అన్నా హాజారే, ఆయన నిరాహార దీక్ష పరిస్ధితులను పరిశీలిస్తున్నామని అమెరికా మరోమారు ప్రకటించింది. హజారేకు మద్దతుగా కొద్ది రోజుల క్రితం ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ హజారే దీక్షకు అమెరికా మద్దతు ఉందేమోనని అనుమానం వ్యక్తం చేసింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి ఇంతవరకూ ఇండియా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా కలగజేసుకున్నది లేదనీ, మొదటిసారిగా హజారే దీక్షను భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిష్కరించాలని ప్రకటించడంతో హజారే దీక్ష, ఉద్యమానికి అమెరికా మద్దతు ఉన్నట్లు భావించవలసి వస్తున్నదనీ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
హజారే వెనక తాము లేమంటూనే అమెరికా హజారే దీక్షపై వ్యాఖ్యానించడం ఇది మూడవసారి. మొదట హజారే దీక్షపై నిర్భంధం కూడదనీ, ప్రజాస్వామిక పద్ధతుల్లో పరిష్కరించాలని ప్రకటించిన అమెరికా, కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేశాక “హజారే వెనుక మేము లేము. ఆ విషయం భారత అంతర్గత వ్యవహారం” అంటూనే మరొకసారి ప్రజాస్వామిక పద్ధతుల్లో అన్నా దీక్షపట్ల వ్యవహరించాలని కోరింది. తాజాగా ‘భారతదేశం ఈ సవాలును ప్రజస్వామిక పద్దతుల పరిధిలో పరిష్కరించుకోగలదన్న నమ్మకం ఉందని’ పేర్కొంది. మూడు సార్లూ అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి విక్టోరియా నూలందే హజారే విషయంలో పత్రికలతో మాట్లాడింది. భారత దేశంలో తమ రాయబార కార్యాలయం పరిస్ధితిని దగ్గరినుండి పరిశీలిస్తోందని ప్రకటించింది.
“మా రాయబార కార్యాలయం పరిస్ధితిని పరిశీలిస్తోంది. మేమిక్కడ చెబుతున్నదే భారత దేశంలో కూడా చెబుతున్నారని భావిస్తున్నాను. తన అంతర్గత విషయాలు, రాజకీయ విభేధాలూ లాంటి సవాళ్ళను తన సొంత ప్రజాస్వామిక వ్యవస్ధ ద్వారానే పరిష్కరించుకోగలదని మాకున్న నమ్మకాన్నీ, అంచనాలనే భారత ప్రభుత్వం కూడా చెబుతున్నదని భావిస్తున్నాను” ని విక్టోరియా నూలంద్ తన రోజువారీ పత్రికా సమావేశంలో భాగంగా వ్యాఖ్యానించింది.
అంతటితో ఆగకుండా శాంతియుత పద్ధతుల్లో నిరసన చేసుకునే హక్కుకు అమెరికా ఎప్పుడూ మద్దతునిస్తుంది అని అపద్ధపు కూత కూసింది. “శాంతియుత నిరసనకు మేము ఎప్పుడూ మద్దతునిస్తాం. ముఖ్యంగా అమెరికాలో కూడా” అని ఆమె పేర్కొంది. వాషింగ్టన్ లోని ఇండియా రాయబార కార్యాలయం ముందు హజారే మద్దతుదారుల నిరసనలపై అడిగిన ప్రశ్నకు ఈ సమాధానాన్ని నూలంద్ ఇచ్చింది. శుక్రవారంతో అన్నా హజారే దీక్ష పదకొండవ రోజుకి చేరుకుంది. అయనప్పటికీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు. కానీ పౌర సమాజ బృందం హజారే ఆరోగ్యం క్షీణిస్తున్నదని చెబుతున్నారు.
యూరప్ దేశాల లాగే అమెరికాలో కూడా బడ్జెట్ లోటు తగ్గించడం, అప్పును తగ్గించడం అన్న జంట లక్ష్యాల పేరు చెప్పి పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేయడం ప్రారంభిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా అమెరికాలో జరుగుతున్న నిరసనలు, ఆందోళనలు మరింత తీవ్రం అవుతాయి. ఓ వైపు అమెరికన్లకు నిరసన చేసినా హజారే లాగా స్వయం శిక్షా పద్ధతిలో నిరసన చేయాలన్న బోధనను పరోక్షంగా చేస్తూ మరోవైపు ఇండియాలోని అంతర్గత రాజకీయ విభేధాలలోకి చొరబడే ప్రయత్నం అమెరికా ప్రభుత్వం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంస్కరణల బిల్లులు కొద్ది నెలలుగా మూలన పడటం కూడా అమెరికాకు అసహనం కలిగిస్తున్నది. ఈ పరిస్ధితినుండి హజారే దీక్షపై అమెరికా చేస్తున్న ప్రకటనలను వేరుగా చూడలేము.

ఇది వ్యూహాత్మకంగా అమెరికా అన్నాహజారే ఉద్యమంపై అనుమానం కలగజేయడానికి వేస్తున్న ఎత్తుగడ
దానికీ అవకాశం ఉంది దుర్గేశ్వర గారు.