అన్నా బృందం నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు -స్వామి అగ్నివేష్


అన్నా బృందంతో కలిసి కొంతకాలం పాటు నడిచిన స్వామి అగ్నివేష్, ఆ బృందం సభ్యులు కొందరు తనకు వ్యతిరేకంగా కుట్రపన్నారని శుక్రవారం ఆరోపించాడు. తమ బృందం నుండి అగ్నివేష్‌ను తప్పించిన ‘టీమ్ అన్నా’ దీక్ష ముగిశాక అగ్నివేష్ మాట్లాడినదని చెబుతూ ఒక సి.డిని విడుదల చేశారు. అవతలి వ్యక్తితో అన్నా బృందానికి అంతకాలం అవకాశం ఇచ్చి ఉండాల్సింది కాదని చెబుతున్న ఈ సిడిలో కొంతభాగం మార్చారని ఆరోపించాడు. అగ్నివేశ్ ‘కపిల్‌జీ’ అని సంబోధించడాన్ని బట్టి అవతలి వ్యక్తిని మానవ వనరుల శాఖ మంత్రి ‘కపిల్ సిబాల్’ అని అంతా భావిస్తున్నారు. సిడి పంపిణి కూడా సమయం చూసుకుని చేశారని అగ్నివేశ్ ఆరోపించాడు.

“మూడు రోజులముందుగానే వారికి ‘సి.డి’ అందినప్పటికీ, వారు సిడిని ఆదివారమే (ఆగష్టు 28) ఎందుకు పంపిణీ చేశారు? ఈ సమయమే ఆసక్తికరం. దీక్ష ముగిసిన వెంటనే వారు సి.డిని విడుదల చేశారు.” అని అగ్నివేశ్ ఆరోపించాడు. సి.డి వెనుక ఉన్నదెవరని ప్రశ్నించగా, అగ్నివేశ్, “నా సహచరులే నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. నేను వారికి మద్దతునిచ్చాను. కాని వాళ్ళు నన్ను మోసం చేశారు. ఉద్యమంతో సంబంధం ఉన్నవారే నన్ను మోసం చేశారు” అన్నాడు. వివాదాస్పద వీడియో పంపిణీని ‘ఉద్దేశ్యపూర్వకంగా’ చేపట్టారని చెబుతూ ఆయన తన విశ్వసనీయతను దెబ్బతీయడానికి విషపూరిత ప్రచారం జరుగుతోందని తెలిపాడు.

తాను వీడియోలో చూపిన సంభాషణ కపిల్ సిబాల్ తో కాదని ఇంతకు ముందు అగ్నివేశ్ చెప్పాడు. కపిల్ పేరుతో తనకు తెలిసినవారు చాలామంది ఉన్నారని ఆయన చెప్పాడు. శుక్రవారం అగ్నివేశ్ చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి అరవింద్ కేజ్రీవాల్ తిరస్కరించాడు. తాను ఎటువంటి తప్పు చేయలేదని చెబుతూ, అగ్నివేశ్, “నేను ఎక్కడ తప్పు చేశానో ఎవరైనా నాకు చెప్పగలిగితే నేను అన్నాకు అపాలజీ చెపుతాను. నాకు ఆయనంటే చాలా గౌరవం ఉంది” అని అగ్నివేశ్ అన్నాడు.

వీడియోలొ అగ్నివేశ్ ఒక భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుండి, ఫోన్లో మాట్లాడుతూ బైటికి రావడం కనిపించింది. అవతలి వ్యక్తికి ఆయన ప్రభుత్వం ఏదీ అంగీకరించరాదనీ, వారితో కఠినంగా వ్యవహరించాలనీ, ప్రభుత్వం ఏదో ఒకటి అంగీకరించినప్పుడల్లా వారు మరింత కఠినంగా మారుతున్నారనీ చెబుతున్నట్లుగా వీడియోలో కనిపించింది. స్వామి అగ్నివేశ్ అన్నాను నిరాహార దీక్ష నుండి విరమించవలసిందిగా సలహా ఇచ్చాడని అన్నా బృందం ఆరోపిస్తూ, అప్పటినుండీ ఆయనను దూరంగా ఉంచారనీ పత్రికలు గతంలో రాడాయి. ఈ విషయమై అగ్నివేష్ ను ప్రశ్నించగా, ఆమరన నిరాహార దీక్షకు తాను వ్యతిరేకమని చెప్పాడు. నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని అన్నా చెప్పాడని అగ్నివేష్ తెలిపాడు.

అన్నా హజారే తన దీక్షను కొనసాగించాలని అన్నా బృందం సభ్యులందరూ భావించగా తాను వారితో విభేధించానని అగ్నివేశ్ తెలిపాడు. “పార్లమెంటు, ప్రధానమంత్రి ఇద్దరూ అన్నా దీక్ష విరమించాలని కోరిన తరువాత ఆయన దీక్షను కొనసాగించడంలో నాకు ఎటువంటి కారణమూ కనిపించలేదు. ఆ అంశమే నన్ను వారికి దూరంగా జరిపింది” అని అగ్నివేశ్ తెలిపాడు. కర్ణాటక మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే కూడా సరిగ్గా ఇదే అంశాన్ని చెప్పడం గమనార్హం. అన్నాను దీక్ష విరమించమని పార్లమెంటులో ప్రధాని కోరినప్పుడే ఆయన దీక్ష విరమించి ఉండాల్సిందని ఆయన ఓ సారి పత్రికలతో మాట్లాడుతూ అన్నాడు. అంతేకాకుండా అన్నా దీక్షకు కూర్చోకముందే నిరాహార దీక్ష సరైంది కాదని సంతోష్ హెగ్డే చెప్పాడు.

నిరాహార దీక్షను విరమించమని అగ్నివేశ్ చెప్పడమే దోషంగా పరిగణించి తమకు దూరంగా ఉండమని ఆదేశించడం నిజమే అయితే, అది సరైంది కాదు. ఒక బృందంగా చర్చిందుకునేటప్పుడు భిన్నాభిప్రాయాలు సహజంగా వస్తుంటాయి. చర్చల అనంతరం అంతిమ నిర్ణయం ప్రకారం అందరూ వ్యవహరించేదీ లేనిది మాత్రమే పరిగణించాలి. అసలు భిన్నాభిప్రాయం చెప్పినప్పుడే అనుమానించి దూరంగా ఉండమని చెప్పడం సరైంది కాదు. వీడియో విషయమై అన్నా బృందం తాను నేరుగా ప్రశ్నించవలసిందని అగ్నివేశ్ అభిప్రాయపడ్డాడు. తాను వివరణ ఇవ్వడానికి నిరాకరించినట్లయితే అప్పుడు వీడియోని వెల్లడించడం అర్ధవంతంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.

వ్యాఖ్యానించండి