అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ ఐ.ఎం.ఎఫ్ ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించింది. మూడు సంవత్సరాల క్రితం ఏర్పడిన తీవ్ర ఆర్ధిక సంక్షోభం నుండి కుంటుతూ కోలుకుంటున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మరోసారి సంక్షోభంలో జారిపోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. వెంటనే చర్యలు తీసుకుంటే తప్ప దాన్ని అరికట్టలేమని ఐ.ఎం.ఎఫ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్ట్రీన్ లాగార్డే తెలియజేసింది.
“ఈ వేసవిలో జరిగిన పరిణమాలు, మనం ప్రమాదకరమైన కొత్త దశలో ఉన్నమాని సూచిస్తున్నాయి. బలహీనంగా ఉన్న ఆర్ధిక రికవరీ మరొకసారి దారితప్పే అవకాసం కనిపిస్తోంది. కనుక మనం వెంటనే చర్యలు చేపట్టాలి” అని లాగార్దే పేర్కొంది. ఆర్ధిక సంక్షోభం ముగిసిన రెండేళ్ళ అనంతరం అమెరికా, యూరప్ ల ఆర్ధిక రికవరీ దాదాపు స్తంభించిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. దానికి ప్రభుత్వాల అప్పులు కారణమని ఐ.ఎం.ఎఫ్ చెబుతోంది. నిజానికి పెట్టుబడిదారీ వ్యవస్ధ పని తీరే ఆర్ధిక సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నదని అమెరికా యూరప్ లకు తెలిసినప్పటికీ తెలియనట్లు నటిస్తున్నాయి. జి20 గ్రూపు దేశాల సమావేశాల్లో అమోదించిన చర్యలను అమలు చేసినట్లయితే రికవరీ ఇంత బలహీనంగా ఉండకపోను.
యూరప్ బ్యాంకులకు అప్పుల సేకరణ ఖరీదు వ్యవహారంగా మారింది. అతి తక్కువ వ్యవధి బాండ్లను సేకరించడం పైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. తద్వారా తమ పెట్టుబడులు విషతుల్యంగా మారకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. షేర్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు తీక్షణంగా మారాయి. ఈ పరిస్ధితుల్లో యూరప్ అమెరికాల్లో విధానాల రూపకర్తలు స్పందించడం లేదని ఇన్‌వెస్టర్లు భావిస్తున్నారు. యూరోపియన్ ప్రభుత్వాలు సావరిన్ అప్పులను రీ షేడ్యూల్ చేసేటప్పుడు ప్రవేటు ఇన్‌వెస్టర్లు కూడా కొంత భారాన్ని మోయాలని కోరుకుంటున్నాయి. దానితో యూరోపియన్ దేశాల బాండ్ల కొనుగోలుకు ఇన్‌వెస్టర్లు మొగ్గు చూపడం తగ్గింది.
నవంబరులో జరగనున్న జి20 సమావేశాన్ని ఈ సంక్షోభ పరిష్కారాలపై దృష్టిపెట్టాలనీ, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సమస్యలను సరైన పద్ధతుల్లో పరిష్కరించేందుకు పూనుకోవాలని లాగార్డే కోరింది. వీలయితే ప్రవేటు ఛానెళ్ల ద్వారా లేదా కనీసం ప్రభుత్వంద్వారానైనా Mandatory substantial recapitalisation” కార్యక్రమాన్ని పరిగణించాలని ఆమె పేర్కొన్నది. అంటే ఐ.ఎం.ఎఫ్ స్వయంగా దేశాల ఆర్దిక వ్యవష్దలలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నదన్నమాట! అవును మరి, సహాయం కావలసింది కార్పొరెట్ కంపెనీలకు కదా! కార్పొరెట్ కంపెనీలకు ప్రభుత్వాలు ఎన్ని ట్రిలియన్లనయినా గుమ్మరించవచ్చు గానీ ప్రజల కష్టాలను తొలగించడానికి, వారి జీవన ప్రమాణలాను పెంచడానికి మాత్రం ప్రభుత్వం జోక్యం ఉండకూడదు. సంక్షేమ పధకాలకు ప్రభుత్వం నిధులివ్వకూడదు. వయోవృద్ధులకు పెన్షన్ సొకర్యాన్నీ, నిరుద్యోగులకు భృతినీ మాత్రం ప్రభుత్వం ఇవ్వకూడదు. ప్రవేటు బడా కంపెనీలు వెధవ పనులు చేసి దివాలా తీస్తే మాత్రం ప్రభుత్వం ట్రిలియన్లను కుమ్మరించాలి.
