అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం సంపూర్ణమైనదేనా?


భారత దేశానికి స్వాతంత్రం తేవడానికి ఏర్పడిందంటున్న కాంగ్రెస్ పార్టీ నిజానికి 1920 ల వరకూ సంపూర్ణ స్వాతంత్ర్యం అన్న నినాదం ఇవ్వలేదు. అంటే అప్పటివరకూ జరిగిన ఉద్యమం కొన్ని రాయితీల కోసమే జరిగింది. నామమాత్ర ఎన్నికలు నిర్వహించడం, పాలనలో భారత లెజిస్లేచర్ల అభిప్రాయాలు కూడా పరిగణించడం (అమలు చేయాలని రూలేమీ లేదు) ఇత్యాధి రాయితీల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ (గాంధీతో సహా) ఉద్యమించింది. ఆ తర్వాత అతివాదుల ప్రాబల్యం, కమ్యూనిస్టు విప్లవకారుల ఉద్యమ వ్యాప్తి అన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీని (గాంధీని) సంపూర్ణ స్వతంత్రం నినాదం ఇచ్చేలా చేశాయి. అలాగే నేటి గాంధీగా చెలామణి అవుతున్న అన్నా హజారే చేస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమం సంపూర్ణమైనదేనా?

డబ్బు ఇచ్చి పుచ్చుకోవడమే అవినీతి అన్నట్లుగా ప్రస్తుతం అంతా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అవినీతిపైన భారత ప్రజలు గొప్పగా ఉద్యమిస్తున్నారని ఇతర దేశాల్లో కూడా భావిస్తున్న తరుణంలో అవినీతికి చెందిన అనేక విశ్వరూపాలను చర్చించుకోవలసిన అవసరం తలెత్తింది. ప్రజలందరూ సమానులే, అంతస్తు, కుల, మత, ప్రాంతీయ అసమానతలు సమాజంలో ఉండరాదు అని అంగీకరించినట్లయితే ఆ అంగీకరానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యవస్ధలు ఆమూలాగ్రం వ్యవరిస్తున్నపుడు అది దేనికిందకు వస్తుంది? అది సామాజిక, పాలనాపరమైన అవినీతి కిందికి రాదా? పొద్దున లేచింది మొదలు షేడ్యూల్ కులాల వారికి నువ్వు ఫలానా అని గుర్తు చేసే సంఘటనలు ఎదురవుతున్నపుడు ఆ సమాజం సామాజిక అవినీతితో నిండిపోయినట్లు కాదా? 

అవినీతి అనేది అన్ని రంగాల్లోనూ ఉన్నదనీ, ఒక్క లంచ పుచ్చుకోవడమే అవినీతి కాదని అంగీకరించినట్లయితే, ఇతర రూపాలలోని అవినీతిని కూడా వ్యతిరేకించడమే కాకుండా అటువంటి అవినీతిపైన పోరాట దృక్పధాన్ని కలిగి ఉండాలాన్న నియమం అమలులోకి వస్తుంది. అవినీతిపై పోరాటం చేస్తున్న వాళ్ళు కేవలం ఒక్క అవినీతిని వ్యతిరేకించడం వరకే పరిమితం కావడం, ఇతర సామాజిక అవినీతిలను వ్యతిరేకించకపోవడం, వ్యతిరేకించినా మొక్కుబడి ప్రకటనలతో సరిపెట్టడం దేని కిందకు వస్తుంది. అది సంపూర్ణ అవినీతి వ్యతిరేక ఉద్యమం కాగలదా? సామాజిక అవినీతిలపై పోరాటాలు చేస్తేనే మానిటరీ అవినీతిపై పోరాటం చేయాలన్న నిబంధన లేకపోవచ్చు. కాని ఇతర సామాజిక అవినీతిలపై పోరాటం దృక్పధం ఉండాల్సిన అవసరం లేదా?

