బ్రిటన్‌ యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, అల్లర్లకు అదే కారణం


LONDON-RIOTSబ్రిటన్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం అక్కడ నిరుద్యోగం భూతం జడలు విప్పింది. ప్రభుత్వరంగం ఉద్యోగులను తొలగిస్తుండంతో పాటు ప్రవేటు రంగ ఉత్పత్తి స్తంభించిపోవడంతో నిరుద్యోగం పెరుగుతున్నదని భావిస్తున్నారు. లండన్ తో పాటు ఇతర నగరల్లోని పేద కుటుంబాల యువకులు కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడిన నేపధ్యంలో వెలువడిన ఈ వివరాలు అల్లర్లకు కారణమేమిటో చెప్పకనే చెపుతున్నాయి. రాజకీయ నాయకులు, కార్పొరేట్ మీడియా కూడబలుక్కుని అల్లర్లకు, నిరుద్యోగం కారణం కాదంటూ నమ్మబలుకుతున్నప్పటికీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్న సంగతిని ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి.

రెండవ క్వార్టర్‌లో (మే,జూన్,జులై) బ్రిటన్ నిరుద్యోగం 1.8 శాతం పెరిగి, నిరుద్యోగుల సంఖ్య 2.49 మిలియన్లకు (24.9 లక్షలు) చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. ఈ క్వార్టర్లో 154,000 మంది ఉద్యోగులు పని కోల్పోయి నిరుద్యోగులుగా మారారు. యువతలో నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతోంది. 950,000 మంది నిరుద్యోగులుగా ఉండగా వీరి సంఖ్య మిలియన్ కు చేరువవుతోంది. వీరిలో 20.2 శాతం మంది లేదా 5 వ వంతు యువకులు 16 నుండి 24 సంవత్సరాల వయసువారే కావడం గమనార్హం. వీరిలో కూడా 100,000 మందికి పైగా కనీసం రెండు సంవత్సరాలనుండి నిరుద్యోగులుగా ఉన్నారు. 16, 17 ఏళ్ళ వయసులో చదువు వదిలిపెట్టి ఉద్యోగాలు వెతికేవారిలో సగం మందికి ఏ ఉద్యోగమూ దొరకటం లేదు. మహిళలలో నిరుద్యోగం 1988 నుండి ఇప్పుడే అధికంగా ఉంది. వీరి సంఖ్య 21,000 పెరిగి 1.05 మిలియన్లకు చేరుకుంది.

బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి చెందకుండా దాదాపు స్తంభించిపోయింది. ఈ సంవత్సరం రెండవ క్వార్టర్ లో జిడిపి వృద్ధి రేటు కేవల 0.2 శాతం మాత్రమే నమోదైంది. 2008 తర్వాత మరోసారి ఆర్ధిక మాంద్యం (రిసెషన్) వస్తుందన్న భయాలు సర్వత్రా వ్యాపించాయి. స్టాక్ మార్కెట్లలో ఇటీవల సంభవించిన పతనాలు, యూరప్ రుణ సంక్షోభం అన్నీ కలిసి బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధను అల్లకల్లోలం చేస్తున్నాయి. వాయవ్య ఇంగ్లండ్ ప్రాంతంలో నిరుద్యోగం అధికంగా ఉంది. ఇక్కడ నిరుద్యోగం 13 శాతం పెరిగి 300,000కు నిరుద్యోగుల సంఖ్య చేరుకుంది. వాయవ్య ఇంగ్లండు లో గల లివర్ పూల్, మాంఛెస్టర్ నగరాలు ఇటీవల అల్లర్లకు ఎక్కువగా గురవ్వడం ఈ సందర్భంగా గమనార్హం.

లండన్ నగరం లో కూడా నిరుద్యోగం తీవ్రంగా ఉంది. ఇక్కడ 29 ఏళ్ళ మార్క్ డగ్గన్ ను పోలీసులు కాల్చి చంపడంతోనే అల్లర్లు మొదలయ్యాయి. అధికారిక అంచనా ప్రకారం లండన్ లో నిరుద్యోగులు 406,000 మంది ఉన్నారు. గత 15 సంవత్సరాలలో లండన్ నిరుద్యోగం నాలుగు లక్షల సంఖ్యను దాటడం ఇదే ప్రధమం. లండన్ లో ఆర్ధికంగా చురుకుగా ఉన్న వారిలో ఈ సంఖ్య 10 శాతం తో సమానంగా ఉంది. ఈశాన్య ఇంగ్లండ్ ప్రాంతం మాత్రమే పది శాతం నిరుద్యోగం కలిగి ఉంది.

