ప్రభుత్వం అన్నా హజారే ఆరోగ్యం కోసం తపన పడుతోంది. కనీసం తపన పడుతున్నట్లు నటిస్తోంది. అన్నా హజారే ప్రాణాలు చాలా విలువైనవనీ, అవి దేశానికి చాలా అవసరమనీ, ఆయన సలహాలు ప్రభుత్వానికి అవసరమనీ కనుక ఆయన వెంటనే తన నిరాహార దీక్షను ఉపసంహరించుకోవాలని గురువారం పార్లమెంటులో ప్రధాని విజ్ఞప్తి చేశాడు. బుధవారం జరిగిన అఖిల పక్ష సమావేశం కూడా అన్నా హజారే దీక్ష విరమించాలని కోరింది. గురువారం లోక్ సభ లో ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ లు కూడా అన్నా హజారే ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ శక్తివంతమైన లోక్ పాల్ బిల్లుని ఆమోదిస్తామని హామీ ఇస్తూ దీక్ష విరమించమని కోరారు.
భారత దేశంలో అట్టడుగున పడి కాన్పించని గాధలకు కొదవ లేదు. మణిపూర్‌లో ప్రజల బ్రతుకులను దుర్భరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ “సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం” ఉపసంహరించాలని కోరుతూ “ఇరోమి షర్మిల” అనే మహిళ దాదాపు పది సంవత్సరాల నుండి నిరాహార దీక్ష చేస్తోంది. ఆమెకిప్పుడు బలవంతంగా ముక్కుల్లో పైపులు దూర్చి ఆహారం ఎక్కిస్తున్నారు. ఆ స్ధితిలో కూడా ఆమె తన దీక్షను వదల లేదు. కాని ఇరోమి షర్మిలా గురించి తెలిసిన వారు చాలా అరుదు. పత్రికలకు అది పెద్ద వార్త కాదు. పౌర సమాజ కార్యకర్తలకు ఎందువలనో ఆమె దీక్షకు మద్దతు ఇవ్వాలన్న ఆలోచన తట్టలేదు. అసలామె దీక్షలో ఉన్న సంగతిని పౌర సమాజ నాయకులకు తెలుసునో లేదో కూడా అనుమానమే.
మరో పక్క అన్నా హజారే, దీక్ష విరమించడానికి మూడు షరతులు విధించాడు. శుక్రవారం ఉదయం పార్లెమెంటు సమావేశాలు జన్ లోక్ పాల్ బిల్లుపై చర్చతోనే ప్రారంభం కావాలన్నాడు. రాష్ట్రాలకు శక్తివంతమైన లోకాయుక్త చట్టాలను తేవాలన్నాడు. ప్రతి ఆఫీసులో ప్రతి పనికి ఎంత సమయం పడుతుందీ, ఆ పనికి ఎవరు బాధ్యులు అని తెలియజేస్తూ బోర్డులు పెట్టాలని కోరాడు. తన కోరికలు నెరవేరకపోతే దీక్షను విరమించేది లేదని తెలిపాడు. శుక్రవారం తాము కోరినట్లు జన్ లోక్ పాల్ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరక్కపోతే దేశంలో నలుమూలలనుండీ లక్షలమంది ఢిల్లీకి వచ్చి నిరసన తెలుపుతారని అరవింద్ కేజ్రీవాల్ అన్నాడు.
జైలులో పెట్టిన గంటల్లోనే అన్నా బృందాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నేను జైలునుండి వెళ్లనని అన్నా అంటే ఆయనకు అనుకూలమైన క్వార్టర్స్ ను జైలు నివాస సముదాయంలో కల్పించారు. జైలు బైట నిరీక్షిస్తున్న జనం కోసం జైలు లోపల సందేశాలను రికార్టు చేసి వినిపించారు. జైలు నుండి బైటికి వచ్చాక దీక్ష చేయడం కోసం ప్రభుత్వం దగ్గరుండి రామ్ లీలా మైదాన్ ను బాగుచేహించింది. ఢిల్లీ మునిసిపాలిటి కి చెందిన 240 మంది ఉద్యోగులు 15 ట్రక్కులు 6 ఎర్త్ మూవర్లతో రాత్రింబగళ్ళు శ్రమించి రామ్ లీలా మైదాన్ ను చదును చేశారు. బహుశా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాఅహార దీక్ష ఇంత లగ్జరీ గా జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. మళ్ళీ జరుగుతుందో లేదో కూడా అనుమానమే.
