ఈ బ్లాగు ఎర్ర కళ్లద్దాలతో రాస్తున్నదా?


Globe in spectaclesతెలుగు బ్లాగర్లలో మిత్రుడొకరు నాబ్లాగుని “అంతర్జాతీయ వార్తలను ఎర్రకళ్లద్దాలతో చూస్తూ వండి వార్చే బ్లాగని…” సర్టిఫికెట్ ఇచ్చారు. అలా రాస్తూనే ఒక వాస్తవం కూడా చెప్పుకొచ్చారు, ఎవరైనా తమ దృక్కోణంతోనే వార్తల్ని చూస్తారనీ, లేక చదివాకైనా తమ దృక్కోణాన్ని ఏర్పాటు చేసుకుంటారనీనూ. అదిలా ఉంది:

మనకు నిత్యం అంతర్జాతీయ వార్తలను ఎర్ర కళ్ళద్దాలతో వీక్షించి వండి వార్చే బ్లాగొకటి ఉంది. అఫ్ కోర్స్, అదేం తప్పు కాదనుకోండి, ప్రతి ఒక్కరం ఒక వార్తని ఏదో ఒక దృక్కోణములోనుంచే చదువుతాం లేదా చదివిన తరువాత ఆలోచిస్తాం. ఈ రోజు ఆ బ్లాగులో దళితుల గురించి…

గతంలో కూడా కొంతమంది అటువంటి సూచనలని తమ వ్యాఖ్యల ద్వారా తెలియజేశారు. వారికి నేను ఒక విషయం చెప్పదలిచాను. అది పై బ్లాగర్‌కి ఇప్పటికే సమాధానంగా ఇచ్చినందున దానినే తిరిగి ఇక్కడ ప్రచురిస్తున్నాను.

మీరనుకుంటున్నట్లు ఎర్ర కళ్లాద్దాలు నా కళ్లకు లేవు. నా కళ్లద్దాలకు ఏ రంగూ లేదు. నా కళ్ళద్దాలనుండి చూస్తే ఉన్నది ఉన్నట్లు కనిపిస్తుంది. నేను నా కళ్ళద్దాలను తీసి చూస్తే నాకు ప్రపంచం సరిగా కనిపించదు. బూజర బూజరగా అంతా అల్లుకుపోయినట్లు కనిపిస్తుంది. ఏవో ఆకారాలు కదులుతున్నట్లుంటుంది తప్ప కదిలే ఆకారాలు ఏవో నేను గ్రహించలేను.

నేనే కాదు, దృష్టిలోపం ఉన్నవారెవరికయినా కళ్లద్దాలు అవసరమే. దృష్టిలోపం స్ధాయిని బట్టి కళ్లద్దాల మందం మారుతూ ఉంటుంది. కళ్ళద్దాలు ఫలానా వాళ్ళు మాత్రమే ధరించాలన్న రూలేమీ లేదు. దృష్టిలోపం ఉన్నవారెవరైనా కళ్లద్దాలు వాడవలసిందే. కళ్లద్దాలు లేకుండా అల్లుకుపోయిన చిత్రాలతో కనిపించే ప్రపంచంపై వ్యాఖ్యానించడానికి ప్రయత్నిస్తే ఆ వ్యాఖ్యానాలలో వాస్తవం ప్రతిబింబించదు. కళ్ళద్దాలు ఎరుపా, పసుపా అని కాదు మనం చూడవలసింది. వారు చెబుతున్నది వాస్తవమా కాదా అన్నది చూడాలి. వాస్తవం కాదనిపిస్తే ఎందుకు కాదో చెప్పవచ్చు. మీరు చూడగలిగిన వాస్తవాన్ని చూడలేనివారికి వివరించవచ్చు.

ఇది నేను సమాధానం ఇచ్చిన బ్లాగర్ పై చేసిన విమర్శ కాదు. ఇది కేవలం self explanatory మాత్రమే.

