ఏదో ఒకటి రూపొందించి ‘జన్ లోక్ పాల్’ బిల్లు అనండి, అంతా ఒప్పుకుంటారు -అద్వానీ


భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు ఎల్.కె.అద్వానీ జన్ లోక్ పాల్ కావాలంటున్న అన్నా బృందం, ఆయన ఇతర మద్దతుదారుల డిమాండ్ కు కొత్త భాష్యం చెప్పాడు. జన్ లోక్ పాల్ బిల్లు మాత్రమే అంగీకారయోగ్యం అంటున్న వారు చిన్నబుచ్చుకునేలా అద్వాని వ్యాఖ్యలు ఉన్నాయి.

శుక్రవారం తన నివాసం వద్ద తనను కలిసిన ఐ.ఐ.టి విద్యార్ధులతో మాట్లాడుతూ అద్వానీ లోక్ పాల్ బిల్లు గురించి కొన్ని విషయాలు చర్చించాడు. జన్ లోక్ పాల్ బిల్లులో కొన్ని ప్రాధమికమైన తప్పులున్నాయనీ అందువలన అది పార్లమెంటులో ఆమోదం పొందడం అసాధ్యమనీ విద్యార్ధులతో చెప్పాడు. జన్ లోక్ పాల్ బిల్లుని ఇప్పుడున్నట్లుగా పార్లమెంటు అంగీకరించడం కష్టమని చెబుతూ అవిషయాన్ని తాను ప్రభుత్వ ఆర్ధిక మంత్రికి కూడా చెప్పానని వివరించాడు.

“ప్రభుత్వానికి, ఆర్ధిక మంత్రి ప్రణబ్ కీ కూడా నేను చెప్పాను. చూడండి, వీళ్ళు ‘జన్ లోక్ పాల్’ అన్న టైటిల్ పట్ల ఉద్వేగపూరితమైన బంధాన్ని ఏర్పరుచుకున్నారు. కనుక లోక్ పాల్ బిల్లు అంతిమంగా ఎలా రూపొందించినప్పటికీ దానిని ‘జన్ లోక్ పాల్’ బిల్లు అని పిలవడం కొనసాగించండి, అని చెప్పాను. ప్రణబ్ ముఖర్జీ ఈ విషయమై తాము ఆలోచిస్తామని చెప్పారు” అని అద్వానీ ఐ.ఐ.టి విద్యార్ధులతో మాట్లాడుతూ చెప్పినట్లుగా ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తా సంస్ధ తెలిపింది.

అదండీ సంగతి! ప్రతిపక్ష బి.జె.పికి అన్నా బృందం వెనక సమీకృతులవుతున్న జనం ఓట్లపైనే దృష్టి తప్ప అవినీతి పట్ల ఆందోళన ఏమీ లేదని అద్వాని మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. ‘కుండలో కల్లునింపి అవి పాలు అని చెప్పండి, పని జరుగుతుంది అని ప్రభుత్వానికి మర్మం చెబుతున్నాడు. బి.జె.పి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే ప్రధాని పదవికి అభ్యర్ధిగా పరిగణింపబడుతున్న ఎల్.కె.అద్వానీ ఉద్యమకారులైన అన్నా బృందం పట్లా, ఆయన మద్దతుగా కదిలి వస్తున్న ప్రజల పట్లా తనకు ఎంత గౌరవం ఉన్నదో వెళ్ళబుచ్చుకున్నాడు. మరోవైపు బి.జె.పి పార్టీయే అన్నా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు నటిస్తోంది. అవినీతిని అరికట్టమని ప్రజలు నిలదీస్తే పాలక పక్షం, ప్రతిపక్షం అన్నీ ఏకైమ పక్షంగా మారతాయని అద్వానీ చక్కగా విడమరచి చెప్పాడు.

One thought on “ఏదో ఒకటి రూపొందించి ‘జన్ లోక్ పాల్’ బిల్లు అనండి, అంతా ఒప్పుకుంటారు -అద్వానీ

  1. పిల్లి తెల్లదైతేనేమి, నల్లదైతేనేమి.. అది ఎలుకను పడుతున్నంతవరకూ… అని నలభై ఏళ్ల క్రితం డెంగ్ జియావో పింగ్ చైనాలో ఒక మహత్తర ప్రవచనం ప్రకటించాడు. కనీసం డెంగ్ ఎలుకను పడతామని చెప్పాడు. -తాను ఏ ఎలుకను పట్టాడో తీనాన్మెన్ స్క్వేర్ 1989లో చక్కగా చూపించింది. అది వేరే విషయం- మన అద్వానీ గారు ఆ పని కూడా సాధ్యం కాదంటున్నారు.

వ్యాఖ్యానించండి