బెంఘాజీలోని ఎన్.టి.సి ధృవపరిచిందని ది ఆస్ట్రేలియన్ పత్రిక తెలిపింది. ట్రిపోలీలో పని చేస్తున్న తిరుగుబాటుదారుల మద్దతుదారుల ప్రాణాలకు భయం రాకుండా, అటువంటి వివరాలు బైటపెట్టకుండా “ది టైమ్స్” పత్రిక జాగ్రత్తలు తీసుకున్నదని ఎన్.టి.సి తెలిపింది. అంటే లీకేజీ పశ్చిమ రాజ్యాలకు అనుకూలంగా ఉండేవిధంగానె జరిగింది తప్ప అందులో లిబియా ప్రజలకు ఉపయోగపడేది లేదన్నమాట. తిరుగుబాటు ప్రభుత్వం నుండి యు.ఎ.ఇ కి రాయబారి, ప్లానింగ్ టాస్క్ ఫోర్స్ కు అధిపతిగా ఉన్న అరెఫ్ ఆలీ నాయేద్, డాక్యుమెంటు లీక్ కావడం పట్ల విచారం వెలిబుచ్చాడు. లిబియా ప్రజలకోసం చాలా ముందుగానే ప్రణాళికలు రూపొంచించామన్న సంగతి ప్రజలు తెలుసుకున్నారని ఆయన మరొక రకంగా సంతృప్తి వ్యక్తం చేశాడు. దీన్నిబట్టి లీకేజి వాస్తవానికి సెలెక్టెడ్ లీకేజీ అన్నది స్పష్టమవుతోంది.
కీలకమైన భద్రత, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్తు, రవాణా మౌలిక రంగం మొదలైన వాటిని గడ్డాఫి పాలన కూలిన గంటలలోపలే కాపాడుకోవాలని ప్రణాళిక పేర్కొంది. అంటే ఇన్నాళ్లు పశ్చిమ రాజ్యాలు విచక్షణా రహితంగా చేసిన బాంబింగ్ లో జరిగిన విధ్వంసం నిజానికి విధ్వంసం కాదనీ, అధికారం కోల్పోతున్నచివరి దశలో గడ్డాఫీ అనుచరులు తీవ్రంగా విధ్వంసం జరుపుతారనీ ఆ విధ్వంసం నుండి లిబియా ను కాపాడడమే ప్రణాళిక కర్తవ్యమని లీకేజీ ద్వారా పశ్చిమ రాజ్యాలు చెప్పడానికి అతితెలివి ప్రదర్శిస్తున్నాయన్నమాట. గడ్డాఫీ నుండి అసలు ప్రతిఘటనే ఎదురుకాలేదనీ ట్రిపోలీ వీధులన్నీ సైనికులెవరు లేకుండా ఖాళీగా దర్శనమిచ్చాయని పశ్చిమరాజ్యాల పత్రికలు ఘోషించినందున గడ్డాఫీ అనుచరులు అధికారం పోతున్న నిస్పృహలో విధ్వంసం సృష్టించలేదని అర్ధమవుతోంది. కనుక ఆ బాధ్యతనుండి తిరుగుబాటుదారులకు విముక్తి లభించిందన్నమాట.
ట్రిపోలి ప్రజలు తమ పట్టణంపై తిరుగుబాటుదారులు ఆక్రమణ దాడి చేస్తున్నారని భావిస్తారేమోననీ, ఆ విధంగా వారు భావించరాదని తిరుగబాటునాయకులు తెగ ఆందోళనపడ్డారని డాక్యుమెంటు చెబుతోందని ది టైమ్స్ వెల్లడించింది. కాని తూర్పుప్రాంతం నుండి ఎటువంటి బలగాలను కూడా ట్రిపోలిలో నియమించకపోవడం గమనార్హమని ‘ది టైమ్స్’ గొప్ప పాయింటుని లీకేజీ డాక్యుమెంటులో ఎత్తి చూపింది. దానికి బదులుగా “పశ్చిమ ప్రాంతాలయిన నఫూసా కొండల్లోని కొన్ని సెక్షన్లు, జెంటాన్ స్వాతంత్ర సమర యోధులనూ, రాజధాని రక్షణకు నియమించడానికి” నిర్ణయించారని ది టైమ్స్ పత్రిక లిబియా పౌరులకు అభయమిచ్చింది. ట్రిపోలీ ప్రజలపై బైటినుండి బలగాలను రుద్దబోమనీ, నగర బలగాలనే నియమిస్తామని మీడియా ద్వారా స్పష్టం చేయాలని డాక్యుమెంటులో నిర్ణయించారని తెలిపింది.
ట్రిపోలీలో ప్రవేశించిన అనంతరం ట్రిపోలీ ప్రజలు పెట్రోలు, రొట్టె లాంటీ కనీస అవసరాలు లేక అల్లాడుతున్నారని పశ్చిమ పత్రికలు తెగ వార్తలు గుప్పించాయి. గడ్డాఫీ తానున్నంతవరకూ ట్రిపోలీ ప్రజలను తిండి, నీళ్ళూ, పెట్రోలూ లేకుండా మాడ్చాడనీ అందువలనే అంతర్జాతీయ సాయం అందించడానికి యూరప్ అమెరికాలు చర్య తీసుకున్నాయని కలర్ ఇవ్వడానికి ఫేక్ లీక్‌డ్ డాక్యుమెంట్ లో ప్రయత్నం జరిగింది. 550 మిలియన్ డాలర్ల గ్యాసు పెట్రోలియంను సరఫరా చేసే అంతర్జాతియ కార్యక్రమానికి ప్రణాళికా ఏర్పాటు జరిగిందని ది టైమ్స్ తెలిపింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కూడా మానవతా సాయం అందించడానికి ప్రయత్నం జరుగుతుందని డాక్యుమెంటు తెలిపింది. అసలు లిబియాపై దాడి చేయకుండా ఉంటే, ఐక్యరాజ్యసమితికి ఈ బాధా బరువు, అమెరికా, యూరప్ లకు కూడా బరువూ బాధ్యతా తప్పేవి కాదా? ప్రతీకార దాడులు జరగక్కుండా జాగ్రత్త వహిస్తామని బూటకపు లీకెజి డాక్యుమెంటులో ఉన్నా ప్రస్తుతం ట్రిపోలీలో ప్రతికార దాడులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గడ్డాఫీ మద్దతుదారులను అరెస్టు చేయడానికి టాస్క్ ఫోర్స్ నియమిస్తామని ఈ డాక్యుమెంటులోనే ఉంది.
ఈ లేకిజే వట్టి బూటకం. పశ్చిమ రాజ్యాలు ఆడించిన నాటకం. ఈ లీకేజీ లిబియా ప్రజలకోసం కాకుండా ప్రపంచం కోసం ఉద్దేశ్యపూర్వకంగా చేసినది. దాని ద్వారా తాము ఇన్నాళ్లు లిబియాపై సాగించిన దారుణాలను కప్పిపెట్టడానికి ప్రయత్నం జరిగింది.
