జగన్ అవినీతికి మద్దతుగా రాజీనామాలు


దేశమంతా అన్నా హజారే అందిస్తున్న స్ఫూర్తితో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్ధితి అందుకు భిన్నంగా ఉంది. అవినీతికి మద్దతుగా 29 మంది ఎం.ఎల్.ఎ లు ఏకంగా రాజీనామాకే సిద్ధపడ్డారు.

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు సి.బి.ఐ జగన్ కి చెందిన అనేక స్ధావరాలపై గత రెండు రోజులుగా దాడులు చేస్తుండడంతో, జగన్ వేసిన ఎత్తుగడ ఇది. రాజీనామాల ఎత్తుగడతో జగన సాధించేదీ ఏమిటో అర్ధం కావడం లేదు. బహుశా ఉప ఎన్నికలు గెలుచుకుని తాను అవినీతికి పాల్పడలేదని ప్రజలే తీర్పిచ్చారంటూ చెప్పదలుచుకున్నాడా?

ప్రజా తీర్పులు న్యాయ స్ధానాలు ఇచ్చే తీర్పులకు ప్రత్యామ్నాయం కాదని జగన్ కి తెలియదని భావించలేము. మరి దేనికోసం రాజినామాలు చేయబోతున్నట్లు? తన వర్గ ఎం.ఎల్.ఎ ల రాజీనామాలతో సర్కారును పడగొట్టే ఉద్దేశ్యం జగన్ పెట్టుకున్నాడా? పి.ఆర్.పి, ఎం.ఐ.ఎం పార్టీల ఎం.ఎల్.ఎ ల మద్దతుతో సర్కారుకు మెజారిటీ ఉన్న నేపధ్యంలో సర్కారును పడగొట్టడం వీలు కాదు. కనుక సర్కారును పడగొట్టే లక్ష్యం నెరవేరదు.

“ఎఫ్.ఐ.ఆర్ లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి పేరును చేర్చడం మమ్మల్ని కలచివేసింది. చనిపోయిన వ్తక్తిపైన ఆరోపణలు చేస్తారా?” అని ఎం.ఎల్.ఎ పిల్లి. సుభాష్ చంద్రబోస్ అంటున్నాడు. ఒక మనిషి చనిపోయినా బ్రతికున్నా అతను చేసిన అవినీతి పనులు మాత్రం భూమ్మీద కొనసాగుతాయని బోస్ గారికి తెలియదా? కొన్ని పదుల వేల కోట్ల అవినీతికి విచ్చలవిడిగా అనుమతించి పరమదిస్తే ఆ డబ్బు ఎవరిదని వై.ఎస్ పేరుని ప్రస్తావించకుండా వదిలేయాలి? ప్రజాధనాన్ని లూటీ చేసి కొడుకికి అప్పగించి వెళ్తే పోలీసులు, న్యాయ వ్యవస్ధ “పాపం చనిపోయాడు” అని జాలి చూపాలా లేక తమ విధులు తాము నిర్వర్తించాలా?

బోస్ “చనిపోయిన తండ్రిపైన ఆరోపణలు చేస్తారా?” అంటుంటే ఎం.పి సబ్బం హరి దానికి భిన్నంగా “బతికున్న కొడుకుపైన దర్యాప్తు జరుపుతారా?” అని ప్రశ్నిస్తున్నాడు. “వై.ఎస్.రాజశేఖర రెడ్డి బ్రతికున్నపుడు అవినీతికి పాల్పడి ఉండొచ్చు. అందుకు కొడుకు జగన్ ని వేధిస్తారా?” సబ్బం హరి వాపోతున్నాడు. వీళ్ళిద్దరూ పరస్పరం వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి?

ఇద్దరికీ రాజీనామాలపై సరైన స్పష్టత లేదని భావించవలసి ఉంటుంది. జగన్ పైన కేసులు పెట్టి వేధిస్తున్నారన్న రంధి తప్ప రాజీనామాలు ఎందుకు చేస్తున్నదీ వీరికి ఒకే స్పష్టత లేదు. జగన్ పైన హైకోర్టే విచారణ జరిపిస్తున్న దన్న ఇంగితం కూడా వీరికి లేకుండా పోయింది. ఎంతసేపూ తమకు టిక్కెట్లిప్పించింది వై.ఎస్.ఆర్ అనే భావిస్తారు తప్ప తమను ఓట్లేసి గిలిపించింది ప్రజలేననీ, వారి కోసం పని చేయాల్సిన అవసరం ఉందనీ వీరు కలలో కూడా తలుచుకోరు లాగుంది.

దేశంలో ఒక అవినీతిపరుడిపై  పరిశోధనా సంస్ధలు విచారణ జరుపుతుంటే ఆ విచారణలు జరపకూడదనీ, కోర్టులో కేసులు వేయరాదనీ డిమాండ్ చేస్తూ ఎం.ఎల్.ఎ లు రాజినామాలు చేసిన చరిత్ర బహుశా ఆంధ్రప్రదేశ్ కే దక్కబోతుందేమో. దేశమంతా అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో రగులుతుంటే, ఆంద్రప్రదేశ్ లోని 29 ఎం.ఎఎల్.ఎలు అవినీతిపై దర్యాప్తు జరపొద్దని రాజినామా చేస్తున్నారు!

వ్యాఖ్యానించండి