కమ్యూనిస్టు విప్లవకారుల అవగాహనకు దగ్గరలో అన్నా హజారే ప్రసంగాలు


పౌర సమాజ నాయకుడుగా ఆవిర్భవించిన గాంధేయవాది అన్నా హజారే శక్తివంతమైన లోక్‌పాల్ బిల్లుకోసం అయిదు రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తుండడమే కాక మధ్య మధ్యలో ప్రసంగాలు కూడా చేస్తున్నాడు. నిరాహార దీక్ష ప్రారంభం అయినప్పటినుండీ అన్నా చేస్తున్న ప్రసంగాలు కమ్యూనిస్టు విప్లవకారులుగా ఉన్న పార్టీల అవగాహనకు సమీపంలో ఉన్న సంగతి గమనార్హం.

సి.పి.ఐ (ఎం.ఎల్ – మావోయిస్టు), సి.పి.ఐ (ఎం.ఎల్ – న్యూడెమొక్రసీ), సి.పి.ఐ (ఎం.ఎల్ – జనశక్తి) తదితర పార్టీలు భారత దేశంలో విప్లవ పార్టీలుగా ఉన్నాయి. ఈ పార్టీలు గత నలభై, యాభై సంవత్సరాలుగా ఏ అవగాహననైతే వెల్లడిస్తూ వచ్చారో, ఏ నినాదలనైతే ఇస్తూ వచ్చారో, కాస్త అటు ఇటుగా అదే అవగాహన, అవే నినాదాలు అన్నా హజారే ఇస్తున్నారు. నిజాయితీగా ఆలోచించడం మొదలు పెడితే విప్లవ పార్టీల అవగాహనకే ఎవరైనా రావలసిందే అని అన్నా హజారే సూచిస్తున్నారా?

ఉదాహరణకి,

“మనం ఎందుకు పోరాడాలి? ప్రభుత్వ ట్రెజరీల్లో ధనం మనది. ప్రభుత్వ కోశాగారాల్లో (ట్రెజరీస్) ఉన్న సొమ్ముకి ఇప్పుడు దొంగల వలన భయం రాలేదు. ఆ ట్రెజరీలకి కాపలాగా ఉన్న గార్డుల వల్లనే అసలు భయం ముంచుకొచ్చింది. ఈ ద్రోహుల వల్లనే దేశానికి ప్రమాదం వచ్చిపడింది”

“ఎన్నికల వ్యవస్ధలోని లొసుగుల వలన 150 మంది నేరగాళ్ళు ఇప్పుడు పార్లమెంటులో ప్రవేశించారు.”

“64 సంవత్సరాల స్వతంత్ర పాలనలో దేశానికింకా నిజమైన స్వతంత్రం రాలేదు. వచ్చిన ఒకే మార్పు ఏంటంటె ‘తెల్లదొరల స్ధానంలో నల్ల దొరలు రావడమే’. అదే దోపిడి, అదే అవినీతి, అదే రౌడీయిజం ఇంకా కొనసాగుతున్నాయి.”

“ప్రభుత్వం భూముల్ని కంపెనీలకు ఇస్తే, అవి కార్మికులను నియమించుకుని వారి రక్తం తాగుతున్నారు. ఉత్పత్తి తీయాలి లేకుంటే నీ ఉద్యోగం ఊడుతుంది అని కంపెనీలు కార్మికులని బెదిరిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యమేనా? డబ్బు సంపాదన కోసమే అంతా చేరారు. ఈ అవినీతి గొలుసుని తెంపెయ్యాలి.”

ఇవన్నీ కమ్యూనిస్టు విప్లవకారులు గత నలభై ఏళ్లుగా చెబుతున్నవే. శంఖంలో పోస్తేనే తీర్ధం అన్నట్లు విప్లవకారుల నినాదాలు ఒక గాంధేయవాది నోట్లో పడి పత్రికల పతాక శీర్షికలను ఆక్రమించడం యాదృచ్ఛికమే అనుకుంటె అంత కంటే పొరపాటు ఉండదు.

