అవినీతిని రూపుమాపాలని ప్రజలు కోరుతుంటే అతితెలివిపరులు లంచం ఇవ్వడం మానేస్తే అవినీతి అదే తగ్గుతుందని బుద్ధుడి లెవల్లో బోధిస్తారు. తెలుగు ఛానెళ్లలో ఒక ప్రకటన వస్తోంది. “అవినీతి నిర్మూలన మననుండే ప్రారంభిద్దాం” అని. అందులో లంచం ఇస్తుండబట్టే, తీసుకునే వాళ్ళున్నారని చూపిస్తున్నారు. ఆర్.టి.ఒ ఆఫీసుకి గానీ, రిజిస్ట్రార్ ఆఫీసుకి గానీ లేదా ట్రెజరీ ఆఫీసుకి గానీ పనికి వెళ్ళి నేను లంచం ఇవ్వను అంటే పనవుతుందా? నానుండే అవినీతి నిర్మూలన ప్రారంభించాలి అని శపధం చేసి లంచం ఇవ్వను గాక ఇవ్వను అంటే పనవుతుందా? లంచం ఇవ్వకుంటే రేషన్ కార్డు రాదు. వివిధ రకాల ధృవీకరణ పత్రాలు రావు. ఇంటి ప్లానుకు ఆమోదం రాదు. కొత్త ఇల్లు రిజిస్ట్రేషన్ జరగదు. ఇంక్రిమెంటు బిల్లు పడదు. ఇలా బోలెడన్ని రోజువారీ కార్యక్రమాలు జరగవు.
పాలకులు తాము లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ, తాము ప్రశ్నించబడకుండా ఉండడానికి తమ కింది అవినీతిని వదిలేస్తారు. అవినీతితో కోట్లు పోగేసుకున్నవారే ప్రభుత్వం, పోలీసులు, బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్ధ లతో కూడిన వ్యవస్ధలో ఆధిపత్యం వహిస్తుంటే అందులో భాగమైన కింది స్ధాయి అవినీతి నిర్మూలను మననుండే ప్రారంభం కావాలని హిత బోధలు చేయడం ఆచరణీయమేనా?
———————–
కార్టూనిస్టు: మంజుల్
“ప్రతి చిన్నదానికీ లంచం ఇవ్వడం లేదా నువ్వు?” కార్టూన్ స్పూర్తికి తగ్గ వ్యాఖ్య. కార్టూన్ ఈ కథనం కోసం ప్రత్యేకంగా వేయించుకున్నదా లేక బయటినుంచి తీసి ఉపయోగించుకున్నదా చెప్పగలరు. నిజంగా బాగుంది.
రాజశేఖర గారు, మొదట కార్టూన్, ఆ తర్వాతే కధనం. కార్టూన్లను కూడా నేను నెట్ లోనే సేకరిస్తున్నాను. కార్టూన్లు ఎంచుకునేటప్పుడే సరైంది ఎంచుకోవడం వలన సందర్భానికి సరిపోతున్నాయి.
కౌముదిలో అవినీతి గురించి గొల్లపూడి గారి ఆర్టికల్ చదివాను కానీ ఆ ఆర్టికల్ నాకు నచ్చలేదు. అవినీతిని వ్యతిరేకించాలంటే సామాజిక బాధ్యత ముఖ్యం. ఒక కానిస్టేబుల్ నా దగ్గర వంద రూపాయలు తీసుకున్నాడు కనుక నేను అవినీతిని వ్యతిరేకిస్తానను అనడం వ్యక్తిగత స్వార్థమే అవుతుంది కానీ సామాజిక స్పృహ అవ్వదు. రాజశేఖరరెడ్డి బతికున్న కాలంలో రాష్ట్రానికి వరల్డ్ బ్యాంక్ అప్పు లక్ష కోట్లు ఉండేది. రాష్ట్ర జనాభా ఎనిమిది కోట్లు అనుకుంటే ప్రతి వ్యక్తి యొక్క తలసరి అప్పు పన్నెండు వేలు అనుకోవాలి. ఈ పన్నెండు వేలు తలసరి అప్పు ముందు నూట యాభై లేదా ఐదు వందల రూపాయల లంచం చాలా చిన్న విషయం.