ఆదివారం తన నిరవధిక నిరాహార దీక్షను ముగించనున్న అన్నా హజారే


అన్నా అభిమానులకు శుభవార్త. ప్రభుత్వం అన్నా ప్రతిపాదించిన మూడు డిమాండ్లను పార్లమెంటులో ఓటింగ్ కి పెట్టడానికి అంగీకరిస్తున్నట్లు పౌర సమాజ ప్రతినిధులకు ప్రణబ్ ముఖర్జీ లేఖ రాయడంతో అన్నా బృందంలో ఆనందం వెల్లివిరిసింది.

శనివారం ఈ మేరకు తమకు లేఖ అందినట్లుగా అన్నా బృందం విలేఖరులకి తెలిపింది. లోక్ పాల్ బిల్లుపై తమ డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ఓటింగ్ కి ప్రవేశపెడుతున్నట్లు గా ప్రభుత్వం నుండి తమకు సమాచారం అందిందని టీమ్ అన్నా తెలిపింది. ఈ పరిణామం ‘సంతోషకరమైన పరిణామం’ గా అన్నా బృందం అభివర్ణించింది.

శనివారం అన్నా బృందం ప్రతిపాదించిన మూడు డిమాండ్లపైన పార్లమెంటు అవగాహనను మాత్రమే అన్నా బృందానికి తెలియ జేయాలనీ, తీర్మానాన్ని వోటింగ్ కి పెట్టరాదనీ నిర్ణయించినట్లు తెలియడంతో ప్రభుత్వం తమను మోసగించిందని టీం అన్నా ఆరోపించింది. తీర్మానాన్ని ఓటింగ్ కి పెడితేనే తమకు ఆమోదయోగ్యమని వారు తెలిపారు. ఈ లోపు బి.జె.పి అన్నా తీర్మానాలను అంగీకరించడం లేదని ఆరోపించడంతో లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ అదేమీ లేదని తాము అన్నా ప్రతిపాదనలకు మద్దతు నిస్తామనీ ప్రకటించడంతో ఆ వివాదం సద్దుమణిగింది.

అన్నా బృందం పట్టుదలతో ప్రభుత్వం మళ్లీ తమ నిర్ణయాన్ని మార్చుకుంది. “ఈ పరిణామంతో మేము చాలా సంతోషంగా ఉన్నాము” అని అన్నా బృందం ప్రతినిధి తెలియజేశాడు. హజారే దీక్ష ఎప్పుడు ముగిస్తారని ప్రశ్నించగా ఆ ప్రతినిధి సాధారణంగా ఆయన ఉదయం పూట మాత్రమే దీక్ష ముగిస్తారనీ, ఆయన నిర్ణయం ప్రకారం జరుగుతుందనీ ప్రతినిధి తెలిపాడు.

అయితే పౌర సమాజ బృంద సభ్యురాలు కిరణ్ బేడీ అన్నా ఆదివారం దీక్ష ముగిస్తారని స్పష్టం చేసింది. సూర్యుడు అస్తమించాక అన్నా దీక్షను విరమించరనీ సూర్యుడు ఉదయించాక మాత్రమే దీక్ష విరమిస్తారని కనుక ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయన దీక్షవిరమిస్తారని ప్రకటించిందావిడ. ఈ మేరకు పి.టి.ఐ వార్తా సంస్ధకు తెలిపినట్లుగా ది హిందూ తెలియజేసింది. ఆదివారం ఉదయం పది గంటలకు అన్నా దీక్ష విరమించిన పక్షంలో ఆయన 288 గంటలపాటు నిరాహారదీక్ష చేసినట్లవుతుందని ఆ పత్రిక తెలిపింది.

వ్యాఖ్యానించండి