పాలకులు పంట భూముల్ని రైతుల్నుండి లాగేసుకుని అభివృద్ధి పేరుతో విదేశీ పరిశ్రమల వాళ్లకు ఇచ్చేస్తున్నారు. రైతు దేశానికి వెన్నెముక అని గాంధీగారు చెప్పిన సూక్తిని నమ్మితే నియమగిరి-వేదాంత, పోస్కో-జగత్ సింగ్ పూర్, నొయిడా భూముల కైవశం-పోలీసు కాల్పులు, సోంపేట కాల్పులు తదితర సమస్యలపై పోరాడకపోయినా కనీసం మద్దతుగా, సానుభూతిగా ప్రకటన చేయాల్సి ఉంది. కాని అవేవీ మన పౌరసమాజ నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వీళ్ళిక్కడ నిరాధార దీక్ష జరుగుతుండగానే జగత్ సింగ్ పూర్ లో పోస్కో వ్యతిరేక ఉద్యమాన్ని స్దానిక గ్రామస్ధులు కొనసాగిస్తున్నారు. వారి గురించి ఒక్క ముక్కా పౌరసమాజ నేతలు ఒక్కరూ మాట్లాడింది లేదు. పిల్లలు, మహిళలు, వృద్ధులు పగలంతా నేలపై పడుకొని పోస్కో ప్రాజెక్టు తమ గ్రామాల్నీ, పంట పొలాల్నీ లాగేసుకోకుండా అహింసాయుత పోరాటం నిర్వహించారు. ఆ సమయంలో ఈ పౌరసమాజ కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు? వీరిలో స్వామి అగ్నివేశ్ తప్ప ఎవరికైనా జార్ఘండ్, చత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ లో గిరిజనుల దుర్భర పరిస్ధితి గురించి ఆలోచన ఉన్నట్లు దాఖలాలు లేవు. చత్తిస్ ఘఢ్ లో పోలీసుల ముట్టడిలో ఉన్న గ్రామస్ధులకు అన్నపానీయాలు తీసుకెళ్తున్న స్వామి అగ్నివేశ్ తీసుకెళ్తుంటే వారిపైన దాడి చేసి అన్న పానీయాలను నేల పాలు చేసారు పోలీసులు. ఆ సమయంలో ఈ అన్నా బృందం దీర్ఘనిధ్రలో ఉన్నదా? స్వామి అగ్నివేశ్ పై జరిగిన దాడిపై విచారణ జరపాలని ఒక్క డిమాండ్ ఎందుకు చేయలేదు?

పోస్కో ప్రాజెక్టు తమ భూముల్ని, ఇళ్ళను లాగేసుకోవడానికి వ్యతిరేకంగా స్ధానికంగా పదికి పైగా గ్రామాల ప్రజలు గత ఆరు సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారు. వీరికి సానుభూతిగా ఏ ఒక్క పౌర సమాజ కార్యకర్తా రాలేదు. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో తమ జీవనోపాధి ఐన బీల భూముల్లో ధర్మల్ ప్రాజెక్టు కట్టడాన్ని వ్యతిరేకిస్తున్నవారిపైన పోలీసులు లాఠీచార్జీ చేయడమే కాక కాల్పులు జరిపి ఇద్దర్ని చంపేశారు. వారం పది రోజుల క్రితమే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నొయిడా రైతులపై కాల్పులు జరిపించి ఇద్దరు రైతుల్ని బలి తీసుకుంది. తమ భూములు ఇవ్వం అని వారు చెప్పడమే వారు చేసిన నేరం. అవినీతిపై పౌరసమాజ నాయకులనుండి పెద్ద ఎత్తున ప్రకటనలు, ఖండనమండనలు జరుగుతున్న కాలంలోనే ఈ ఘటన జరిగింది. కానీ దీనిపైన పౌర సమాజ నాయకులు స్పందించలేకపోయారు. లాఠీ చార్జీ చేసి, కాల్పులు సాగించినా వీరి ఆందోళన పౌర సమాజ కార్యకర్తలకు పట్టదు. “భారత్ మాతా కి జై” అంటూ దేశభక్తి పారవశ్యంతో నినదిస్తున్నారే, ఆ భారత మాతలో వీరు వీరు భాగస్వాములు కారా? వారు భరత మాత బిడ్డలు కారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అన్నా బృందం, అవినీతిపై సమరం అంటే అటువంటి సమరానికి అర్ధం ఉంటుందా? అయితే గియితే అది పాక్షిక అవినీతి పోరాటమే తప్ప సంపూర్ణ అవినీతి పోరాటం కాగలదా? డబ్బు రూపేణా జరిగే అవినీతి పై కేంద్రీకరణ జరిపి సామాజిక అణచివేత, పెట్టుబడుల్లో వాటాలు పొంది భూముల్ని విదేశీ, స్వదేశీ కంపెనీలకు ఇచ్చెయ్యడం అవినీతి కాదా? ఆ అవినీతి భాధితులు భాధితులు కారా? (వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఇలానే అవినీతికి పాల్పడ్డాడని సి.బి.ఐ తన ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొంది).

