జన్‌లోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రధాని అంగీకారం, దీక్ష మానాలని వినతి


PMఅన్నా బృందం డిమాండ్ చేస్తున్నట్లుగా “జన్ లోక్ పాల్ బిల్లు” ని పార్లమెంటు ముందు ప్రవేశపెట్టడానికి అంగీకరిస్తున్నట్లు ప్రధాని మన్మోహన్ అన్నాకు రాసిన ఉత్తరంలో ప్రకటించాడు. ఎనిమిది రోజుల నిరాహార దీక్షను ఇంతటితో ఆపివేయాలని ప్రధాని తన లేఖలో కోరాడు. నెల రోజుల పాటు దేశంలోని ఇతర ప్రధాన సమస్యలనుండి పత్రిల కేంద్రీకరణను తనవైపుకు తిప్పుకున్న అన్నా హజారే అవినీతి వ్యతిరేక నిరవధిక నిరాహార దీక్ష మరి కొన్ని గంటల్లో ముగిసే అవకాశం కనిపిస్తోంది. అన్నా హజారే ఆరోగ్యం విషమిస్తున్నదన్న భయంతోనే తాను ఆయన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అంగీకరిస్తున్నట్లు ప్రధాని మన్మోహన్ తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ మేరకు సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ వార్తా ఛానెల్ ఒక వార్తను ప్రసారం చేసింది.

“ప్రభుత్వము, మీ బృందానికి మధ్య భిన్నాభిప్రాయలున్నప్పటికీ మీ నిరవధిక నిరాహార దీక్ష వలన క్షీణిస్తున్న తమరి ఆరోగ్యం పట్ల తీవ్రమైన ఆందోళన ఉన్నదని చెప్పడానికి ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన పనిలేదు. దేశ సేవలో మీ అభిప్రాయాలూ, మీ చర్యలూ అత్యంత అవసరం అని చెప్పడానికి నేనేకీ వెనకాడను. కాని అది మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నపుడే జరగాలి తప్ప ఆరోగ్యం క్షీణిస్తున్న దశలో కాదు” అని ప్రధాని తన లేఖలో పేర్కొన్నాడు. అంతే కాక ప్రభుత్వం, అన్నా బృందానికి మద్య తలెత్తిన విభేధాలను భూతద్దంలో చూపించబడ్డాయని ఒక వింతైన వ్యాఖ్య కూడా తన లేఖలో పేర్కొన్నాడు. “మన మార్గాలూ, పద్దతులో వేరు కావచ్చు కానీ ఆ విభేధాలు కూడా పెద్దవిగా చేసి చూపబడ్డాయని నేను నమ్ముతున్నాను. అత్యంత సమర్ధవంతమైన రాజ్యాంగబద్ధమైన లోక్ పాల్ బిల్లుని ఆమోదించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పౌరసమాజం నుండి అభిప్రాయాలు తీసుకుని అత్యంత విశాలమైన బిల్లుని రూపొందిస్తాం” అని ప్రధాని పేర్కొన్నాడు. జన్ లోక్ పాల్ కీ, లోక్ పాల్ కీ మధ్య పెద్ద తేడా లేదనీ, అందుకే జన్ లోక్ పాల్ బిల్లు ని ప్రవేశపెట్టడానికి పెద్ద అభ్యంతరం ఉండవలసిన పని లేదనీ ప్రధాని చెప్పదలుచుకున్నాడు.

అయితే ప్రభుత్వం, అన్నా బృందం మధ్య విభేధాలు ఎక్కడ ఉన్నట్లు? ఆ విభేదాలు ఎంత పెద్దవి? లేదా ఎంత చిన్నవి? అన్నా హజారే దీక్ష ప్రారంభించేనాటికీ, ఇప్పటి ప్రధాని లేఖనాటికి ఈ లేఖ తప్ప పరిస్ధితిలో తేడా ఏమీ రాలేదు. పార్లమెంటుదే తుది నిర్ణయం అని ప్రభుత్వం అప్పుడూ చెప్పింది, ఇప్పుడూ చెప్పింది. ప్రధాని లేఖ ప్రకారం ఇప్పుడు జరగబోయేది జన్ లోక్ పాల్ బిల్లుని కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందుకి ప్రవేశపెడతారు. మరొక సామాజిక కార్యకర్త అరుణా రాయ్ కూడా మరొక డ్రాఫ్టుని సిద్ధం చేసింది. బహుశా దానికి కూడా స్టాండింగ్ కమిటీకి సమర్పించవచ్చు. ప్రధాని లేఖ మొత్తంలో కేవలం అన్నా హజారే ఆరోగ్యం కోసమే జన్ లోక్ పాల్ బిల్లుని స్టాండింగ్ కమిటీ ముందు తీసుకొస్తున్నట్లుగా ఉన్నదని ఫస్ట్ పోస్ట్ వెబ్ సైట్ తెలిపింది. ఆరోగ్యమే కారణమైతే ఇదే పని ఎనిమిది రోజుల క్రితమే చేయవచ్చు. ఆరోగ్యం క్షీణించేదాకా ఆగి జన్ లోక్ పాల్ ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించడం అసహజంగానూ, అనుమానాలు రేకెత్తించేదిగానూ ఉంది.