పోలీసులు అరెస్టు చేసిన వెయ్యి మందికి పైగా యువకుల్లో 2/5 వంతు మందిని అల్లర్లలో పాల్గొన్నారంటూ ప్రాసిక్యూట్ చేశారని గార్డియన్ పత్రిక తెలిపింది. వీరంతా బ్రిటన్‌లో అత్యంత పేద ప్రాంతాల్లో నివసించేవారేనని గార్డియన్ తెలిపింది. ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (టియుసి) వెలువరించిన నివేదిక ప్రకారం లండన్‌లోని మూడు బారో (చిన్న సైజు మున్సిపాలిటి) లయిన హాక్నీ, తొట్టెన్‌హామ్, లూయిస్‌యామ్ లు ఇంగ్లండులో ఉద్యోగం దొరకడం అత్యంత కష్టమైన మొదటి పది ప్రాంతాల్లో మొదటి స్ధానాలను ఆక్రమించాయి. హాక్నీలో ప్రతి ఉద్యోగానికి 22 మంది పోటీపడే పరిస్ధితి ఉందనీ, తొట్టెన్ హామ్ ఉన్న హ్యారింగేలో ఈ సంఖ్య 29 కాగా లూయిస్‌హామ్ లో 21 గానూ ఉంది. ఈ ప్రాంతాల్లోనే అల్లర్లు ఎక్కువగా జరగడం గమనార్హం.

“చిల్డ్రన్ అండ్ యంగ్ ప్యూపుల్ నౌ” అనే సంస్ధ ఒక పరిశోధన జరిపింది. ఈ ప్రాంతాల బడ్జెట్‌లలో యువజన సేవలు, కనెక్షన్ కెరీర్ సలహా సేవలతో సహా ఇతర సేవలలో దారుణమైన కోతలు విధించారని తేలింది. కనెక్షన్ కేంద్రాలను (Connexion Centres) బ్రిటన్ ప్రభుత్వం 2000 సం. లో ఏర్పాటు చేసింది. 13 నుండి 19 సంవత్సరాల వయసుగల యువకులకి ఈ కేంద్రాలు ప్రభుత్వ సమాచారం తెలియపరచి సలహాలు, మార్గదర్శకత్వం అందిస్తాయి. నేర్చుకోవడంలో కష్టాలు ఎదుర్కొంటున్న యువకులకి వయసు నిబంధన 25 సం. వరకూ అనుమతించారు. ఇవి దేశమంతటా, ప్రతి కౌంటీలోనూ అనేక సంఖ్యలో ఏర్పాటు చేశారు. విద్య, ఇళ్ళు, ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, డ్రగ్స్, ఫైనాన్స్ ముదలైన అంశాల్లో ఈ కేంద్రాల వద్ద సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కేంద్రాలకు కన్సర్వేటివ్, లిబరల్ డెమొక్రాట్ ల కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అనేక మార్పులు తెచ్చింది. ఇటీవల సంవత్సరాలలో, ముఖ్యంగా నిధులలో, దారుణంగా కోత పెట్టారు.

హ్యారింగే (తొట్టెన్ హామ్) లో ఈ సంవత్సరం కేటాయించిన నిధులను గత సంవత్సరంతో పోలిస్తే 61 శాతం కోత విధించారు. మరో 30 శాతం వచ్చే సంవత్సరం కోత విధిస్తారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అల్లర్లు జరిగిన సాల్‌ఫర్డ్ లో “యంగ్ పీపుల్” సేవలు ఈ సంవత్సరం 30 శాతం కోత పెట్టారు. ఇదే సంవత్సరం మరో 18 శాతం కోత విధించడానికి రంగం సిద్ధం చేశారు. ‘లండన్ బరో ఆఫ్ లాంబెత్’ యువజన సర్వీసులకోసం ఏర్పాటు చేసే నిధిని 8.9 బ్రిటిష్ పౌండ్లనుండి 6.2 బ్రిటిష్ పౌండ్లకు తగ్గించివేశారు. ఈ కోత 30 శాతానికి సమానం. ఈ కోతలతో యువత భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. అవకాశాలు అంతకంతకూ తగ్గిపోయాయి. బ్రిటన్ లోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పౌదుపు విధానాలకు ఈ కోతలు ఒక సూచిక మాత్రమే. పొదుపు చర్యల పేరుతో సమీప గతంలో ఎలాంటి ఉదాహరణ లేనందున కూటమి ప్రభుత్వానిది కోతలలో ఇష్టారాజ్యంగా మారింది.