అవినీతి పై సమరం చేస్తామని చెబుతున్నపుడు అన్ని రంగాల్లోని అవినీతి పరిగణలోకి రావాలి. అన్నా బృందం చేస్తున్న దీక్షలో జన్ లోక్ పాల్ బిల్లుని అంగీకరిస్తే అంతా ముగిసినట్లే. దానిలో కూడా కొన్ని సవరణలు చేసి ఆమోదించడానికి భూమిక తయారవుతోంది. ఇక దానితో అవినితిపై సమరం ముగిసినట్లేనా? అవినీతిపై యుద్ధం దీర్ఘకాలికమైనది. ప్రజలంతా దానికి సహకరించాలి. ఏ క్షణంలోనూ ఏమరుపాటు గా ఉండకూడదు. అటువంటి సమస్యను ఒక్క జన్ లోక్ పాల్ బిల్లుతోనే అంతం చేస్తామని భావించడం సబబు కాదు. ఇప్పుడు అన్నా ఉద్యమానికి వస్తున్న స్పందన కంటే విస్తృత స్ధాయి సమీకరణ, సహకారం దానికి అవసరం. కేవలం పట్టణ మధ్యతరగతితో గ్రౌండు నిండిపోవడంతోనే మా ఉద్యమం భూములు లాక్కోవడంపైనా కూడా అని ఒక ముక్తసరి ప్రకటన ఇచ్చినంత మాత్రాన అది చిత్తశుద్ధి కానేరదు.

ఇక పౌర సమాజ కార్యకర్తల్లో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమకారులు ప్రముఖ భూమికను పోషిస్తున్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం “ప్రతిభను రక్షించండి” అన్న నినాదంపై పుట్టింది. ఈ దేశంలో ప్రతిభ ఏ వర్గాల సొత్తో కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అన్ని సౌకర్యాలతో పెరిగి ప్రతిభను సంపాదించినవానితో గ్రామాల్లో తరతరాల బానిసత్వంతో పుట్టిపెరిగిన వారు ఇప్పటికీ సామాజికంగా అణచివేతకు గురవుతున్నవారు పోటిపడమని చెప్పడం ఏ నీతికి ప్రతీక? ప్రభుత్వ ఉన్నత స్ధాయి ఉద్యోగాలలో ఇప్పటికీ 70 శాతం మంది అగ్ర కులస్తులే నని ఇటివల ప్రభుత్వ సర్వే తెలిపినట్లుగా పత్రికలు తెలిపాయి. ఈ బ్లాగర్ పని చేస్తున్న బ్రాంచాఫీసులో గత పదహారు సంవత్సరాల నుండి కేవలం బ్రాహ్మణులే బ్రాంచి మేనేజర్లుగా పని చేశారు, మరో కులంలో అర్హత ఉన్నవాడే దొరకనట్లు. అదేమని అడిగితే ప్రతిభావంతుడే ప్రమోషన్లకి అర్హులన్న వాదన సిద్ధం. ప్రమోషన్లలో పూర్తిగా వారే ప్రధమ స్ధానం.

రిజర్వేషన్లు ఉండబట్టి ఆ మేరకు షేడ్యూల్ కులాలు, తెగలకు ప్రమోషన్లు వస్తున్నాయి తప్ప లేకుంటే అవీ రావు. ఆ రిజర్వేషన్ల అమలు లో కూడా బోల్డన్ని కంతలతో నిండి ఉంటుంది. కులపరమైన అణచివేత ఈ దేశంలో అమలులో ఉన్న అతిపెద్ద అవినీతి. బ్యాంకుల్లో, ఎల్.ఐ.సి లో అగ్రకులస్ధులదే ఆధిపత్యం అన్నది భారత దేశంలో ఒక నిత్య సత్యం. చిత్రం ఏమిటంటే ఎల్.ఐ.సి లో వామ పక్ష పార్టీకి అనుబంధంగా ఉన్న అతిపెద్ద యూనియన్ లో కూడా అగ్రకులస్ధులదే ఆధిపత్యం. యూనియన్ నాయకులుగా ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు మొదలైన వాటిపైన వీరి మాట చెల్లుబాటు అవుతుంది. ఆ చెల్లుబాటులో జరిగే నిర్ణయాల్లో కూడా అగ్రవర్ణం వారికే ప్రధానంగా అనుకూల నిర్ణయాలు జరుగుతాయి. ఎదుటివ్యక్తి తమలాగే మనుషులని అంగీకరిస్తూనే ఒక కులంలో పుట్టినందుకు వారితో సామాజిక కార్యక్రామలకు అంగీకరించకపోవడం, అద్దెకు ఇళ్లు ఇవ్వకపోవడం, పెళ్ళిళ్ళకు పేరంటాలకు నిరాకరించడం…. ఇవన్నీ సామాజిక అవినీతి కిందకు వస్తాయి. నైతిక అవినీతి కూడా. శుభ్రంగా డిగ్రీలు, పి.జిలు, ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ లు చదివి కూడా కుల అహంకారంతో కొట్టుమిట్టాడడం అతి పెద్ద సామాజిక అవినీతి. ఈ అవినీతి గురించి అన్నా బృందం ఎందుకు మాట్లాడదు? అరవింద్ కేజ్రీవాల్ అటువంటి రిజర్వేషన్ వ్యతిరేక, ప్రతిభా పరిరక్షక ఉద్యమానికి నాయకత్వం వహించినవాడిగా ఏ అవినీతిపై పోరాడుతున్నట్లు? సామాజిక అవినీతిని సమర్ధిస్తూ, మానిటరీ అవినీతిపై ఉద్యమిస్తే అది ఉద్యమమేనా? ఉద్యమం లో కూడా అసమానతలా?