ద్రవ్య పరపతి విధానం కూడా కఠినంగా ఉండకూడదని లాగార్డే ప్రభోధించింది. అంటే సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను అతి తక్కువ స్ధాయి లోనే కొనసాగించాలని లాగార్డే కోరుతోంది. అవసరమైతే సెంట్రల్ బ్యాంకులు సాంప్రదాయేతర పద్దతులలో రికవరీకి తోడ్పడడానికి (బిలియన్ల కొద్దీ బెయిలౌట్లు ఇవ్వడానికి) సిద్ధంగా ఉండాలి అని లాగార్డే పేర్కొంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధిపతి బెర్నాంక్ మాత్రం అందరూ ఎదురుచూసినట్లు క్వాంటిటేటివ్ ఈజింగ్ – 3 (ఫెడరల్ రిజర్వే అమెరికా బాండ్లను కొనుగోలు చేసి డబ్బుని మార్కెట్లోకి వదలడం) ఇస్తున్నట్లు సూచనలేవీ ఇవ్వలేదు. దానితో శుక్రఫారం ఇండియా షేర్లు రెండు శాతం వరకూ పడిపోయాయి.
యూరప్ లో కుంటుతూ నడుస్తున్న రాజకీయ ప్రక్రియలు అభద్రతను మరింత పెంచుతున్నాయని లాగార్డే వాపోయింది. యూరోపియన్ బ్యాంకులు అవసరానికి తగినట్లు నిధుల్ని సేకరించడంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నాయి. యూరప్ అప్పు సంక్షోభం ఇంకా వ్యాపించకుండా ఉండాలంటే బ్యాంకులు పెట్టుబడులు పొగేసుకోవాల్సిన అవసరం ఉందని లాగార్డే తెలిపింది. కాని అక్కడే బ్యాంకులు విఫలమవుతున్నాయి. ప్రజలపై అమలు జరుపుతున్న పొదుపు ఆర్ధిక విధానాల వలన ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో వారు బ్యాంకుల్లో పొదుపు చేసుకోవడానికి డబ్బు మిగులడం లేదు. దానితో భవిష్యత్తు అవసరాల నిమిత్తం బ్యాంకుల్లో దాచుకునే వీలు ప్రజలకు బాగా క్షీణించింది. ఫలితమే బ్యాంకులు డిపాజిట్లు సేకరించలేకపోవడం. అమెరికా సమీప భవిష్యత్తులో జిడిపి వృద్ధి రేటు గురించి మర్చిపోయి దీర్ఘకాలికంగా బడ్జెట్ లోటును తగ్గించుకోవడంపై కేంద్రీకరించడం సరికాదని షార్ట్ టర్మ్ వృద్ధి కూడా ముఖ్యమైనదేననీ లాగార్డే పేర్కొంది. ఐరోపా దేశాలు మరొకసారి లోటు తగ్గించే చర్యలకు (పొదుపు చర్యలకు) దిగాలని కోరింది.
మరోవైపు దీర్ఘకాలిక మాంద్యాన్ని పొదుపు చర్యలద్వారా ఎదుర్కొనలేమని కూడా లాగార్డే అంగీకరిస్తోంది. దీర్ఘకాలిక నిరుద్యోగం, సామాజిక అసంతృప్తిలు ఉన్నపుడు కేవలం పొదుపు చర్యలపైనే ఆధారపడలేమని లాగార్డే అంగీకరిస్తోంది.