యూనివర్సిటీలలో చదువుకున్న గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా సమాజంలోకి త్వరలో అడుగుపెట్టనున్నారు. వీరి చేరికతో నిరుద్యోగం మరింత పెరుగుతుంది. 2008 ఆర్ధిక మాంద్యం తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తయ్యి రెండు సంవత్సరాల వరకూ ఉద్యోగం దొరకని వారి సంఖ్య రెట్టింపు అయ్యిందని ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రతి ఐదుగురిలో ఒకరు (ఇరవై శాతం) గ్రాడ్యుయేషన్ పూర్తయిన రెండేళ్ల వరకు నిరుద్యోగులుగా ఉంటున్నారు. దీనికి తోడు యూనివర్సిటీలలో ప్రవేశం కోరుతున్నవారిలో అనేక మందికి ఈ సంవత్సరం దొరకడం లేదు. వచ్చే సంవత్సరం ట్యూషన్ ఫీజుని మూడు రెట్లు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్ధులు ఆలోగానే యూనివర్సిటీ సీట్లు సంపాదించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాని సీట్ల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. 29,500 సీట్ల కోసం ఈ సంవత్సరం 192,000 మంది అభ్యర్ధులు పోటీపడుతున్నారు.

పూర్తి స్ధాయి ఉద్యోగాల సంఖ్య బాగా పడిపోయింది. దానితో అనేక మంది కార్మికులు, ఉద్యోగులు పార్ట్ టైం ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. లేదా సొంతగా ఉపాధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. పార్ట్ టైం కార్మికుల సంఖ్య రెండో క్వార్టర్ లో 83,000 మంది పెరిగి 1.26 మిలియన్లకు చేరుకుంది. వీరికి ఉద్యోగాల కాంట్రాక్టులేవీ ఉండవు. జబ్బు పడితే వేతనం కోత పెడతారు. సెలవులు అసలే ఉండవు. నిరుద్యోగం పెరిగే కొద్దీ కంపెనీల యజమానులు ఆ పరిస్ధితిని తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నాయి. వేతనాల్లో కోత పెడుతున్నాయి. వారానికి సగటు వేతనం రెండో క్వార్టర్లో 2.2 శాతమే పెరిగింది. ద్రవ్యోల్బణం దీనికి రెట్టింపు ఉన్నందున నిజవేతనం మరింత తగ్గిపోయింది. రిటైల్, హోటళ్ళు, పబ్లిక్ రంగ కంపెనీలలో వార్షిక వేతనంలో పెరుగుదల రెండో క్వార్టర్ లో కేవలం 2 శాతమే నమోదైంది.

ప్రజావసరాల ధరలు పెరుగుతున్నాయి. బ్రిటిష్ గాస్ సంస్ధ ఎలెక్ట్రిసిటీ ధర 16 శాతం, గ్యాస్ ధర 18 శాతం పెంచుతానని గత వారమే ప్రకటించింది. రైలు ఛార్జీల ధరలు వచ్చే సంవత్సరం 8 శాతం పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కోతలు, ధరల పెంపు అన్నీ బ్రిటన్ లోని మితవాద కూటమి ప్రభుత్వం అమలు జరుపుతున్న పొదుపు ఆర్ధిక విధానాలలో భాగం. అదీ కాక ఇవి ఇంతటితో ఆగబోవడం లేదు. ప్రతి సంవత్సరం మరింత కఠినమైన పొదుపు విధానాలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం పధకాలు రచించుకుంది. ఇతర యూరప్ దేశాల వలెనే ఇంగ్లండుకి కూడా మోయలేనంత రుణ భారం ఉంది. రుణం తగ్గించుకోవడం, బడ్జెట్ లోటు తగ్గించుకోవడం పేరుతో కార్మికులకు, ఉద్యోగులకు ఇస్తున్న సదుపాయాలను మరింగ కోత పెట్టబోతున్నారు. పన్నులు కూడా పెంచనున్నారు. ప్రజా సామాన్యంపై ఇన్ని దారుణాలకు పాల్పడుతున్న బ్రిటన్ ప్రభుత్వం ద్రవ్య కంపెనీలు, బ్యాంకులు తదితర ధనిక సంస్ధలు, వ్యక్తులకు పన్నుల రాయితీలు, సబ్సిడీలు, బెయిలౌట్లు ఇబ్బడి ముబ్బడి గా ఇచ్చేస్తోంది. కొనుగోలుదారులైన వినియోగదారులకు చేతిలో డబ్బు లేకుంటే కంపెనీల ఉత్పత్తులను కొనేవారుండరనీ, ఆ విధంగా అధికోత్పత్తి సంక్షోభం ఏర్పడి ఆర్ధిక వ్యవస్ధ చురుకుదనం కోల్పోయి మాంద్యం తప్పదన్న ఇంగిత జ్ఞానం పెట్టుబడిదారీ కంపెనీలకీ, మితవాద ప్రభుత్వానికి లేదు.