ఇన్నాళ్ళూ దేశాన్ని ఏలింది ఈ సోకాల్డ్ అగ్ర కులం వారే. వీరే గత అరవై నాలుగు సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తూ వచ్చారు. శాసన వ్యవస్ధ, న్యాయ వ్యవస్ధ, బ్యూరోక్రసీ, పత్రికా రంగం ఇవి నలుగూ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని గొప్పగా చెప్పుకుంటారు. ఈ నాలుగు రంగాలలొనూ ఇన్నాళ్లు అగ్ర కులం వాళ్ళే ఆధిపత్యం వహిస్తూన్నారు. అరవింద్ కేజ్రీవాల్ మాటల్లో చెప్పాలంటే ఇన్నాళ్లూ దేశం ప్రతిభ గల వాళ్ల చేతనే పాలించబడింది. అరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఇన్నాళ్లు ప్రతిభగల వాళ్ల చేత పాలింపబడ్డ భారత దేశం అవినీతి కుళ్ళిపోయిందని తాజాగా పౌర సమాజ బృందం ఉద్యమం మొదలు పెట్టింది. ప్రతిభ ఉన్న వాళ్ల పాలనలో భారతదేశం అవినీతిలో ఎందుకు కూరుకున్నట్లు? అన్నా హజారే అన్నట్లు ఇప్పటికీ నిజమైన స్వాతంత్రం ప్రజలకి ఎందుకు సమకూరనట్లు? వ్యవస్ధను ఆమూలాగ్రం మార్చుకుంటే తప్ప అవినీతి అంతం కాదు అని అన్నా హజారే ప్రకటించిన స్ధాయిలో భారత దేశం ఎందుకున్నట్లు? న్యాయవ్యవస్ధలో లక్షల -కోట్లు కాకపోతే- కేసులు ఎందుకు పెండింగ్ లో ఉన్నట్లు? ప్రతిభ ఉన్న వాళ్ల పాలనలోని ప్రభుత్వరంగం ఎందుకు విఫలమైనట్లు? నలభై సంవత్సరాల ప్రభుత్వ రంగం విఫలమైందని ప్రవేటు రంగానికి దాన్ని అమ్మేస్తున్నారే, ఆ ప్రభుత్వరంగాన్ని ప్రతిభ ఉన్న వాళ్ళు ఎందుకు విఫలం చేశారు? ప్రతిభ ఉన్న వాళ్ళ ఆధిపత్యంలోనే బ్యూరోక్రసీ ఇన్నాళ్ళూ కొనసాగిందే, వారి ప్రతిభ బ్యూరోక్రసీకి ఎందుకు చెడ్డపేరు తెచ్చినట్లు? రెడ్ టేపిజం అనీ, తెల్ల ఏనుగులనీ ప్రభుత్వ రంగానికి చెడ్డ పేరు ఎందుకు తెచ్చినట్లు? అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన ప్రతిభ ఈ దేశాన్ని అభివృద్ధి చేయలేదనీ, నిండా అవినీతిలో ముంచడానికే ఉపయోగపడిందనీ, కోటి కోట్ల రూపాయల అవినీతి సొమ్ముని విదేశాల్లో దాచిపెట్టిందనీ.. ఆ అరవింద్ కేజ్రీవాల్ ఒక నాయకుడుగా ఉన్న ఇప్పటి అవినీతి వ్యతిరేక ఉద్యమమే తేల్చి చెబుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ప్రతిభావాదా? అవినీతి వాదా?

గ్రామంలో ప్రతి కులంవాడు ఎవరిపని వారు చేసినట్లయితే అటువంటి గ్రామాలు స్వయం పోషకాలు అవుతాయనీ, అటువంటి గ్రామాలు ఆదర్శ గ్రామాలనీ మహాత్మ గాంధీ ప్రభోధించాడు. భగవద్గీత ప్రభోధించిన వర్ణాశ్రమ ధర్మాన్ని మహాత్మా గాంధీ ఆమూలాగ్రం సమర్ధించాడు. అంటరానితనానికి వ్యతిరేకంగా పైకి ఎన్ని కబుర్లు చెప్పిన మహాత్మా గాంధీ, మన జాతిపిత, చివరికి వర్ణాశ్రమ ధర్మానికి పూర్తిగా కట్టుబడి ఉంటానని ప్రకటించాడు. అటువంటి గాంధీకి అనుచరుడిగా ఉన్న అన్నా హజారే నుండి ఈ దేశంలో 50 శాతం పైన ఉన్న దళితులు, వెనకబడ్డ కులాల వారు ఏన్యాయాన్ని ఆశించగలరు? ఆ గాంధీగారి వర్ణాశ్రమ ధర్మాన్ని పుణికి పుచ్చుకున్న సంస్ధలకు సానుభూతిపరుడుగా ఉన్న అన్నా హజారే, ఏ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు? ఏ నీతిని సమర్ధిస్తున్నట్లు?