10 thoughts on “ఈ బ్లాగు ఎర్ర కళ్లద్దాలతో రాస్తున్నదా?

  1. ఈ ఎర్రకళ్లద్దాల ముద్ర మీకింకా రాకపోతే ఆశ్చర్యపోవాలి. ఒక దృక్పథం అంటూ లేకుండా ఉండేవారు, ఏది బడితే అది చదివేవారు, రాసేవారు, ఇష్టమొచ్చినట్లు జీవించే వారు.. ఈ ప్రపంచంలో ఎక్కడయినా ఉంటారా? పంక్తుల మధ్య ఉన్న వార్తలకు, పంక్తులలో దాగిన వార్తలకు మధ్య తేడాను చూపించడం తప్పెలా అవుతుంది? ఎర్ర కళ్లద్దాలు వద్దు. నిజమే.. మరి నీలికళ్లద్దాలు, నల్ల కళ్లద్దాలు ముద్దామరి. ఎవరి అద్దాలు వాళ్లకు ముద్దయినప్పుడు పక్కవాడి అద్దాలపైకి పోవడం ఎందుకు?

    చెబుతున్న దాంట్లో తప్పొప్పులను బేరీజు వేయడం తెలీని సంకుచిత మనస్కులే ఇలాంటి అడ్డగోలు వాదనలు చేస్తుంటారు.

    తెలుగులో విశ్లేషణ కలిగిన వార్తలు లేని కరువు తీరుస్తున్న వేదిక ఇది. మీరు ఇలాగే కొనసాగండి. ఎవరికి కావలసింది వాళ్లు ఎంచుకుంటారు. ఈ వేదికను పంచుకోవడం ఇష్టం లేని వాళ్లు తప్పుకుంటారు. బురద జల్లడానికి బదులు అలా తప్పుకోవడమే మంచిది.

    “ఎరుపంటే కొందరికి భయం భయం
    పసిపిల్లలు వారికంటే నయం నయం”

    అని నలభయ్యేళ్ల క్రితం ఒక ప్రజాకవి సెలవిచ్చారు. ఆ పసిపిల్లల కోసమే మీరు రాయండి చాలు..

    ఎర్ర కళ్లద్దాలలోంచి ప్రపంచాన్ని చూస్తున్నవారు మానవజాతి సాధించిన సమస్త విజ్ఞానాంశాలను తమవిగా భావిస్తున్నారని, అవి చెప్పే విషయాలను వినమ్రంగా స్వీకరిస్తున్నారని చాలామందికి తెలీదనుకుంటాను.

  2. పెట్టుబడిదారునికీ, అవినీతిపరునికీ మధ్య ఒకటే మౌలికమైన తేడా ఉంది. పెట్టుబడిదారుడు చట్టం అనుమతించిన పద్దతుల్లో దోచుకుంటాడు, అవినీతిపరుడు చట్టం అనుమతి లేని పద్దతుల్లో దోచుకుంటాడు. మనవి ఎర్ర కళ్ళద్దాలు అని విమర్శించేవాళ్ళకి రెండో రకం దోపిడీ మాత్రమే దోపిడీలాగ కనిపిస్తుంది.

  3. దృక్పథాలేమీ లేకుండా రాయటం నిష్పాక్షికంగా ఉన్నట్టనిపిస్తుంది. కానీ అసలు ఏ దృక్పథమూ లేనివారు ఎవరూ ఉండరు. అది వారికి తెలియొచ్చు; తెలీకపోవచ్చు. ఒక సిద్ధాంతాన్ని నమ్మటం, ఆ అవగాహనతో రాయటం నేరమేమీ కాదు. ఆ రాతలు నచ్చనివాళ్ళు ఉంటారు, వారే కాకుండా మీ బ్లాగు వార్తలూ, విశ్లేషణలను ఆసక్తిగా చదివేవారూ ఉంటారని గుర్తుంచుకోండి.
    మార్క్సిస్టులంటేనూ, కమ్యూనిస్టులంటేనూ వ్యతిరేకత ఉన్నవారు తమకున్న అవగాహన ప్రకారమే విమర్శలు కురిపిస్తుంటారు కదా? వాటిలో సబబు ఏమీ లేనపుడు వాటిని పట్టించుకోవటం అనవసరం.

