వ్యక్తిగత, ప్రజా సమస్యలు మరియు చట్టం, న్యాయం విషయాలలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నాయకుడు అభిషేక్ సింఘ్వి ఈ మేరకు పత్రికలతో మాట్లాడుతూ తెలిపాడు. ప్రభుత్వ బిల్లులో సవరణలు చేసే అవకాశం ఉన్నందున సంబంధిత వర్గాలన్నీ పట్టువిడుపులతో వ్యవహరిస్తే సమస్య పరిష్కారం కాగలదని వివరించాడు.
“స్టాండింగ్ కమిటీ అందర్నుండీ సలహాలను స్వీకరిస్తుంది. సకారణమైన పరిష్కారం కనుగొనడానికి ఇప్పటికీ అవకాశం ఉంది” అని సింఘ్వి పేర్కొన్నాడు. జన్ లోక్‌పాల్ ఆమోదించడానికి ఆగస్టు 30 డెడ్ లైన్ విధించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన అలా ఉన్నాడు “ప్రతిదాన్ని డెడ్ లైన్ల ఆధారంగా పరిష్కరించలేము. గడువులకు అతీతంగా పట్టువిడుపులతో వ్యవహరించడం ఈ సమయంలో చాలా ముఖ్యమైన అంశం.
“మాకు మూడు నెలల గడువు ఇచ్చారు. ఆ లోగానే లోక్ పాల్ బిల్లుకోసం సిఫారసులను ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. ఆ విధంగా పార్లమెంటు చలికాలం సమావేశాల్లో పార్లమెంటులో చర్చకు వీలు కలుగుతుంది” అని సింఘ్వీ పెర్కొన్నాడు.
సింఘ్వీ ప్రకటనను బట్టి అన్నా బృందంతో రాజికి రావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించవచ్చని భావించవచ్చు. అన్నా బృందంపై మొండితనంతో వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే అనేక విమర్శలు వినవస్తున్న నేపద్యంలో వారు సైతం మెట్టుదిగే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి అన్నా బృందం కోరుతున్న “శక్తివంతమైన అవినీతి వ్యతిరేక వ్యవస్ధ” ఏర్పాటు చేస్తే అది కూడా అవినీతికి పాల్పడదని గ్యారంటీ లేదు. ఇపుడున్న అధికారిక వ్యవస్ధకు తోడు మరొక అధికార వ్యవస్ధ -ప్రధాని నుండి గమాస్తావరకూ విచారించే హక్కున్న వ్యవస్ధ- ఏర్పాటు చేయడమంటే మరొక నిరంకుశ వ్యవస్ధను తయారు చెయ్యడమే కాగలదు.
అన్నా హజారే పూర్వాశ్రమంలో ఆర్.ఎస్.ఎస్ సానుభూతిపరుడు కావడం, ముస్లింలను ఊచకోత కోయించిన నరేంద్రమోడి పనితనాన్ని మెచ్చుకోవడం, అరవింద్ కేజ్రీవాల రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్న చరిత్రను కలిగిఉండడం… ఇవన్నీ కూడా అన్నా బృందానికి ప్రతికూలంశాలుగా మారుతున్నాయి. వీటిని అధిగమించాలంటే అన్నా బృందం ఏదో ఒక చోట అంగీకారనికి రాక తప్పదు.

as arvind points out, “icchi pucchu kovatam” ante some people should be allowed to be corrupt? why the hell these people say irrelavent things like arvind is against reservations or anna was supported by RSS etc. what way they are relavent to corruption?
మీ విశ్లేషణలు బాగుంటున్నాయి
అవినీతిని ఆమూలాగ్రం వ్యతిరేకించేవాళ్ళు ఒక అవినీతిని వ్యతిరేకించడం వరకే పరిమితం కారు. అవినీతి అనేది అన్ని రంగాల్లోనూ ఉన్నదనీ, ఒక్క లంచ పుచ్చుకోవడమే అవినీతి కాదనీ అంగీకరించినట్లయితే, ఇతర రూపాలలోని అవినీతిని కూడా వ్యతిరేకించడమే కాకుండా అటువంటి అవినీతిపైన పోరాట దృక్పధాన్ని కలిగి ఉండాలాన్న నియమం అమలులోకి వస్తుంది.
