మా మూడు డిమాండ్లు ఒప్పుకుంటే దీక్ష విరమిస్తా -ప్రధానికి అన్నా లేఖ


శుక్రవారం అన్నా హజారే ప్రధానికి మరొక లేఖ రాశాడు. తమ మూడు కీలక డిమాండ్లను అంగీకరిస్తే దీక్ష విరమిస్తానని ప్రకటించాడు. సివిల్ సర్వెంట్లు అంతా లోక్ పాల్ చట్టం పరిధిలోకి తేవాలి; అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ ‘సిటిజన్ చార్టర్’ ను ప్రదర్శించాలి; అన్ని రాష్ట్రాలూ లోకాయుక్త ను నియమించుకోవాలి. ఈ మూడు డిమాండ్ల తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించాలని అన్నా కోరాడు. డిమాండ్లు అంగీకరించడంతో సరిపెట్టకుండా ఆ మేరకు చట్టాన్ని ఆమోదిస్తేనే దీక్ష విరమిస్తానని అన్నా తెలిపాడు. “ఈ ప్రతిపాదనలపై ఏకాభిప్రాయం వచ్చినట్లయితే నా నిరాహార దీక్ష విరమించుకోవచ్చని నా అంతరాత్మ నాకు చెబుతోంది. జన్ లోక్ బిల్ లో ఎన్నిక ప్రక్రియ లాంటి ఇతర అంశాలు కూడా ముఖ్యమైనవే” అన్నా ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నాడు.

“ఇతర అంశాలపై పార్లమెంటు నిర్ణయం తీసుకునే వరకూ నేనూ, నా మద్దతుదారులు రాం లీలా మైదాన్ లోనే ఉంటాము. ఎందుకంటే ఇది ప్రజా వాక్కు” అని హజారే రాశాడు. శక్తివంతమైన లోక్ బిల్లుకోసం జరుగుతున్న ఉద్యమాన్ని గౌరవించినందుకు కృతజ్ఞత తెలుపుతూ హజారే పార్లమెంటు అనేది ప్రజాస్వామ్య వ్యవస్ధలో పవిత్ర దేవాలయంతో సమానమన్న అత్యున్నత గౌరవం తనకున్నదని చెప్పాడు. తన స్వప్రయోజనాల కోసం దీక్ష చేయడం లేదని గుర్తు చేశాడు. తనకు ఎటువంటి అధికారాలూ లేవనీ, సామాన్య మానవుడిననీ చెప్పుకున్నాడు. సామాన్య మానవుడు అవినీతి వలన కష్టాలు పడుతున్నపుడు చూస్తూ ఊరకుండటం తనకు కష్టమైన విషయమని తెలిపాడు. సామాన్య మానవుడిని కష్టపెట్టే అంశాలకు సంబంధించినవే తాను చెబుతున్న మూడు కీలక డిమాండ్లని తెలిపాడు.

“ఈ మూడు ప్రతిపాధనలను పార్లమెంటు ముందుకు తేవడం వీలవుతుందా? అవినీతి బాధితులైన సామాన్య మానవుడికి స్వాంతన చేకూర్చేందుకు పార్లమెంటు సభ్యులు ఈ మూడు ప్రతిపాదనలను ఆమోదిస్తారన్న నమ్మకం నాకు ఉంది” అని లేఖలో అన్నా పేర్కొన్నాడు. ఎం.పిలు కూడా ఈ దేశా వ్యాపిత ఉద్యమంలో భాగస్వాములు కావాలని అన్నా పిలుపిచ్చాడు. తమ ఉద్యమం వ్యక్తిగతంగా ఎవరి మీదా ఎక్కు పెట్టబడింది కాదనీ, తన లేదా తన సహచరుల వ్యాఖ్యలు ఎవరినైనా బాధించినట్లయితే అందుకు క్షంతవ్యుడ్నని హజారే రాశాడు. అవినీతి, భారతదేశానికి ప్రపంచంలో అపఖ్యాతి తెచ్చిపెట్టిందని గుర్తు చేశాడు. నియమ నిబంధనలు, చట్టాలు అన్నీ ప్రజలకు లోబడి ఉండవలసిందేననీ పేర్కొన్నాడు.

పార్లమెంటులో అన్నా డిమాండ్లపై చర్చ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. అన్నా చేస్తున్న మూడు ప్రతిపాదనలకు, జన్ లోక్ పాల్ బిల్లుకూ సంబంధం ఉన్నదీ లేనిదీ తెలియలేదు. జన్ లోక్ పాల్ బిల్లుకు మూడు డిమాండ్లు అదనమా లేక జన్ లోక్ పాల్ లో భాగమా అన్నదీ తెలియలేదు. కాని మూడు డిమాండ్లను ప్రస్తావించిన లేఖలో జన్ లోక్ పాల్ బిల్లుగురించి ఏమీ లేకపోవడం గమనార్హం. ప్రస్తుతానికి మూడు డిమాండ్లను ఆమోదించి భవిష్యత్ రోజుల్లో లేదా రాబోయే సెషన్ (చలికాలం సమావేశాలు) లో జన్ లోక్ పాల్ పై చర్చలు జరుపుతారా అన్నది కూడా తెలియలేదు. మూడు డిమాండ్లు, జన్ లోక్ పాల్ బిల్లు ల మధ్య కొంత సందిగ్డత నెలకొన్నట్లు కనిపిస్తోంది.

వ్యాఖ్యానించండి