గురువారం ప్రభుత్వం అన్నా హజారే డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఏయే సెక్షన్ల కింద జన్ లోక్ పాల్ బిల్లుని, మరో రెండు లోక్ పాల్ బిల్లుల్ని పార్లమెంటులో ప్రవేశపెట్టి స్టాండింగ్ కమిటీలో సమర్పించాలో చర్చిస్తున్నట్లు తెలిపారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే గురువారం రాత్రే దీక్ష విరమించవచ్చని చెబుతున్నారు.
అన్నా హజారే పది రోజుల దీక్షకే హడలి పోయిన (లేదా హడలిపోయినట్లు నటిస్తున్న) మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ‘ఇరోమ్ షర్మిలా’ దీక్షను ఎందుకు పట్టించుకోవడం లేదు? ‘సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఒక నల్ల చట్టం. కేవలం ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ లలో మాత్రమే ఇది అమలులో ఉంది. ఈ చట్టం ప్రకారం పోలీసులు అనుమానం వస్తే ఎవరినైనా ఉగ్రవాది లేదా మిలిటంట్ అని చెప్పి కాల్చి చంపవచ్చు. సాయుధ బలగాలు మణిపురి మహిళలను రేప్ లు చేసి హత్య చేశారు. మనోరమ అనే యువతిని రేప్ చేసి చంపిపారేశారు.
సాయుధ బలగాల కార్యాలయం దగ్గరే మనోరమ మృత దేహం పడి ఉండడంతో మణిపురి మహిళలు అగ్రహోదగ్రులయ్యారు. ఒక 13 మంది మధ్య వయస్కు మహిళలు పూర్తిగా వివస్త్రలుగా మారి “భారత సైనికులరాలా మమ్మల్నీ రేప్ చేయండి” అనంటూ ఆర్మీ కార్యాలయం ముందు ప్రదర్శన నిరహించారు. మనోరమ హత్యకు వ్యతిరేకంగా మణీపూర్ ఒక దశలో అట్టుడికి పోయింది. కేంద్ర మంత్రులు అక్కడికి వెళ్ళి సమస్యకు పరిష్కారం ఇస్తామని ప్రకటించారు. ఈఅని ఏమీ జరగలేదు. ఆర్మీకీ ప్రత్యేక అధికారులు కొనసాగుతున్నారు.
భద్రతా బలగాలకు విచక్షణారహితమైన సర్వాధికారాలను ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషన్ పవర్స్ యాక్ట్ చట్టం కట్టబెట్టింది దానితో వారి ఆగడాలకు, అత్యాచారాలకు అందు లేకుండా పోయింది. మణిపురి మహిళల మాన ప్రాణాల కోసం పదికి పైగా సంవత్సరాల నుండి నిరాహర దీక్షను చేస్తున్న “ఇరోమి షర్మినా చాను” పత్రికలు ఏమాత్రం పట్టించుకోక పోవడం చూస్తే ఫోర్త్ ఎస్టేట్ అయిన పత్రికారంగం, ఎవరి ఆజ్ఞల ప్రకారం నడుస్తొందో తేట తెల్లమవుతోంది

ఈశాన్య రాష్ట్రాలలో హత్యలకీ, రేప్‌లకీ గురయ్యేది గిరిజనులే కానీ డబ్బున్నవాళ్ళు కాదు. అందుకే వాళ్ళపై జరిగే హత్యలూ, అత్యాచారాల గురించి కార్పొరేట్ మీడియా పట్టించుకోదు.