ఐ.ఎం.ఎఫ్, ఇయు షరతుల ఫలితం, ఐర్లండు ప్రజలపై త్వరలో మరో విడత బాదుడు


బెయిలౌట్ మంజూరు చేస్తూ ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు విధించిన షరతులతో పాటు రేటింగ్ ఏజన్సీలు, వివిధ బ్యాంకుల ఆర్ధికవేత్తల ఒత్తిడి పెరగడంతో ఐర్లండు ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగులపై మరో విడత కోతలు, పన్నులు బాదడానికి సిద్ధమవుతోంది. గత సంవత్సరం నవంబరు నెలలో ఐర్లండు రుణ సంక్షోభంలో కూరుకుపోవడంతో (చెల్లించగల వడ్డి రేట్లకు మార్కెట్లో అప్పు సేకరించలేని స్ధితి) ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు సంయుక్తంగా 67.5 బిలియన్ యూరోల బెయిలౌట్ మంజూరు చేస్తూ విషమ షరతులు విధించాయి. కార్మికులు, ఉద్యోగాలకు ఇస్తున్న సంక్షేమ సదుపాయాలకు కోత పెట్టడం, వెనకా ముందు చూడకుండా వారిపైనా పన్నులు బాదడం… ఇదే ఏ దేశ ప్రభుత్వమైనా అనుసరించే పొదుపు ఆర్ధిక విధానాల సారాంశం.

ప్రభుత్వం ఇంటర్నెట్ లో కొన్ని పత్రాలను అందుబాటులో ఉంచింది. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఇచ్చిన రుణాన్ని తీసుకున్నందుకు అవి ప్రజలపై సంపద పన్ను వేయాలనీ, తిరిగి చెల్లించే పన్నుల్లో కోత పెట్టాలనీ, పెట్రోల్ ధరలు పెంచాలనీ, సంక్షేమ పధకాలకు కోత పెట్టమనీ, ప్రభుత్వ పెట్టుబడుల్లోనూ కోత పెట్టమనీ షరతులు విధించారనీ, వీటితో పాటు ఇంకా కొత్త చర్యలు కూడా తీసుకోవాల్సి ఉందనీ ప్రభుత్వ ఆ పత్రాల్లో పేర్కొంది. 65 లక్షల జనాభా కలిగిన ఐర్లండు ప్రభుత్వం, ఆ మేరకు తన ప్రజల పట్ల నిజాయితీగా ఉందని చెప్పవచ్చు. “గుడ్ బాడీ స్టాక్ బ్రోకర్స్” సంస్ధ కొత్త పొదుపు విధానాల వలన ప్రజలపైన ఏయే రూపాల్లో ఎంత భారం పడేదీ లెక్కకట్టింది.

దాని ప్రకారం, ఇంజనీరింగ్ పరిశ్రమలో కొత్తగా ఉద్యోగం పొందుతున్న కార్మికుడు 2008 నాటితో పోలిస్తే 10 శాతం తక్కువ వేతనాన్ని పొందుతాడు. హోటళ్ళు, కేటరింగ్ విభాగాల కార్మికులు 15 శాతం తక్కువ వేతనం పొందుతారు. హోటళ్ల రంగంలోని మేనేజింగ్ కార్మికులు 30 తక్కువ వేతనం పొందుతారు. నిర్మాణరంగంలో కార్మికులు 30 శాతం, మేనేజర్లు 50 శాతం వేతనం తక్కువగా పొందుతారు. మొత్తం మీద చూస్తే మిగత యూరోజోన్ దేశాలతో పోలిస్తే ఒక యూనిట్ లేబర్ వేతనం 9 శాతం పడిపోగా, 2012 నాటికి మరో 4 శాతం పడిపోతుంది. నిరుద్యోగం పెరుగుతుండడంతో కంపెనీలు తక్కువ వేతనాలతో సరిపెడుతున్నాయి.

