2011-12 ఆర్ధిక సంవత్సరంలో మొదటి క్వార్టర్ లో (ఏప్రిల్, మే, జూన్ నెలలు) భారత దేశ జి.డి.పి నిరాశపరిచింది. గత ఆరు క్వార్టర్లలో, అంటే గత సంవత్సరం న్నర కాలంలో అత్యంత తక్కువగా 7.7 శాతం వృద్ధి రేటుని నమోదు చేసింది. అయితే ఆర్ధిక పరిశీలకులు, భారత జిడిపి మొదటి క్వార్టర్ లో ఇంతకంటే తక్కువగా ఉంటుందని అంచనా వేయడం గమనార్హం. కనుక మార్కెట్ అంచనాలను అధిగమించిందన్న సంతోషాన్ని ఈ అంకెలు మిగిలించాయి.
గత మార్చి క్వార్టర్ తో పోలిస్తే మాత్రం భారత జిడిపి వృద్ధి రేటు కొద్దిగా తగ్గింది. మార్చి తో ముగిసిన మూడునెలల క్వార్టర్ సంవత్సరంలో ఇండియా జిడిపి 7.8 శాతం మేరకు వృద్ధి చెందింది. వాస్తవానికి ఇదే అత్యంత తక్కువ వృద్ధి రేటుగా పెదవి విరిచారు. జూన్ క్వార్టర్ లో, మార్చితో పోలిస్తే 0.1 శాతం తగ్గినప్పటికీ, మార్కెట్ విశ్లేషకుల సగటు అంచనా 7.6 శాతాన్ని అధిగమించింది. వృద్ధి రేటు తగ్గినప్పటికీ కొంతమంది భావించినట్లుగా భారత ఆర్ధిక వ్యవస్ధ మరీ అంత బలహీనపడలేదనీ, మరొకసారి ఆర్.బి.ఐ వడ్డీ రేటును పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆర్.బి.ఐ ఇండియా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్ధిక సంక్షోభం తర్వాత ఇప్పటికి పదకొండు సార్లు పెంచింది. అయినప్పటికీ ద్రవ్యోల్బణం కట్టడి కాకపోగా, వడ్డీ రేట్లు పెరగడంతో అప్పుల ఖరీదు పెరిగి ఆర్ధిక వ్యవస్ధలో చురుకుదనం మందగించింది. పెరిగిన వడ్డీ రేట్లు మార్కెట్లోని మదుపుదారులకు అధికంగా కనిపించడంతో వారు రుణాలు తీసుకుని పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నారు. అది జి.డి.పి వృద్ధి రెటుపై ప్రభావం చూపుతున్నది. అంటే పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలో భారత దేశానికి సంబంధించినంతవరకూ అధిక జిడిపి వృద్ధి రేటు వలన ధరలు పెరిగి, దాని ద్వారా ద్రవోల్బణం పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గించడానికి వడ్డీ రేట్లు పెంచడం, పెంచిన వడ్డీ రేట్లవలన పెట్టుబడి ఖరీదు పెరిగి పెట్టుబడులు తగ్గిపోవడం, దానితో అంతిమంగా జిడిపి వృద్ధి పడిపోవడం జరుగుతోంది. ఈ సైకిల్ ని పరిశీలించినట్లయితే జిడిపి అధికంగా వృద్ధి చెంది చుట్టూ తిరిగొచ్చి అదే జిడిపి వృద్ధి రేటు తగ్గిపోవడానికి కారణం అవుతోందని అర్ధం అవుతోంది.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ప్రధాని మన్మోహన్, ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ద్రవోల్బణం కట్టడిపై మూడు సంవత్సరాలుగా చెప్పిన కబురు చెప్పకుండా, ఇచ్చిన వాగ్దానం ఇవ్వకుండా వచ్చినా దాన్ని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. పైగా ధరలు ఇంకా మండిపోతూ సామాన్యుడి బతుకుని ఛిద్రం చేస్తున్నాయి. టోకు ధరల సూచి జులై నెలలో 9.22 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. 4 నుండి 4.5 శాతం వరకు టోకు ధరలు సూచి పెరుగుదలను నమోదు చేస్తే అది ఆమోదయోగ్యంగా ప్రభుత్వం భావిస్తుంది. కాని జులై పెరుగుదల దానికి రెట్టింపు కంటే అధికంగా ఉండడం గమనార్హం.
బ్రిక్ దేశాల కూటమిలో బ్రెజిల్, చైనా తర్వాత ఆర్ధిక వృద్ధి రేటు తగ్గుతున్న దేశాల్లో ఇండియా తదుపరి స్ధానాన్ని ఆక్రమించుకుని వార్తల్లో నిలిచింది. ద్రవ్యోల్బణం పెరగడానికి సరఫరా సంబంధిత అవరోధాలను కారణాలుగా చూపుతూ సరఫరా వ్యవస్ధను మెరుగుపరిచే పేరుతో ప్రధాని రిటైల్ రంగాన్ని ప్రవేటీకరణ చేయాలని తలపెడుతున్నాడు. సంక్షోభం లో ఉన్న పరిస్ధితిని మరింత సంక్షోభం లోకి నెట్టడం తప్ప వీరి విధానాలు ప్రజలకు ఎలాంటి ఉపశమనమూ కలిగించడం లేదు.
వ్యవసాయ రంగం, నిర్మాణ, పరిశ్రమల రంగాలు ఉత్పత్తిలో తరుగుదలను నమోదు చేస్తున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు సమయానికి కురవకుండా రైతులను ఇబ్బంది పెట్టాయి. ఆ తర్వాత మామూలు కంటే తక్కువే అయినా వర్షాలు ఫర్వాలేదనిపించాయి. కాని ఆలస్యంగా పడిన వర్షాలు రైతుల అవసరాలకు పెద్దగా ఉపయోగపడలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి ఎరువుల అందుబాటులో లేకుండా పోయాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎరువుల కోసం రైతులు పిల్లాజెల్లతో కలిసి రాత్రింబవళ్లు క్యూలలో గడుపుతున్నారు. ఇవేవీ రాష్ట్ర ప్రభుత్వానికి కనపడడం లేదు. రాజకీయ సంక్షోభం లోపడి ప్రజల అవసరాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