నిజానికీ వాస్తవాలు ఎవరు చెప్పినా వాస్తవాలుగానే పరిగణించబడాలి. కాని నాలుగు దశాబ్దాల క్రితం కమ్యూనిస్టు విప్లవాకారులు చెప్పిన వాస్తవాలు ఉగ్రవాదమో, తీవ్ర వాదమో అయ్యాయి. నేడు ఒక గాంధేయవాది నుండి వెలువడ్డాక, చాలా మంది పరిగణిస్తున్న వాస్తవంగా రూపుదాల్చు కున్నాయి.

ఎక్కడుంది కిటుకు? వాస్తవంలోనే ఉంది. వ్యవస్ధ పునాదులలోకి వెళ్ళి, నిర్మాణాన్ని పరిశీలించి, పునాదుల్లో ఉన్నదెవరో, వారిపైన ఎక్కి కూచున్నదెవరో పరిశీలించితే ఎవరికైనా వాస్తవం ఒకే విధంగా కనిపిస్తుంది. చూసే చూపులోనే తేడా ఉంది తప్ప వాస్తవం ఎన్నటికీ ఒకటే.

పెట్టుబడి పోగేసుకుని కంపెనీలు పెట్టి లాభాల కోసం చూస్తున్న వాడికి తన పెట్టుబడే దేశాన్ని ఉద్ధరిస్తున్నదన్న భ్రమ కలుగుతుంది. శ్రమ తోడుగా లేని పెట్టుబడికి లాభాలు రావన్న సంగతి అతని అనుభవంలో అర్ధమైనా తన నమ్మకాన్ని కొనసాగించడానికి ఇస్టపడతాడు. తాను నమ్మకపోతే వాస్తవాల వెంట వెళ్ళి కార్మికులే లాభాలకు అసలు యజమానులు అని తెలుసుకుంటాడు. అది తెలుసుకున్నాక లాభం తనది కాదని అర్ధమయ్యాక కార్మికుడికి కిరీటం ఇవ్వవలసి ఉంటుంది. అది పెట్టుబడిదారుడికి నచ్చని పని అందుకే తన నమ్మకాన్ని పాఠ్యాంశాల్లోకి చొప్పించి అందర్నీ అదే నిజం నమ్మమని మెదళ్ళకు సంకెళ్ళు విధించాడు.

మధ్య తరగతి జీవికి తన కింది స్ధానాలపైన రోత, పై స్ధానాల పైన ఆశ. ఆ రోత, ఆశ లు జీవితాంతం అతన్ని వెన్నాడుతూనే ఉంటాయి. వెళ్తే అయిష్టంగానైనా కిందికి వెళ్ళగలడేమో కాని పైకి మాత్రం వెళ్లలేడు. వెళ్ళగలిగాడో… అతను దారి తప్పినట్లే. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే మధ్యతరగతి బుద్ధి జీవులు పై స్ధానాల మీద ఉన్న ఆశతో వారి భావాజాలాన్ని ఎక్కించుకుంటాడు. కింది స్ధానాల మీద ఉన్న రోతతో వారిపై ద్వేషం పెంచుకుంటాడు. వెరసి పెట్టుబడిదారుడికి వంతగాడు మిగిలిపోతాడు, చైతన్యం రగిలేదాకా.