ఈ కోతలకు వ్యతిరేకంగా తొట్టెన్ హాం లోనే నెల రోజుల క్రితం రెండు వేల మంది యువకులు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు. ఈ ఊరేగింపు వార్తని ఒక్క కార్పొరేట్ పత్రిక కూడా ప్రచురించలేదు. వారి నిరసనను పట్టించుకోక పోగా తమలో ఒకరిని పోలీసులు కాల్చి చంపడంతో యువత ఎప్పటినుండో దాగి ఉన్న అసంతృప్తిని అల్లర్ల రూపంలో వెళ్ళగక్కింది. ఒక్క ఉదుటున వెల్లడైన యువత ఆగ్రహం వెనక ఒక పధకం ఉందనీ, ఈజిప్టు యువత ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తుంటే, లండన్ యువత ఐఫోన్లు, ఐప్యాడ్ ల కోసం ఉద్యమిస్తున్నారని కార్పొరేట్ పత్రికలు కార్మికవర్గ యువతపై విషం కక్కాయి. అల్లర్ల వెనుక ఉన్న సామాజిక విషాధాన్ని చూడడానికి నిరాకరించాయి. కళ్ళెదుట కనిపిస్తున్నా కళ్ళు మూసుకుని వ్యతిరేక వార్తలు ప్రచురించాయి. మిత వాద ప్రభుత్వ నాయకుడు ప్రధాని కామెరూన్ కామన్స్ సభలోనే దేశ యువతపై విషం కక్కాడు. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సరదాకి సందేశం ఉంచినవారికి సైతం కోర్టులు నాలుగు సంవత్సరాల జైలు విధిస్తే కామెరూన్, పార్లమెంటులోనే “భేష్” అని ప్రశంసించాడు. ఇల్లిల్లూ గాలించి అల్లర్లతో సంబంధం ఉన్నవారినీ లేనివారినీ కూడా నిర్బంధించి ప్రాసిక్యూట్ చేసి రాజకీయ శిక్షలు విధిస్తున్నారు.

ఈ పాలకులే మూడు సంవత్సరాల క్రితం వందల బిలియన్ల డాలర్ల మేరకు అవినీతి, అక్రమాలకు పాల్పడిన బడా కంపెనీలను ఏ శిక్షా లేకుండా వదిలేశారు. పన్నులు కట్టకుంటా ఎగ్గొట్టి నల్ల ధనాన్ని దాచుకున్న బిలియనీర్లకి తాయిలాలు అందించారు. నల్లధనం పెరగడానికి దోహదబడిన బ్యాంకులు కుప్ప కూలితే ప్రజలు కట్టిన పన్నుల ధనాన్ని బెయిలౌట్లుగా పందేరం పెట్టారు. ఎన్ని అక్రమాలు చేసిన ఎంత అవినీతికి పాల్పడినా, ఎంత నల్లధనాన్ని పోగేసినా, చివరికి మొత్త ఆర్ధిక వ్యవస్ధనే కుప్పకూల్చినా వీరికి శిక్షలు ఉండవు. పైగా సమాజంలో వీరే పెద్ద మనుషులు. పన్నుల డబ్బుని దిగమింగి ఒక్క ఉద్యోగాన్ని కూడా కల్పించని ఈ కంపెనీలకి ప్రభుత్వాల పూర్తి వత్తాసు దొరుకుంది. కాని చదువు అందుబాటులో లేక, ఏదోలా కష్టపడి చదువుకున్నా ఉద్యోగాలు లేక, సమాజంలో చాతకాని వాళ్లలా మిగిలిపోయి, తల్లిదండ్రులకు భారంగా మారి, పేదలైనందుకు పోలీసుల రోజువారీ తనిఖీలకు గురవుతూ చచ్చి బతుకుతూ, బతుకుతూ చస్తున్న యువకులు ఆగ్రహం ఆపుకోలేక, అల్లర్లలో తమ అధికారాన్ని చూసుకోవడానికి పయత్నించిన యువతను దారుణంగా శిక్షించడానికి ఈ పాలకులు సదా సిద్ధంగా ఉంటారు. అయితే అల్లర్లకు పాల్పడినవారిని శిక్ష లేకుండా వదిలేయాలా? అది కాదు అసలు ప్రశ్న. అల్లర్లకు యువత ఎందుకు పాల్పడింది? అన్నది అసలు ప్రశ్న.

