క్షీణించిన ఇండియా ఫ్యాక్టరీల ఉత్పత్తి సూచిక, గ్లోబల్ అనిశ్చితే కారణం


ముఖ్యమైన ఎగుమతి మార్కెట్ అయిన అమెరికా వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణిస్తుండం, అంతులేని యూరప్ రుణ సంక్షోభం తమ ప్రభావం చూపడంతో ఇండియా ఫ్యాక్టరీ ఉత్పత్తి ఆగస్టు నెలలో తీవ్రంగా పడిపోయినట్లుగా హెచ్.ఎస్.బి.సి మార్కిట్ సర్వే లో తేలింది. ఇండియా మాన్యుఫాక్చరింగ్ రంగంలోని ఉత్పత్తి తీరుతెన్నులను సూచించే హెచ్.ఎస్.బి.సి పి.ఎం.ఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) ఆగస్టు నెలలో 52.6 గా నమోదయ్యింది. మార్కెట్ విశ్లేషకులు 52.9 ఉండగలదని అంచనావేయగా దాని కంటే తక్కువ స్ధాయి 52.6 నమోదైనట్లుగా మార్కిట్ పి.ఎమ్.ఐ సూచి తెలియజేసింది. ఇది జులైలో 53.6 గా నమోదయ్యింది.

భారత దేశంలోని వివిధ ప్రముఖ పర్ఛేజింగ్ మేనేజర్స్ ను సర్వే చేయడం ద్వారా పి.ఎమ్.ఐ సూచిక ను రూపొందింస్తారు. ఈ సూచిక 50 కంటే తక్కువ ఉన్నట్లయితే మాన్యుఫాక్సరింగ్ ఉత్పత్తి తగ్గిపోతున్నట్లుగానూ, ఎక్కువగా ఉన్నట్లయితే వృద్ధి నమోదు చేస్తున్నట్లుగానూ అర్ధం చేసుకోవాలి. ప్రపంచ వ్యాపితంగానే ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదిస్తుండడంతో ఆ ప్రభావం ఇండియాపైన కూడా పడుతోంది. అమెరికా, యూరప్ లలోని ఆర్ధిక వ్యవస్ధలు నానాటికీ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతుండడం, ఆర్ధిక సంక్షోభానికి వారు అనుసరిస్తున్న పరిష్కారాలు తిరిగి ఆర్ధిక వ్యవస్ధకే గుదిబండగా మారుతున్నాయి. ఉదాహరణకి కార్మికులు, ఉద్యోగుల ఉపాధి ఊడబెరకడమే కాక, వారికి ఇస్తున్న సదుపాయాలు సైతం తగ్గించడంతో వారి కొనుగోలు శక్తి పడిపోతున్నది. దీనితో కొనుగోళ్లు పడిపోయి ఆమేరకు ఉత్పత్తి కూడా తగ్గిపోతున్నది. ఉత్పత్తి తగ్గిపోవడం అంటే జిడిపి తగ్గిపోవడమేనని వేరుగా చెప్పనవసరం లేదు.

ఐతే ఇండియా కొన్ని అభివృద్ధి చెందిన, ఎమర్జింగ్ దేశాల కంటే తక్కువ పి.ఎం.ఐ నమోదు చేయడం గమనార్హం. వాటిలో కొన్ని 50 కంటే తక్కువ పి.ఎం.ఐ నమోదు చేస్తున్నాయి కూడా. 50 కంటే తక్కువ పి.ఎం.ఐ నమోదైనట్లయితే ఆ దేశంలో మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి కుచించుకుపోతున్నదని అర్ధం. అంటే ఫ్యాక్టరీల ఉత్పత్తి పెరగడానికి బదులు తగ్గిపోతున్నదని అర్ధం. అమెరికా, యూరప్ లకు చేస్తున్న ఎగుమతుల్లో అధిక శాతం తగ్గిపోవడంతో ఇండియాపై ఈ ప్రభావం పడింది. యూరోజోన్, బ్రిటన్, చైనా దేశాల్లో పి.ఎం.ఐ రీడింగ్ 50 కంటే తక్కువగా నమోదయ్యాయి.

ఇండియాకి సంబంధించి కొత్త మాన్యుఫాక్చరింగ్ ఆర్డర్ల సూచిక 45.0 కి పడిపోయింది. జులైలో ఇది 49.2 గా నమోదయ్యింది. ప్రపంచ డిమాండ్ తగ్గిపోవడం  ఆర్.బి.ఐ వడ్డి రేట్లు పెంచడంతొ రుణాల ఖరీదు ఎక్కువై రుణాలు తీసుకోనే వారు తగ్గిపోవడం ఇండియా ఆర్ధిక వృద్ధిని కిందికి నెడుతున్నాయి. ఏప్రిల్-జూన్ కాలంలో ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి 7.2 మాత్రమే పెరుగుదల నమోదయ్యింది. అమెరికా మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి ఆగస్టు నెలలో నేలబారుగా నమోదుకానున్నట్లు విశ్లేషకులు తెలుపుతున్నారు. గురువారం గణాంకాలు అమెరికా మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి అధమ స్ధాయికి పడిపోయినట్లు తెలుస్తోందని రాయిటర్స్ తెలిపింది. ఈ నేపధ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్, గత సంవత్సరం రెండో అర్ధభాగంలో చేసినట్లుగా క్వాంటిటేటివ్ ఈజింగ్-3 ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నప్పటికీ అమెరికా ఆ వార్తలను తిరస్కరించింంది.

వ్యాఖ్యానించండి