పాలకులు పంట భూముల్ని రైతుల్నుండి లాగేసుకుని అభివృద్ధి పేరుతో విదేశీ పరిశ్రమల వాళ్లకు ఇచ్చేస్తున్నారు. రైతు దేశానికి వెన్నెముక అని గాంధీగారు చెప్పిన సూక్తిని నమ్మితే నియమగిరి-వేదాంత, పోస్కో-జగత్ సింగ్ పూర్, నొయిడా భూముల కైవశం-పోలీసు కాల్పులు, సోంపేట కాల్పులు తదితర సమస్యలపై పోరాడకపోయిన కనీసం ప్రకటన చేయాల్సి ఉంది. కాని అవేవీ మన పౌరసమాజ నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వీళ్ళిక్కడ నిరాధార దీక్ష జరుగుతుండగానే జగత్ సింగ్ పూర్ లో పోస్కో వ్యతిరేక ఉద్యమాన్ని స్దానిక గ్రామస్ధులు కొనసాగిస్తున్నారు. వారి గురించి ఒక్క ముక్కా ఒక్కరూ మాట్లాడింది లేదు. లాఠీ చార్జీ చేసి, కాల్పులు సాగించినా వీరి ఆందోళన పౌర సమాజ కార్యకర్తలకు పట్టదు. “భారత్ మాతా కి జై” అంటూ నినదించే వారి భారత మాతలో వీరి భాగస్వాములు కారా? వారు భరత మాత బిడ్డలు కారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అన్నా బృందం అవినీతిపై సమరం అంటే అటువంటి సమరానికి అర్ధం ఉంటుందా? డబ్బు రూపేణా జరిగే అవినీతి పై కేంద్రీకరణ జరిపి సామాజిక అణచివేత, పెట్టుబడుల్లో వాటాలు పొంది భూముల్ని విదేశీ, స్వదేశీ కంపెనీలకు ఇచ్చెయ్యడం అవినీతి కాదా? ఆ అవినీతి భాధితులు భాధితులు కారా? (వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఇలానే అవినీతికి పాల్పడ్డాడని సి.బి.ఐ తన ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొంది)
అందుకే అవినీతి పై సమరం చేస్తామని చెబుతున్నపుడు అన్ని రంగాల్లోని అవినీతి పరిగణలోకి రావాలి. అన్నా బృందం చేస్తున్న దీక్షలో జన్ లోక్ పాల్ బిల్లుని అంగీకరిస్తే అంతా ముగిసినట్లే. దానిలో కూడా కొన్ని సవరణలు చేసి ఆమోదించడానికి భూమిక తయారవుతోంది. ఇక దానితో అవినితిపై సమరం ముగిసినట్లేనా? అవినీతిపై యుద్ధం దీర్ఘకాలికమైనది. ప్రజలంతా దానికి సహకరించాలి. ఏ క్షణంలోనూ ఏమరుపాటు గా ఉండకూడదు. అటువంటి సమస్యను ఒక్క జన్ లోక్ పాల్ బిల్లుతోనే అంతం చేస్తామని భావించడం సబబు కాదు. ఇప్పుడు అన్నా ఉద్యమానికి వస్తున్న స్పందన కంటే విస్తృత స్ధాయి సమీకరణ, సహకారం దానికి అవసరం. కేవలం పట్టణ మధ్యతరగతితో గ్రౌండు నిండిపోవడంతోనే మా ఉద్యమం భూములు లాక్కోవడంపైనా కూడా అని ఒక ముక్తసరి ప్రకటన ఇచ్చినంత మాత్రాన అది చిత్తశుద్ధి కానేరదు.
రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం “ప్రతిభను రక్షించండి” అన్న నినాదంపై పుట్టింది. ఈ దేశంలో ప్రతిభ ఏ వర్గాల సొత్తో కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అన్ని సౌకర్యాలతో పెరిగి ప్రతిభను సంపాదించినవానితో గ్రామాల్లో తరతరాల బానిసత్వంతో పుట్టిపెరిగిన వారు ఇప్పటికీ సామాజికంగా అణచివేతకు గురవుతున్నవారు పోటిపడమని చెప్పడం ఏ నీతికి ప్రతీక? ప్రభుత్వ ఉన్నత స్ధాయి ఉద్యోగాలలో ఇప్పటికీ 70 శాతం మంది అగ్ర కులస్తులే. నేను పని చేస్తున్న బ్రాంచాఫీసులో గత పదహారు సంవత్సరాల నుండి కేవలం బ్రాహ్మణులే బ్రాంచి మేనేజర్లుగా పని చేశారు, మరో కులం వాడే దొరకనట్లు, ప్రమోషన్లలో పూర్తిగా వారే ప్రధమ స్ధానం. రిజర్వేషన్లు ఉండబట్టి ఆ మేరకు షేడ్యూల్ కులాలు, తెగలకు ప్రమోషన్లు వస్తున్నాయి తప్ప లేకుంటే అవీ రావు. ఆ రిజర్వేషన్ల అమలు లో కూడా బోల్డన్ని కంతలతో నిండి ఉంటుంది. కులపరమైన అణచివేత ఈ దేశంలో అమలులో ఉన్న అతిపెద్ద అవినీతి. ఎదుటివ్యక్తి తమలాగే మనుషులని అంగీకరిస్తూనే ఒక కులంలో పుట్టినందుకు వారితో సామాజిక కార్యక్రామలకు అంగీకరించకపోవడం, అద్దెకు ఇళ్లు ఇవ్వకపోవడం, పెళ్ళిళ్ళకు పేరంటాలకు నిరాకరించడం…. ఇవన్నీ సామాజిక అవినీతి కిందకు వస్తాయి. నైతిక అవినీతి కూడా. శుభ్రంగా డిగ్రీలు, పి.జిలు, ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ లు చదివి కూడా కుల అహంకారంతో కొట్టుమిట్టాడడం అతి పెద్ద సామాజిక అవినీతి. ఈ అవినీతి గురించి అన్నా బృందం ఎందుకు మాట్లాడదు?
అన్నా తన ప్రసంగాల్లో చెబుతున్నాడు “వ్యవస్ధ మారనిదే ప్రయోజనం లేద”ని. అదే నిజమైతే, ఊరికే ఉబుసుపోకకు ఆ మాట అనకపోతే, సీరియస్ గానే ఆ మాట అన్నట్లయితే… వ్యవస్ధ మారడానికి అన్నా బృందం ఎందుకు కృషి చేయదు? నిరాహార దీక్షతో లోక్ పాల్ బిల్లుని సాదించడమే ఏకైక కర్తవ్యంగా ఎందుకు కూర్చున్నట్లు?
కుల వ్యవస్ధ సమాజం నుండి తొలగిపోలేదు. చదువు పెరిగే కొద్దీ కొత్త రూపాల్లో కుల వ్యవస్ధ ముందుకొస్తోంది. మరింత సోఫిస్టికేటెడ్ రూపాల్లో అది ముందుకొస్తోంది. పట్టణాల్లో అలా ఉండగానే గ్రామాల్లో సామూహిక హత్యలు, సంఘ బహిష్కరణలు, రెండు గ్లాసుల ఆచరణలు అన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి పరమ అసమాన వ్యవస్ధలో రిజర్వేషన్లు అవసరం లేకుండా ఉంటుందనీ, ప్రతిభ ఆధారంగా చదువు, ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యమం చేసిన అరవింద్ కేజ్రీవాల్ సామాజిక అవినీతి పంకిలాన్ని మోస్తున్నవాడు కాదా? కులపరమైన సామాజిక అవినీతిపై అన్నా బృందం ఉద్యమం చేయదెందుకు? కనీసం ప్రస్తావన కూడా చేయదెందుకు?
ఈ ప్రశ్నలు ప్రస్తుత అవినీతి ఉద్యమంతో సంబంధం లేనివి అంటే అది సత్యదూరమే అవుతుంది మురళీధర గారూ.