అన్నా దీక్ష విరమణకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం?


Protesters-at-Ramlila

రాం లీలా మైదానంలో అన్నాకు మద్దతుగా నినాదాలిస్తున్న ప్రజానీకం

అన్నా బృందానికీ, ప్రభుత్వానికి మద్య విభేధాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయన్న ఊహాగానాలు ఆదివారం వెలువడ్డాయి. మాహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ ప్రభుత్వాధికారి ఆదివారం అన్నాను కలవడంతో ఈ ఊహాగానాలు బయలుదేరాయి. అన్నా హజారే మహారాష్ట్ర వాసి కావడం ఈ సందర్భంగా గమనార్హం. సదరు అధికారి, అన్నాల మధ్య జరిగిన చర్చలను “వ్యక్తిగతమైనవి”గా అన్నా బృందం అభివర్ణించడం అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది. ఐతే ప్రధానిని, ఉన్నత న్యాయ వ్యవస్ధను లోక్ పాల్ పరిధిలోకి తీసుకురావడంలో ఎటువంటి రాజీకి అంగీకరించేది లేదని అన్నా బృందం ప్రకటించింది.

మహరాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఉమేష్ చంద్ర శనివారం రాత్రి అన్నా హజారేతో ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు. ఇరువురి మధ్య ఎటువంటి రాజీ ఫార్ములా చర్చకు రాలేదని కూడా తెలిపారు. అయితే అన్నా హజారే, ఉమేష్ చంద్ర ల సమావేశ వివరాలు ఆదివారం జరిగిన హజారే కోర్ కమిటి సమావేశంలో చర్చకు వచ్చాయని అన్నా బృందం సభ్యుడొకరు చెప్పినట్లుగా డెయిలీ భాస్కర్ పత్రిక తెలిపింది. హజారే పాల్గొన్న ఈ సమావేశంలో తమ డిమాండ్లనుండి ఒక్క మెట్టుకూడా దిగవద్దని నిర్ణయించుకున్నట్లుగా అన్నా బృందం తెలిపింది. ప్రధాని, ఉన్నత న్యాయ వ్యవస్ధ విషయంలో తగ్గేది లేదని వారు సమావేశంలో నిర్ణయించుకున్నారు. కాని ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లుని పార్లమెంటునుండి ఉపసంహరించుకోవడం ద్వారా అన్నా బృందం విశ్వాసం చూరగొన్నట్లయితే, చర్చలకు తలుపులు తెరిచే ఉంచుతామని వారు తెలిపారు.

కర్ణాటక మాజీ లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాడని పత్రిక తెలిపింది. అన్నా బృందం ప్రతిపాదిస్తున్న కీలక డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించినట్లయితే, ప్రధాని ఉన్నత న్యాయ వ్యవస్ధలను లోక్‌పాల్ పరిధిలోకి తేవాలన్న డిమాండ్‌ను ఉపసంహరించుకోవచ్చని జస్టిస్ హెగ్డె ఇప్పటికే సూచించాడు. కోర్ కమిటి సమావేశం తర్వాత ఇతర కీలక సభ్యులతో కూడా సంతోష్ హెగ్డె సమావేశమై చర్చలు జరిపారు. ప్రధాని, ఉన్నత న్యాయవ్యవస్ధలను లోక్‌పాల్ పరిధిలోకి తెచ్చే అంశం సమావేశంలో చర్చించినప్పటికీ అంతిమంగా తమ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని భావించినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రధాని, ఉన్నత న్యాయ వ్యవస్ధలను లోక్‌పాల్ నుండి మినయాయించవచ్చని ప్రతిపాదించిన హగ్డే కోర్ కమిటీతోనే కాక ఇతర సభ్యులతో కూడా సమావేశమై చర్చించడాన్ని బట్టి ఆయన తన ప్రతిపాదనకు ఆమోదం వేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఊహాగానాలు జోరందుకున్నాయి.

“మేము చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమే. చర్చలకు వీలుగా తలుపులు తెరుచుకోవాలంటే ప్రభుత్వం అందుకు తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పార్లమెంటునుండి తమ బిల్లుని ఉపసంహరించుకుని, జన్ లోక్ పాల్ బిల్లుని ప్రవేశ పెట్టడం ద్వారా మా నమ్మకాన్ని చూరగొనాల్సి ఉంది. మా నిర్ణయంనుండి వెనక్కి తగ్గడం లేదు. మా నమ్మకం సంపాదించడానికి వారు చేయవలసిన కనీస కార్యం ఇది” అని కోర్ కమిటీ సభ్యుడు స్వామీ అగ్నివేశ్ పిటీఐ తో మాట్లాడుతూ అన్నాడు.

కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలు జరపడానికి ఇంతవరకూ ఒక్క అడుగు వేయలేదని అన్నా బృందం చెబుతున్నప్పటికీ ఉమేష్ చంద్ర రాయబారం కేంద్ర ప్రభుత్వ అడుగుగానే భావించవలసి ఉంటుంది. జస్టిస్ సంతోష్ హెగ్డె ప్రతిపాధించినట్లుగా ప్రధాని, ఉన్నత న్యాయ వ్యవస్ధలను లోక్ పాల్ పరిధినుండి మినహాయించి ఇతర కీలక డిమాండ్లను ఆమోదింపజేసుకోవడానికి అన్నా బృందం ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. అరుణా రాయ్ లాంటి సామాజిక కార్యకర్తలు కూడా అన్నా బృందం డిమాండ్లను మొండి పట్టుదలగా నిరసించడం, లోక్ పాల్ బిల్లు విషయం చూస్తున్న స్టాండింగ్ కమిటీ సభ్యుడైన అభిషేక్ సింఘ్వి తమ కమిటీ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని పేర్కొనడం… నేపధ్యంలో ఈ అవకాశం మరింత పెరిగిందని భావించవచ్చు.

వ్యాఖ్యానించండి