అంతెందుకు? గుజరాత్ లో ముస్లిం ప్రజలను ఊచకోత కోసిన నరేంద్ర మోడి పాలనను అద్భుతమైనదని మెచ్చుకున్న అన్నా హజారేకి “సరైన పాలన” అంటే అవగాహన ఉన్నదా? ఉంటే అదేదో కరిగిపోయిన స్వప్నం లాగా ఒక మతస్ధుల ఊచకోతను మరిచిపోయి ఒక ప్రజాకంటకుడి పాలనను మెచ్చుకోగలడా? గుజరాత్ అభివృద్ధి చెందిందని ఒకటే రొద. ఏమిటా అభివృద్ధి? విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించగలగడమే అభివృద్ధిగా పాలకవర్గాలు చెలామణి చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే భావించి ఆంధ్రప్రదేశ్ ని తాను అభివృద్ధి పధంలో తీసుకెళ్ళానని నమ్మి ఎన్నికలకు పోతే ఏమైంది? అది అభివృద్ధి కాదని ప్రజలు చంద్ర బాబుకి నసాళానికి అంటేలా తేల్చి చెప్పారు. అటువంటి అభివృద్ధే గుజరాత్ లో జరుగుతోంది. దానిలో కొద్దిమంది ముస్లిం ధనికులు, వ్యాపారులు అనివార్యంగా లబ్ది పొందుతారు. అందుకు కృతజ్ఞతగానే ముస్లిం వ్యాపారులు అప్పుడప్పుడూ నరేంద్రమోడిని స్తోత్రాలతో ముంచెత్తుతుంటారు. ఆ స్తోత్రాలని ముస్లింలు తనకిచ్చిన సర్టిఫికెట్లుగా మోడి ప్రదర్శించుకుంటే దానిని తలకెత్తుకని కొందరు మిత్రులు ఆయన తరపున అభివృద్ధి చేశాడంటూ వాదిస్తున్నారు.

అన్నా తన ప్రసంగాల్లో చెబుతున్నాడు “వ్యవస్ధ మారనిదే ప్రయోజనం లేద”ని. అదే నిజమైతే, ఊరికే ఉబుసుపోకకు ఆ మాట అనకపోతే, సీరియస్ గానే ఆ మాట అన్నట్లయితే… వ్యవస్ధ మారడానికి అన్నా బృందం ఎందుకు కృషి చేయదు? నిరాహార దీక్షతో లోక్ పాల్ బిల్లుని సాదించడమే ఏకైక కర్తవ్యంగా ఎందుకు కూర్చున్నట్లు?

కుల వ్యవస్ధ సమాజం నుండి తొలగిపోలేదు. చదువు పెరిగే కొద్దీ కొత్త రూపాల్లో కుల వ్యవస్ధ ముందుకొస్తోంది. మరింత సోఫిస్టికేటెడ్ రూపాల్లో అది ముందుకొస్తోంది. పట్టణాల్లో అలా ఉండగానే గ్రామాల్లో సామూహిక హత్యలు, సంఘ బహిష్కరణలు, రెండు గ్లాసుల ఆచరణలు అన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి పరమ అసమాన వ్యవస్ధలో రిజర్వేషన్లు అవసరం లేకుండా ఉంటుందనీ, ప్రతిభ ఆధారంగా చదువు, ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యమం చేసిన అరవింద్ కేజ్రీవాల్ సామాజిక అవినీతి పంకిలాన్ని మోస్తున్నవాడు కాదా? కులపరమైన సామాజిక అవినీతిపై అన్నా బృందం ఉద్యమం చేయదెందుకు? కనీసం ప్రస్తావన కూడా చేయదెందుకు?

సమాజంలోని చెడుగులన్నీ ఏదో ఒక అనైతికత నుండీ, అవినీతి నుండి ఉద్భవిస్తున్నవే. కనుకనే అవినీతిని అంతం చేయాలనుకున్నవారు వ్యవస్ధ మూలాలపైనే పోరాటం చేయవలసి ఉంటుంది. ఎన్నుకున్న సమస్యలపై సమర శంఖం పూరించాలంటూ ఉద్యమం ప్రారంభిస్తే అది వారు చెప్పిన అవినీతి సమస్యను కూడా పరిష్కరించలేదు. చైనాలో ఉరిశిక్షలు వేస్తున్నా అవినీతి కొనసాగుతోంది. ఇండియాలో జన్ లోక్ పాల్ బిల్లు వచ్చినా అదే పరిస్ధితి. కాకుంటే ప్రజల నెత్తిన మరొక నిరంకుశ పాలనా వ్యవస్ధ కూచుంటుంది.

