ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ముగిసింది -పాలస్తీనా సంస్ధ హమాస్


పాలస్తీనా మిలిటెంట్ సంస్ధ “హమాస్,” శనివారం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పాలస్తీనాను అక్రమించిన ఇజ్రాయెల్ తో తనంత తానుగా ప్రకటించిన కాల్పుల విరమణ ముగిసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో మధ్య ప్రాచ్యం ప్రాంతంలో ఉద్రిక్తలు మరోమారు ఉచ్ఛ స్ధాయికి చేరనున్నాయి. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, కారణం లేకుండా తమ ఆధీనంలో ఉన్న గాజాపై దాడులు చేస్తూ ప్రజలను చంపుతున్నందున తాము పాటిస్తున్న “కాల్పుల విరమణకు” ఇక అర్ధం లేదని హమాస్ సంస్ధ ప్రకటించింది. గత రెండు రోజుల్లోనే ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 22 మంది చనిపోయారు.

హమాస్ మిలట్రీ విభాగం ఇజ్ ఆల్-కస్సం బ్రిగేడ్స్, కాల్పుల విరమణపై తాజా నిర్ణయాన్ని తీసుకుంది. “ఏ విధమైన కారణం లేకుండా పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న హత్యాకాండ నేపధ్యంలో, ఇజ్రాయెల్‌తో ఇక శాంతి ఉండదు” అని మిలట్రీ విభాగం ప్రతినిధి అబు ఒబీదా ఒక ప్రకటనలో తెలిపాడు. గాజాలో ఉన్న ఇతర మిలిటెంట్ సంస్ధలను కూడా ఈ మేరకు ఇజ్రాయెల్ నేరాలకు సమాధానం ఇవ్వవలసిందిగా హమాస్ కోరింది.

శుక్రవారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు సెంట్రల్ గాజాలో జరిపిన బాంబు దాడుల్లో కనీసం ముగ్గురు మరణించారు. ఐదు సంవత్సరాల బాలుడు చనిపోయినవారిలో ఉన్నారని డాక్టర్లు తెలిపారు. వీరితో కలిసి గురువారం నుండి చనిపోయిన గాజా పౌరుల సంఖ్య 14 కి చేరింది. గురువారం దక్షిణ ఇజ్రాయెల్ లో జరిగిన దాడిలో 8 మంది ఇజ్రాయెల్ దేశీయులు మరణించాక ఇజ్రాయెల్ యుద్ధవిమానాలతో దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడికి హమాస్ బాధ్యత కానప్పటికీ గాజావైపు నుండి జరిగే దాడులన్నింటికే ఇజ్రాయెల్ హమాస్ సంస్ధనే బాధ్యురాలిని చేస్తుంది.

గురువారం నుండి ఇజ్రాయెల్, గాజాపై డజనుకు పైగా వైమానికి దాడులు చేసింది. పాపులర్ రెసిస్టెన్స్ కమిటీ (పి.ఆర్.సి) మిలిటెంట్ సంస్ధ ఇజ్రాయెల్ పై దాడికి బాధ్యురాలిగా ఇజ్రాయెల్ తెలిపింది. గాజా మిలిటెంట్లు గ్రాడ్, కస్సమ్ రాకెట్లను వరుసగా ఇజ్రాయెల్ వైపుకి ప్రయోగించారు. ఈ దాడుల్లో ఎనిమిది మంది ఇజ్రాయెల్ దేశీయులు గాయపడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్ధను గాజా సరిహద్దులకు తరలించి తదుపరి రాకెట్ దాడులను ఎదుర్కోవడానికి సిద్ధపడుతోంది.

బ్రిటన్, అమెరికాలు కుట్ర పూరితంగా 1940ల చివరలో పాలస్తీనా భూభాగంపైన బలవంతంగా ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేయించాయి. దానికి ఐక్యరాజ్య సమితి చేత గుర్తింపును ఇప్పించాయి. అక్కడ నివసిస్తున్న లక్షల మంది పాలస్తీనా కుటుంబాలను ఇజ్రాయెల్ బలవంతంగా తమ ఇళ్ళను ఖాళీ చేయించింది. దానితో పాలస్తీనీయులు పొరుగు దేశాలయిన లెబనాన్, సిరియా, జోర్డాన్ తదితర దేశాలకు వలస వెళ్ళి అక్కడ తాత్కాలిక శిబిరాల్లో బతుకులు వెళ్ళదీస్తున్నారు.

ఇజ్రాయెల్ అప్పటినుండి పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకుని యూదులు నివసించడానికి సెటిల్ మెంట్లను నిర్మిస్తోంది. ఇప్పటికీ పాలస్తీనా అరబ్బులను వారి ఇళ్లలోంచి వెళ్లగొట్టి సెటిల్ మెంట్లు నిర్మించడం కొనసాగిస్తోంది. పశ్చిమాసియాలో అమెరికా ప్రయోజనాలను ఇజ్రాయెల్ నెరవేర్చడంతో ఇజ్రాయెల్ వెధవ పనులన్నింటికీ అమెరీక వత్తాసు వస్తుంది. అమెరికా జోక్యంతో పశ్చిమాసియా గత అరవై సంవత్సరాలుగా అరని అగ్నిగుండంగా రగులుతోంది.

వ్యాఖ్యానించండి