“చట్టాల రూపకల్పనలో పార్లమెంటు సర్వాధికారాన్నీ, రాజ్యాంగ నిబంధనలనూ మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఒక ప్రభుత్వంగా పార్లమెంటు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత ప్రజల కోర్కెను గౌరవిస్తూ అందుకు బాధ్యత వహిస్తాం” అని ప్రధాని రాశాడు. స్టాండింగ్ కమిటీ తన ముందుకు వచ్చే అన్ని డ్రాఫ్టులను పరిశీలిస్తుందని ప్రధాని లేఖలో పేర్కొన్నాడు. తాము పార్లమెంటు ముందు ప్రవేశ పెట్టిన లోక్ బిల్లు తో పాటు జన్ లోక్ పాల్ బిల్లునీ, అరుణా రాయ్ లాంటివారు తయారు చేసిన బిల్లును కూడా స్టాండింగ్ కమిటీ పరిశీలిస్తుంని ప్రధాని లేఖలో రాశాడు. ఈ లేఖ కోసమే అరుణా రాయ్, సొంతగా తానొక బిల్లుని తయారు చేసిందా అన్న అనుమానాలు ఇక్కడ సహజంగానే కలుగుతాయి. అరుణా రాయ్ లాంటి సమాజ సేవకులు ప్రభుత్వం నుండి పద్మ అవార్డులు పొందిన గొప్ప సంఘసేవకులు. అంటే ప్రభుత్వాల ప్రయోజనాలు, వీరి సమాజ సేవ ప్రయోజనాలు పరస్పరం సహకరించుకుంటాయని వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు అరుణా రాయ్ బిల్లుని అడ్డు పెట్టుకుని జన్ లోక్ పాల్ బిల్లు ఏదో గొప్పదనో లేదా అన్నా హజారే ఉద్యమానికి భయపడో దాన్ని స్టాండింగ్ కమిటీకి ఇవ్వడం లేదన్న ప్రయత్నం ఇక్కడ ప్రధాని లేఖలో కనిపిస్తోంది.

“…తమరి బృందం పదే పదే జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటు ముందు ప్రవేశపెట్టాలని కోరినందునా, ప్రత్యేకంగా, మరీ ముఖ్యంగా తమరి ఆరోగ్యం పట్ల నాకు తీవ్ర స్ధాయిలో ఉన్న ఆందోళన వలనా, మా ప్రభుత్వం స్పీకర్ ను ఇతర అన్ని డ్రాఫ్టులతో పాటు ‘జన్ లోక్ పాల్’ బిల్లుని కూడా స్టాండింగ్ కమిటీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇంకా సమయం, వేగం తదితర అంశాలకు సంబంధించి మీకు ఏమన్నా అభిప్రాయాలు ఉన్నట్లయితే ఆ మేరకు స్టాండింగ్ కమిటీకి తన పరిధిలో ప్రయత్నించమని విజ్ఞప్తి చేయగలము” అని ప్రధాని పేర్కొన్నాడు. “ఈ లేఖ, అందులోని ప్రతి అంశమూ కూడా రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఉద్దేశించబడింది. అవి మీ ఆరోగ్యం, ఆచరణలో స్ధిరపడి ఉన్న రాజ్యాంగబద్ధ అవగాహనను అనుసరించి సమర్ధవంతమైన, ప్రభావవంతమైన లోక్ బిల్లుని తయారు చేస్తుండడం. కనుక నా సూచనలు అనుసరించి తమరు నిరాహార దీక్షకు ముగింపు పలికి సంపూర్ణ ఆయురారోగ్యాలను సంపాదించాలని కోరుతున్నాను” అని ప్రధాని రాశాడు. ప్రధానికి అన్నా ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ ఈ దేశ ప్రజల మౌలిక సమస్యలైన ఆకలి, నిరుద్యోగం, దారిద్రం, అన్నదాతల ఆత్మహత్యలు, పేదరికం మున్నగు వాటిపై లేకపోవడమే అత్యంత విషాధం. ఈ సంగతి అన్నా హజారేకి అర్ధ అయిందో లేదో అనుమానమే.

ఈ లేఖతో పాటు ప్రధాని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. మంగళవారం అరవింద్ కేజ్రివాల్ న్యాయశాఖమంత్రి సల్మాన్ ఖుర్షీద్ నూ కలిసి చర్చలు జరిపాడు. అన్నా ఆరోగ్యం దిగజారుతున్నదనీ, కనుక ప్రభుత్వం త్వరగా స్పందించాలనీ అన్నా బృందం పదే పదే ప్రభుత్వానికి వర్తమానాలు పంపినట్లుగా ఫస్ట్ పోస్ట్ వార్తా వెబ్ సైట్ తెలిపింది.

అన్నా హజారే అవినీతి వ్యతిరేక నిరవదిక నిరాహార దీక్ష అలా ముగుస్తోంది.

వ్యాఖ్యానించండి