జులై నెలలో నిరుద్యోగుల సంఖ్య 1500 పెరిగి 470,300 కి చేరుకుంది. ఇది మొత్తం జనాభాలో 7.2 శాతం కాగా, కార్మిక జనాభాలో 14.5 శాతం తో సమానం.  వీరిలో 40 శాతం మందికి పైగా గత సంవత్సర కాలంలోనే నిరుద్యోగులయ్యారు. అంటే ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల విషమ షరతులు అమలు చేయడం ప్రారంభం ఐనప్పటినుండే నిరుద్యోగం పెచ్చరిల్లింది. 2011 చివరికల్లా మరో 31,000 మంది ఉద్యోగాలు కొల్పోతారని ఐరిష్ సెంట్రల్ బ్యాంకు అంచనా వేసింది. అంటే ఈ సంవత్సరాంతానికి కార్మిక జనాభాలో నిరుద్యోగం 15.5 శాతానికి చేరుకుంటుందన్నమాట. 2008 స్ధాయితో పోలిస్తే 50 శాతం ఆస్తుల రేట్లు పడిపోవడం వలన తక్కువ స్ధాయి కార్మిక వేతనాలతో ఐరిష్ పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్ధ పరిమిత స్ధాయిలోనే వృద్ధి చెందగలిగింది.

ఐర్లండు ఎగుమతుల్ళో 75 శాతం ఒకే కంపెనీకి చెందిన ప్రధాన కంపెనీకి, దాని అనుబంధ కంపెనీలకీ మధ్య జరిగేవే (ట్రాన్స్ నేషనల్ తరహావి). ఈ నేపధ్యంలో 2010 లో ఎగుమతులు 10 శాతం పెరిగాయి. ఎఫ్.డి.ఐ ప్రాజెక్టులు 27 శాతం పెరిగాయి. ఎఫ్.డి.ఐలు ఇంగ్లండుకు 8 శాతం, పారిస్ కు 14 శాతం పెరగడం గమనార్హం. కానీ, ట్రాన్స్ నేషనల్ తరహా ఎగుమతుల్ని మినహాయిస్తే 2011 లో ఐర్లండు ఆర్ధిక వ్యవస్ధ 0.3 శాతం కుచించుకు (contraction) పోతుందని అంచనా వేస్తున్నారు. వేతనాల కోత పారిశ్రామిక వృద్ధిని పరిమితి స్ధాయిలోనే కొలుకునేలా చేయగా, ద్రవ్య రంగం ఇంకా వినాశనకర స్ధితిలోనే కొనసాగుతోంది.

గత సంవత్సరం ఆగస్టు నుండి ఐర్లండ్ ఆధారిత బ్యాంకుల్లోని 900 బిలియన్ యూరోల డిపాజిట్లలో మూడొంతులు దేశం దాటిపోయింది. ఒల జూన్ నెలలోనే 9.3 బిలియన్ యూరోల డిపాజిట్లు తరలిపోయింది. మొత్తం మీద విదేశీ డిపాజిట్లలో 45 శాతం తరలిపోయాయి. ఇవన్నీ ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు దయతో ఐర్లండుకు రుణ వితరణ కావించిన కాలంలోనే జరిగాయి. అంటే విషమ షరతులతో కూడిన ప్యాకేజి వలన ఐర్లండుకు వచ్చిపడిందేమీ లేదు, మరిన్ని కష్టాలు తప్ప. ఐర్లండు బ్యాంకులను దృష్టిలో పెట్టుకునే బెయిలౌట్ ఇచ్చామని ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు చెప్పుకున్నాయి. తీరా చూస్తే ఇంకా ఏ బ్యాంకూ కోలుకున్న ఛాయలు కనిపించడం లేదు. రెండు పెద్ద బ్యాంకుల్ని మూడో పెద్ద బ్యాంకులో విలీనం చేసి మరో పది సంవత్సరాల్లో దాన్ని మూసేయాలని భావిస్తున్నారు.

వ్యాఖ్యానించండి