(అగ్ర కులాలంటూ ఈ వ్యాసంలో ప్రస్తావించినది ఏ ఒక్క వ్యక్తినీ ఉద్దేశించింది కాదు. సమాజంలో ఉన్న పరిస్ధితులను ప్రస్తావించుకున్నపుడు ఇటువంటి పదజాలం తప్పదు. ఇతర ఉద్దేశ్యాలు నాకు లేవని గమనించగలరు -విశేఖర్)

15 thoughts on “అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం సంపూర్ణమైనదేనా?

  1. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అద్బుతమైన కథనం.. రాజకీయ, ఆర్థిక అవినీతిపై పోరాటం అనే పేరుతో తరతరాలుగా జరుగుతున్న సామాజిక అవినీతిని, అనీతిని కనీసం స్పృశించని తరహా పోరాటాలు చరిత్రలో ఏ బాట పట్టాయో ఎవరికి తెలీదు. విద్యను అంగడిలో పెట్టి కొనుగోలు చేసేవారు, ప్రతిభను లక్షలాది రూపాయలు విరజిమ్మి కొనుక్కుని సీట్లు సంపాదిస్తున్నారు..

    రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం అనే అత్యంత అసహ్యకరమైన భావనను పబ్లిగ్గా ప్రకటిస్తూ, నామమాత్రంగా ఉన్న రాజ్యాంగ స్పూర్తికి కూడా భిన్నంగా మోర చాస్తున్నవారు వీళ్ళా అవినీతి గురించి మాట్లాడుతోంది? అన్నా శిబిరంలో కీలక ఉగ్రవాది క్రేజీవాల్ అని పేపర్లలో రాతలు చూస్తుంటే నవ్వొస్తోంది. ఉగ్రవాది అనే పాలక వ్యవస్థ ముద్రించిన పదాన్ని మనం అంగీకరిస్తామా లేదా అనేది తర్వాతి విషయం.. క్రేజీవాల్ ఉదంతంతో ఉగ్రవాది అనే పదమే పలుచబారినట్లు కనిపిస్తోంది.

    వారంరోజుల క్రితం పూనే టైమ్స్ ఎడిటర్ విశ్వదీప్ ఘోష్ టైమ్స్ ఆఫ్ ఇండియా బ్లాగులో ఇదే విషయంరాశారు. అన్నా హజారేకి మద్దతుగా రోడ్లమీదికి వచ్చిన లక్షలాది మంది విద్యార్తులలో చాలా మంది డొనేషన్లు కట్టి చదువుకొంటున్నవారే.. వీరంతా అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగం కావడం కూడా వింతగా ఉందని ఘోష్ అబిప్రాయం. రాజకీయ అవినీతిని, ఆర్థిక అవినీతిని, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచీకరణ నేపథ్యంలో విశ్వరూపం ధరించిన అవినీతిని ఎవరు వ్యతిరేకించినా సమర్థించవలసిందే. -చంద్రబాబు, గాలి జనార్ధనరెడ్డి, నరేంద్రమోడి, జగన్ వంటి వ్యక్తులను కాస్సేపు మర్చిపోదాం -.

    కాని మనలోని అవినీతిని, అనీతి మాటేమిటి? కళ్ళముందు లక్ష సామాజిక అవినీతులు, అనీతిలు జరుగుతున్నా నిర్లక్ష్యంగా మెలుగుతున్న వారి అవినీతి వ్యతిరేక పోరాటంలో నెల్లు ఎంత.. పొల్లు ఎంత..

    ఈ సందర్భంగానే మీరు రాసిన మెరుపువ్యాక్యాలు మరోసారి తల్చుకోవాలి.

    “పౌర సమాజ కార్యకర్తల్లో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమకారులు ప్రముఖ భూమికను పోషిస్తున్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం “ప్రతిభను రక్షించండి” అన్న నినాదంపై పుట్టింది. ఈ దేశంలో ప్రతిభ ఏ వర్గాల సొత్తో కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అన్ని సౌకర్యాలతో పెరిగి ప్రతిభను సంపాదించినవానితో గ్రామాల్లో తరతరాల బానిసత్వంతో పుట్టిపెరిగిన వారు ఇప్పటికీ సామాజికంగా అణచివేతకు గురవుతున్నవారు పోటిపడమని చెప్పడం ఏ నీతికి ప్రతీక?”