  4. వేణూ గారూ, మీరు చెప్పింది నా దృష్టిలో ఉంది. నేను ఈ పోస్టులో చెప్పదలుచుకున్నది:
    అద్దాల రంగు కాదు, విషయం చూడాలి అని.
    అందరూ అద్దాలు ధరిస్తారని భావిస్తే, నేను ధరించేది వాస్తవాలు కనిపించే కళ్ళాద్దాలు అని చెప్పడానికి.
    వాస్తవాలు కనపడాలంటే అవి కనపడే అద్దాలు ధరించాల్సిందే అని.
    మార్క్సిజం కళ్ళద్దాల్లో వాస్తవం కనిపిస్తుంటే, అవి ధరించడానికి జంకు ఎందుకు? అని ప్రశ్నించడానికి.

  5. http://www.thehindu.com/news/states/other-states/article2412137.ece

    ఈ న్యూస్ ఏ తెలుగు పేపర్లోనూ వచ్చి ఉండదు. కానీ ఎవరో ఊరూ పేరూ లేని ముల్లానో, పాస్టరో ఏదైనా మతిలేకుండా మాట్లాడితే అది మన తెలుగు పత్రికల్లో తప్పకుండా కనిపిస్తుంది. ఇక ఇలాంటి ప్రాంతీయ/సంకుచిత వార్తలు మాత్రమే చదివి, సంకుచిత అభిప్రాయాలు ఏర్పరచుకుని తమకు అన్నీ తెలుసనుకునే వాల్లు ఎదుటివాల్లకు ఏదో ఒక బ్రాండ్ తగిలించి తక్కువ చేసి మాట్లాడాలనే చూస్తారు.
    వీరిగురించి మీకు ఒక్కటే సలహా ఇవ్వగలను. అది .. “IGNORE KAR YAAR !!!”

  6. నిజం చెప్పారు. నేనీ వార్తను కవర్ చేస్తాను. ఇప్పుడు వేరే పనిలో ఉన్నాను. అది అయ్యాక తప్పకుండా రాస్తాను. మీకు ధన్యవాదాలు, సూరజ్.

  7. ఒకడు ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకున్నాడా, పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్నాడా అనేది అనవసరం. అతను చెప్పేది నిజమా, కాదా అనేది ముఖ్యం. సమాజం నుంచి మార్క్సిజం పుట్టింది కనుక సమాజంలో జరిగేవాటి గురించే మార్క్సిస్ట్‌లు వ్రాస్తారు. అంతే కానీ మార్క్సిజం నుంచి సమాజం పుట్టింది కనుక సమాజం ఇలాగే ఉంటుందని ఏ మార్క్సిస్టూ అనలేదు, అలా అనే అవకాశం లేదు. ఈ లింక్ చదవండి, విషయం కొంత వరకు అర్థమవుతుంది. https://plus.google.com/111113261980146074416/posts/VKVsGgv2yqV

  8. నిజానికి “నిజం” అని అనుకునేదానికి తేడా ఉంది. మీ బ్లాగుల్లో నిజాలతో పాటు మీరు “నిజం అనుకుంటున్న” వన్నీ కలిపేసి రాసి పారేసి జనాలపైకి వదులుతున్నారు. ఒక్కోసారి అది శ్రుతిమించిపోతుందేమో చూసుకోండి. మరొక్కసారి చెప్తున్నా..”ఆ కల్లద్దాలు తీసి లోకాన్ని తిలకించండి”

వ్యాఖ్యానించండి