అమెరికా చర్చలు జరుపుతున్నది తాలిబాన్ డూప్ తో -తాలిబాన్


తాలిబాన్ పేరు చెప్పి మోసం చేస్తున్న డూప్ వ్యక్తితో అమెరికా చర్చలు జరుపుతోందని తాలిబాన్ ప్రకటించి సంచలనం సృంష్టించింది. తాలిబాన్ తరపున అమెరికాతో చర్చలు జరుపుతున్నాడని వ్యక్తి నిజానికి తమ వద్దనే ఉన్నాడని చెబుతూ, సదరు వ్యక్తి ఇంతవరకు ఎప్పుడూ అమెరికాతో చర్చలు జరపడానికి వెళ్ళలేదని తాలిబాన్ వెల్లడించింది. తాలిబాన్‌కి చెందిన ఉన్నత స్ధాయి అధికారితో ఖతార్, జర్మనీలలో చర్చలు జరిపామంటూ ప్రకటించిన అమెరికాకు ఇది ఆశనిపాతం లాంటి వార్తే.

తాలిబాన్ ప్రతినిధి జబీయుల్లా ముజాహిద్ ఆదివారం ఈ విషయాలను వెల్లడించాడు. నాటో మిత్రులు గతంలో నాయకుడు కాని తాలిబాన్ నాయకుడితో చర్చలు జరిపి మోసపోయినట్లుగానే అమెరికా కూడా మోసపోయిందని జబీయుల్లా “ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్” పత్రికకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూ లో తెలిపాడు. “తయ్యబ్ ఆఘా” అనే నాయకుడితో చర్చలు జరిపినట్లుగా అమెరికా ప్రకటించిందనీ కాని ఆయన ఎప్పుడూ అమెరికా అధికారులను కలవలేదనీ ఆయన వివరించాడు. “తయ్యబ్ ఆఘా గా చెప్పుకుంటూ ఎవరో అమెరికా అధికారులను మోసం చేశాడు” అని జుబీయుల్లా తెలిపాడు.

స్టేట్ డిపార్ట్‌మెంట్, సి.ఐ.ఏ లకి చెందిన సీనియర్ అధికారులు తాలిబాన్‌తో ఖతార్, జర్మనీలలో చర్చలు జరిపారని అమెరికా గత కొద్ది నెలల క్రితం ప్రకటించింది. తయ్యబ్ అఘాతో జరిగిన చర్చలు ఉపయోగకరంగా ఉన్నాయని కూడా అమెరికా ప్రకటించింది. ఆఫ్ఘనిస్ధాన్ పార్లమెమ్టు సభ్యురాలు హోమా సుల్తాని, తాను ముల్లా ఒమర్ ని కలిసినట్లు గానూ, అమెరికా ఆఫ్ఘన్ అధికారులతో తమ తరపున చర్చలు జరపని ఒమర్ ఆమెను ఆదేశించాడని  చెప్పడాన్ని కూడా నుబీయుల్లా కొట్టిపారేశాడు. “ఆమె చెప్పిన విషయం మమ్మల్ని ఆశ్చార్యానికి గురి చేసింది. ఎవరి ప్రోద్బలంతో ఆమె ఆ ప్రకటన చేసిందీ నాకు తెలియదు” అని జుబీయుల్లా తెలిపాడు.

అయితే తాలిబాన్ అమెరికాతో అసలు చర్చలే జరపలేదనడాన్ని ఆయన నిరాకరించాడు. గత 18 నెలలుగా అమెరికా అధికారులతో తాము చర్చలలో ఉన్న సంగతిని ఆయన ధృవీకరించాడు. “కాని ఈ చర్చలు ఆఫ్ఘన్ సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనడానికి ఉద్దేశించిన చర్చల్లో భాగం కాదని గుర్తించాలి. ఈ చర్చల ఎజెండా ఖైదీలను పరస్పరం మార్చుకునే విషయానికి మాత్రమే పరిమితం” అని జుబీయుల్లా వివరించాడు.

జుబీయుల్లా, అమెరికాతో చర్చల విషయంలో తాలిబాన్ అవగాహనను పునరుద్ఘాటించాడు. అమెరికా నాయకత్వంలోని నాటో సేనలు ఆఫ్ఘన్ గడ్డపై ఉన్నంతవరకూ అమెరికా లేదా ఆఫ్ఘన్ ప్రభుత్వ అధికారులతో తాలిబాన్ చర్చలు జరపదు అని తేల్చి చెప్పాడు. తాలిబాన్ మొదటి నుండి అమెరికాతో చర్చల విషయంలో ఇదే అవగాహనను ప్రకటిస్తూ వచ్చింది. “విదేశీ బలగాలు మా భూమినుండి వెళ్ళిపోయేవరకూ, ఆక్రమిత సేనలపై మా ‘జిహాద్’ కొనసాగుతుంది” అని జుబీయుల్లా తేల్చి చెప్పాడు.

వ్యాఖ్యానించండి