    “శుభ్రంగా డిగ్రీలు, పి.జిలు, ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ లు చదివి కూడా కుల అహంకారంతో కొట్టుమిట్టాడడం అతి పెద్ద సామాజిక అవినీతి. ఈ అవినీతి గురించి అన్నా బృందం ఎందుకు మాట్లాడదు? అరవింద్ కేజ్రీవాల్ అటువంటి రిజర్వేషన్ వ్యతిరేక, ప్రతిభా పరిరక్షక ఉద్యమానికి నాయకత్వం వహించినవాడిగా ఏ అవినీతిపై పోరాడుతున్నట్లు?”

    “సామాజిక అవినీతిని సమర్ధిస్తూ, మానిటరీ అవినీతిపై ఉద్యమిస్తే అది ఉద్యమమేనా?”

    “ఇన్నాళ్లూ దేశం ప్రతిభ గల వాళ్ల చేతనే పాలించబడింది. అరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఇన్నాళ్లు ప్రతిభగల వాళ్ల చేత పాలింపబడ్డ భారత దేశం అవినీతి కుళ్ళిపోయిందని తాజాగా పౌర సమాజ బృందం ఉద్యమం మొదలు పెట్టింది. ప్రతిభ ఉన్న వాళ్ల పాలనలో భారతదేశం అవినీతిలో ఎందుకు కూరుకున్నట్లు?”

    “ప్రతిభ ఉన్న వాళ్ల పాలనలోని ప్రభుత్వరంగం ఎందుకు విఫలమైనట్లు? నలభై సంవత్సరాల ప్రభుత్వ రంగం విఫలమైందని ప్రవేటు రంగానికి దాన్ని అమ్మేస్తున్నారే, ఆ ప్రభుత్వరంగాన్ని ప్రతిభ ఉన్న వాళ్ళు ఎందుకు విఫలం చేశారు? ప్రతిభ ఉన్న వాళ్ళ ఆధిపత్యంలోనే బ్యూరోక్రసీ ఇన్నాళ్ళూ కొనసాగిందే, వారి ప్రతిభ బ్యూరోక్రసీకి ఎందుకు చెడ్డపేరు తెచ్చినట్లు? రెడ్ టేపిజం అనీ, తెల్ల ఏనుగులనీ ప్రభుత్వ రంగానికి చెడ్డ పేరు ఎందుకు తెచ్చినట్లు?”

    “అంటరానితనానికి వ్యతిరేకంగా పైకి ఎన్ని కబుర్లు చెప్పిన మహాత్మా గాంధీ, మన జాతిపిత, చివరికి వర్ణాశ్రమ ధర్మానికి పూర్తిగా కట్టుబడి ఉంటానని ప్రకటించాడు. అటువంటి గాంధీకి అనుచరుడిగా ఉన్న అన్నా హజారే నుండి ఈ దేశంలో 50 శాతం పైన ఉన్న దళితులు, వెనకబడ్డ కులాల వారు ఏన్యాయాన్ని ఆశించగలరు? ఆ గాంధీగారి వర్ణాశ్రమ ధర్మాన్ని పుణికి పుచ్చుకున్న సంస్ధలకు సానుభూతిపరుడుగా ఉన్న అన్నా హజారే, ఏ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు? ఏ నీతిని సమర్ధిస్తున్నట్లు?”

    “అన్నా తన ప్రసంగాల్లో చెబుతున్నాడు “వ్యవస్ధ మారనిదే ప్రయోజనం లేద”ని. అదే నిజమైతే, ఊరికే ఉబుసుపోకకు ఆ మాట అనకపోతే, సీరియస్ గానే ఆ మాట అన్నట్లయితే… వ్యవస్ధ మారడానికి అన్నా బృందం ఎందుకు కృషి చేయదు? నిరాహార దీక్షతో లోక్ పాల్ బిల్లుని సాదించడమే ఏకైక కర్తవ్యంగా ఎందుకు కూర్చున్నట్లు?”

    “పరమ అసమాన వ్యవస్ధలో రిజర్వేషన్లు అవసరం లేకుండా ఉంటుందనీ, ప్రతిభ ఆధారంగా చదువు, ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యమం చేసిన అరవింద్ కేజ్రీవాల్ సామాజిక అవినీతి పంకిలాన్ని మోస్తున్నవాడు కాదా? కులపరమైన సామాజిక అవినీతిపై అన్నా బృందం ఉద్యమం చేయదెందుకు? కనీసం ప్రస్తావన కూడా చేయదెందుకు?”

    “సమాజంలోని చెడుగులన్నీ ఏదో ఒక అనైతికత నుండీ, అవినీతి నుండి ఉద్భవిస్తున్నవే. కనుకనే అవినీతిని అంతం చేయాలనుకున్నవారు వ్యవస్ధ మూలాలపైనే పోరాటం చేయవలసి ఉంటుంది. ఎన్నుకున్న సమస్యలపై సమర శంఖం పూరించాలంటూ ఉద్యమం ప్రారంభిస్తే అది వారు చెప్పిన అవినీతి సమస్యను కూడా పరిష్కరించలేదు. చైనాలో ఉరిశిక్షలు వేస్తున్నా అవినీతి కొనసాగుతోంది.”