నిరుద్యోగులుగా ఉంటూ ప్రభుత్వ సొమ్ము నిరుద్యోగ భృతి లాంటి సౌకర్యాలని తేరగా తింటున్నారనీ, అవి తగ్గించడంతో పందుల్లా దోచుకుతింటున్నారనీ, ఒక పధకం ప్రకారం దాడులు చేస్తున్నారని కొంతమంది మేధావులు బుద్ధి జీవులు ఆరోపిస్తున్నారు. ఈ మేధావులు, ఈ బుద్ధి జీవులు ఆర్ధిక సంక్షోభానికి కారకులెవరో ఎప్పుడైనా ఆలోచించారా? వాల్‌స్ట్రీట్ కంపెనీల లాంటి బహుళజాతి సంస్ధలు, ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులు అత్యాశతో, పేరాశతో తయారు చేసిన సెక్యూరిటీల వల్లనే సబ్ ప్రైమ్ సంక్షోభం వచ్చిందని వీరు తెలుసుకున్నారా? ఎటువంటి గ్యారంటీ లేకుండా ట్రిలియన్ల కొద్దీ హౌసింగ్ లోన్లను ఇచ్చినందుకు ఎవరినైనా శిక్షించారా? కంపెనీల షేర్లపైన అడ్డగోలు పందేలు కట్టి వాటి పతనానికి కారణమైన వారికి శిక్షలు విధించారా? ఆర్ధిక సంక్షోభం తలెత్తాక వరుసగా జరిగిన జి20 గ్రూపు సమావేశాలలో అమెరికా, యూరప్, ఎమర్జింగ్ దేశాలన్నీ కలిసి ఇలాంటి ఆర్ధిక నేరాలకు పాల్పడ్డవారిని ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. నల్లధనం దాస్తున్న బ్యాంకుల ఆట కట్టించాలని తీర్మానించారు. హౌసింగ్ లోన్లను అతిగా సెక్యూరిటైజేషన్ చేసి విషతుల్యమైన ఆస్తులుగా మార్చిన వారిని శిక్షించాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయాలు, తీర్మానాలు ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు. పైగా ఆర్ధిక సంక్షోభానికి కారణమైన బడా కంపెనీలకు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను దోచి పెట్టారు. ప్రజలనుండి వసూలు చేసిన పన్నుల డబ్బుని ఆర్ధిక నేరాలకు పాల్పడిన బహుళజాతి సంస్ధలకు అప్పనంగా పంచి పెట్టారు. అది చాలక అప్పు తెచ్చి పందేరం పెట్టారు. ఫలితంగా దేశాల అప్పు అలవిగానంత స్ధాయికి చేరుకుంది. ఆ అప్పు ఎవరికోసం తెచ్చారు. బహుళజాతి సంస్ధలకు, అనేక ఆర్ధిక అక్రమాలతో ఆర్ధిక సంక్షోభాన్ని తెచ్చి కుప్పకూలిపోయిన బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, హెడ్జ్ ఫండ్‌లు, ఇంకా సవాలక్ష రకాల నీతిమాలిన కంపెనీలు…. వీటి కోసమే అప్పు తెచ్చి పంచింది. అప్పు తీరడానికి ఎవరిపైన భారం వేయాలి? ఆ అప్పులతో లబ్ధి పొంది ఆర్ధిక సంక్షోభం నుండి కోలుకున్న బడా కంపెనీలపైనే వెయ్యాలి. కాని జరుగుతున్నది అందుకు పూర్తిగా భిన్నమైనది. బడా కంపెనీలకి ప్రోత్సహాకలని కొనసాగిస్తూ, ఆర్ధిక సంక్షోభానికి ఏ విధంగాను కారణం కాకపోగా, ఆ సంక్షోభం దెబ్బకి ఉన్నవన్నీ అమ్ముకుని నాలుగు మెతుకులు కూడా తినలేని కార్మికులు, ఉద్యోగులపైన ఆ భారాన్ని మోపుతున్నారు.

అమెరికా, యూరప్ లలో ఉన్నది ప్రజా ప్రభుత్వాలు ఎంతమాత్రం కాదు. అక్కడ ఉన్నది ప్రజాస్వామ్యం అసలే కాదు. ఎన్నికలు అనే ప్రహసనాన్ని ఒక్కటే ప్రజాస్వామ్యానికి చిహ్నంగా ఆ దేశాల్లో మిగిలింది. మిగిలినవన్నీ ప్రజలకు వ్యతిరేకంగా జరిగేవే. బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తును తాము నిర్ణయించుకోవలసిన రోజులు వచ్చేశాయి.

వ్యాఖ్యానించండి