కార్మికులకి రెక్కల కష్టం తప్ప మరొదారి లేదు. పని దొరికితేనే తిండి లేకుంటే పస్తులు. తనవైపు ఒక్క క్షణమైనా తేరిపార జూడని ఈ వ్యవస్ధపైన అతని కంటే ఎవరూ ఎక్కువగా ద్వేషించలేరు. ఈ వ్యవస్ధ మొత్తం పూర్తిగా మారాలి అని మరో ఆలోచన లేకుండా కొరేవాడు కార్మికుడే. అందుకే వ్యవస్ధని మార్చాలనుకున్నవారు కార్మికుడిని నెత్తిన పెట్టుకునేది. కాని ఆ కార్మికుడిప్పుడు పై పై మెరుగులకు లోనై ఉన్నాడు. మెరుపుల వెనక వాస్తవం కనిపిస్తున్నా అక్కడికి చేరనీయని బంధనాలు కోకొల్లలు. బంధనాలని తెంచుకోగలిగినవాడే విప్లవకారుడు కాగలడు. బంధనాలకు బద్ధులైనవాడు నిజమైన విప్లవకారుడు కాగలడా? అనుమానమే!

One thought on “కమ్యూనిస్టు విప్లవకారుల అవగాహనకు దగ్గరలో అన్నా హజారే ప్రసంగాలు

  1. “నాలుగు దశాబ్దాల క్రితం కమ్యూనిస్టు విప్లవాకారులు చెప్పిన వాస్తవాలు ఉగ్రవాదమో, తీవ్ర వాదమో అయ్యాయి. నేడు ఒక గాంధేయవాది నుండి వెలువడ్డాక, చాలా మంది పరిగణిస్తున్న వాస్తవంగా రూపుదాల్చు కున్నాయి”

    పై వ్యాఖ్యే కాదు మౌలికంగా మీ వ్యాసం మొత్తంగా బాగుంది. చూసే చూపులోనే తేడా ఉంది తప్ప వాస్తవం ఎన్నటికీ ఒకటే.

    కాని అవినీతికి వ్యతిరేకంగా కోట్లాదిమందిని కదిలిస్తున్న ఈ రెండో స్వాతంత్ర్య పోరాటం ఎలా ముగుస్తుందన్నదే ప్రశ్న. జన్ లోక్ పాల్ బిల్లు నిజంగా పార్లమెంటు పరిశీలనకు వచ్చి అనూహ్యంగా ఆమోదించబడినప్పటికీ, కాంటాక్టులు, కమిషన్లు, దళారుల వ్యవస్థను ఇది తొలగించగలదా? ఈ మూడూ లేకుండా పార్లమెంటరీ -బూర్జువా- ప్రజాస్వామ్యాన్ని ఊహించగలమా? అన్నా వీటిగురించి మాట్లాడుతున్నారా?

    మన పక్కనున్న చైనానే తీసుకుంటే అది పెట్టుబడిదారీ వ్యవస్థ కోరలలో నూటికి నూరుపాళ్లు ఇరుక్కుపోయిన దేశంగా ఎప్పుడో నిరూపించుకుంది. 1980ల నాటినుంచి ప్రతి ఏటా వందలాది మంది అవినీతిపరులను ఉరితీస్తున్నారు. వీళ్లంతా బ్యూరోక్రసీలో భాగం. రాజకీయ వ్యవస్థలో, కమ్యూనిస్టు పార్టీగా పిలుచుకుంటున్న దాని నేతలలో ఏ ఒక్కరినీ ఇంతవరకు ఉరితీసిన పాపాన పోలేదు. మనదేశంలో ఈ తంతు ఎప్పటినుంచో జరుగుతోంది కూడా. కాకుంటే ఇక్కడ అవినీతిపరులకు ఉరిశిక్షలు లేవు.

    అన్నా వాస్తవాన్ని వాస్తవంగా ఇలాగే మాట్లాడుతూ పోతే మన నక్క జిత్తుల హోంమంత్రి రేపో మాపో సాక్షాత్తూ అన్నాయే నక్సలైటు అని ఆరోపించినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు ఎమర్జెన్సీ కాలపు పరిస్థితులు ఏర్పడుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు కూడా.

    అన్నా పోరాటం సినిమాటిక్‌గా ముగియకూడదనే ఆశిద్దాం.

వ్యాఖ్యానించండి