    చాలా మంచి పరిశీలన. పదునైన విశ్లేషణ..

    మీకు అభినందనలు..

  2. 1991 వరకు ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలతోనే నడిచాయి. ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరించాలంటే కృత్రిమ నష్టాలు సృష్టించాలి. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టపోవడం ప్రతిభగల వర్గం చేసిన కృత్రిమ సృష్టే.

  3. అవును. లాభాలొస్తున్న ప్రభుత్వ రంగ కంపెనీలను దివాళా తీయించడంలోనూ, దివాళా తీయకపోయినా తీసినట్లు నమ్మించడంలోనూ వారు తమ ప్రతిభనంతా ప్రదర్శించారు.

  4. perfect!!!

    మాకో కొత్త గాంధీ దొరికాడోచ్ అనుకుంటూ, గుడ్డిగా హజారే బృందం వెంబడి ఊరేగకుండా, జనాలందరూ కాస్త తర్కంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ రచనలు దీనికి దోహదం చేసేలా ఉన్నాయి. Thanks.

  5. మా అమ్మగారు పని చేస్తున్నది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్‌లోనే. అది ఆంధ్రా బ్యాంక్. వాళ్ళ బ్యాంక్ లాభాలతోనే నడుస్తోంది. మా పట్టణంలో ఆ బ్యాంక్‌కి 5 బ్రాంచిలు, 3 ATMలు ఉన్నాయి. కేవలం లక్ష జనాభా ఉన్న పట్టణంలో ఒక బ్యాంక్‌కి 5 బ్రాంచ్‌లు ఉన్నాయంటే ఆ బ్యాంక్ లాభాలతో నడుస్తోందనే చెప్పొచ్చు.

  6. “శాసన వ్యవస్ధ, న్యాయ వ్యవస్ధ, బ్యూరోక్రసీ, పత్రికా రంగం ఇవి నలుగూ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని గొప్పగా చెప్పుకుంటారు. ఈ నాలుగు రంగాలలొనూ ఇన్నాళ్లు అగ్ర కులం వాళ్ళే ఆధిపత్యం వహిస్తూన్నారు.,………ప్రతిభ ఉన్న వాళ్ల పాలనలో భారతదేశం అవినీతిలో ఎందుకు కూరుకున్నట్లు? ” మీ ఎనాలసిస్‌ చాలా స్ట్రైట్‌గా ఉంది…. బాగుంది. ధాంక్‌యూ.

  7. అద్భుతమైన విశ్లేషణ
    నేను సామాన్యంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకీయాలని ప్రత్యేకంగా చదువుతాను. ఎందుకంటే మిగతా పత్రికలతో పోల్చినప్పుడు జ్యోతి సంపాదకీయాలు అన్ని కోణాలనీ స్పృశిస్తూంటాయి. ఎటువంటి వ్యాపారాత్మక లాభనష్టాల మకిలి అంటకుండా కొంతమేరకైనా జాగ్రత్త పడతాయి. మొదటిసారిగా దాన్ని మించిన ఉత్తమ స్థాయి వ్యాసాన్ని ఇప్పుడే చదివాను. వి. శేఖర్ గారూ మీరీవ్యాసంగాన్ని ఇంతే వాడిగానూ సూటిగానూ కొనసాగించండి. ప్రస్తుత సమాజం తన్ను తాను తీర్చిదిద్దుకుంటున్న ఈ సంధి కాలంలో మీవంటి విశ్లేషకుల అవసరం ఎంతైనా వుంది.
    అభివందనాలతో…

  8. అన్నా హజారే వాదం అనేది చిన్న పిల్లలకి చెప్పే నీతి కథలు వంటిది. చిన్న పిల్లలకి చెప్పే నీతి కథలలో దొంగతనాలు చెయ్యకూడదు, లంచం ముట్టుకోకూడదు, అబద్దాలు ఆడకూడదు అని చెపుతారు కానీ సమాజంలో డబ్బున్నవాళ్ళూ-పేదవాళ్ళూ అనే వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయో చెప్పరు. ఆ కథలు విన్న పిల్లలు కూడా నీతిగా బతకడం అంటే కేవలం దొంగతనాలు చెయ్యకపోవడం, లంచం ముట్టుకోకపోవడం, అబద్దాలు ఆడకపోవడం లాంటి నియమాలకి కట్టుబడి ఉండడం మాత్రమే అని అనుకుంటారు. వాళ్ళకి ఆర్థిక వైరుధ్యాలు కనిపించినా ఆ వైరుధ్యాలని సాధారణ విషయాలు అనుకుని చూసీచూడనట్టు ఉండిపోతారు.

వ్యాఖ్యానించండి