ఇండియా, బెలారస్ ల ఎరువుల ఒప్పందానికి మోకాలడ్డిన అమెరికా?


ఇండియా, బెలారస్ ల మధ్య పొటాష్ ఎరువులకు సంబంధించి కుదిరిన ఒప్పందానికి అమెరికా మోకాలడ్డినట్లు అనుమానాలు తలెత్తాయి. కేబినెట్ నిర్ణయాలను అమెరికాకి చేరవేయడానికి భారత ప్రభుత్వ కేబినెట్ లో అమెరికా ఏజెంటు ఉన్న అనుమానాలు కూడా వాటికి జత కలిశాయి. పాత సోవియట్ రాజ్యం బెలారస్‌లోని పొటాషియం గనులను కొనాలనీ, అలాగే విదేశాలలో ఎరువుల గనులను ప్రాధామ్యం ప్రాతిపదికన సొంతం చేసుకోవాలని కేంద్ర కేబినెట్ సూత్ర ప్రాయంగా ఒక ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన రోజునే బెలారస్ పై అమెరికా ఆంక్షలు విధించడం ఈ అనుమానాలను రేకెత్తించింది.

భారత దేశంలో ఎరువుల కోరత తీవ్రంగా నెలకొంది. రైతుల డిమాండ్ ని దేశీయ ఉత్పత్తి అందుకోలేక పోతున్నది. ఈ నేపధ్యంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చే లోపే అమెరికా బెలారస్ పై ఆంక్షలు విధించడంతో బెలారస్ ఒప్పందం అటకెక్కింది. బెలారస్ దేశంలో ప్రజాస్వామ్యం లోపించినందున ఆ దేశంపై అదనంగా కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లుగా బుధవారం అమెరికా ప్రకటించింది. దీనితో కేబినెట్ లో తీసుకోబోయే నిర్ణయం ముందుగా అమెరికాకి చెందిన ఎరువుల వ్యాపార కంపెనీలకు చేరవేశారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బెలారస్ పైన ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది. భారత కేంద్ర కేబినెట్ బెలారస్ ఎరువులపై నిర్ణయం తీసుకున్న రోజే అర్జెంటుగా అమెరికా ఆంక్షలు విధిస్తూ ప్రకటన చేయడం అనుమానాలను రేకిత్తిస్తోంది.

ప్రపంచ మార్కెట్ లో పొటాష్ ధరలు అధికంగా ఉన్న నేపధ్యంలో బెలారస్‌తో ఒప్పందంపై నీలినీడలు కమ్ముకోవడం భారత ప్రయోజనాలకు ఆటంకం. ఎరువుల రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇండియా ఎన్నుకున్న దేశాల్లో బెలారస్ ఒకటి. బెలారస్ ఎరువుల కంపెనీ “గ్రోడ్నో అజాట్” (జి.ఎ) పైన అమెరికా కొత్తగా ఆంక్షలు విధించింది. తన వ్యాపార ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి అమెరికా చేసే రౌడీయిజాన్ని ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, బాల కార్మికులు మొదలైన ఆకర్షణీయ నినాదాల వెనుక దాచిపెడుతుంది. ఎప్పటిలాగే బెలారస్ లో ప్రజాస్వామ్యం లోపించిందంటూ బెలారస్ కంపెనీపై ఆంక్షలు విధించింది. దేశంలోని ప్రజాస్వామ్యానికీ ఆ దేశంలోని ఒక కంపెనీ వ్యాపారానికీ సంబంధం ఏంటన్న అనుమానాలు ఎవరికీ రాకూడదు. వస్తే వారు కూడా అమెరికా దృష్టిలో ప్రజాస్వామ్యానికి చేటు తెస్తున్న వారో లేక ఎక్కడో ఎప్పుడో మానవ హక్కులను హరిస్తున్నవారో అవుతారు.

జి.ఎ కంపెనీ పురోగతి అద్భుతంగా ఉందని పేరు సంపాదించుకుంది. 2016 నాటికి ఉత్పత్తి సామర్ధ్యం 40 శాతం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం జి.ఎ ఉత్పత్తి చేస్తున్న 7 లక్షల టన్నుల ఖనిజ ఎరువులలో 40 శాతం ఎగుమతి చేస్తోంది. ఒప్పందం కొనసాగితే బెలారస్ కి ఇండియా పెద్ద వ్యాపార భాగస్వామి కాగలదు. అయితే అమెరికా కూడా ఇండియా మార్కెట్ పై కన్నెసింది. ఇండియా ఎరువుల మార్కెట్ తనకే సొంతం కావాలని అది కోరుకుంటోంది. స్వేచ్చా మార్కెట్ సిద్ధాంతాలను ప్రభోదించే అమెరికా, ఆ సూత్రాలకు తాను కట్టుబడి ఉండదు. మార్కెట్ లో పోటీకి అస్కారం ఇస్తే కంపెనీలు మెరుగైన ఉత్పత్తిని తక్కువ ధరలకు లభించే విధంగా చేయడానికి పోటీ పడతాయనీ, ఆ విధంగా నాణ్యమైన సరుకులు తక్కువ ధరలకు లభిస్తాయని స్వేచ్చా మార్కెట్ సిద్ధాంతం చెబుతుంది. కాని అమెరికా వ్యవహారం అందుకు పూర్తిగా విరుద్ధం. నయానో భయానో బెదిరించి మార్కెట్ లు సొంత చేసుకోవడం దాని అలవాటు. ఇరాన్‌పై ఆంక్షలు విధించినా, లిబియాలో ప్రజాస్వామ్యం స్ధాపిస్తానంటూ బయలుదేరినా, లేక ఇరాక్ లో సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయన్నా వాటి వెనుక అమెరికా వ్యాపార ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి. వ్యాపార ప్రయోజనాలు లేకపోతే ప్రజాస్వామ్యం, హక్కులు ఇవేవీ అమెరికాకి గుర్తురావు. తన మాట విన్నవారి విషయంలో కూడా ప్రజాస్వామ్యం, హక్కులు దానికి గుర్తుకు రావు.

అమెరికా పొటాష్ ఎరువులకు ఎగుమతి మార్కెట్లలో భారత్ ముఖ్యమైనదని దాని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువలన ఇండియా మార్కెట్ బెలారస్ కి కోల్పోవడానికి అమెరికా ఇష్టపడదు. అందుకు అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. ఇండియా ఇరాన్ ల మధ్య గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని కూడా అమెరికా ఇలాగ అటకెక్కించింది. అమెరికా ఆదేశంతో మన్మోహన్ సింగ్ ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. రుజువైన సామర్ధ్యం గల బెలారస్ కంపెనీ నుండి సవాలును ఎదుర్కోలేని అమెరికా అడ్డదారి తొక్కి ఆంక్షలు విధించిందన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. అమెరికా చరిత్రంతా అదే కనుక అవి అనుమానాలుగానే ఉండాల్సిన అవసరం లేదు. ఎరువుల ఎగుమతుల ద్వారా ఆర్ధికంగా కోలుకుందామని బెలారస్ భావిస్తే భావించవచ్చుగాక! అమెరికా ప్రయోజనాలను పక్కన పెట్టడం అమెరికాకి ఎలా కుదురుతుంది?

One thought on “ఇండియా, బెలారస్ ల ఎరువుల ఒప్పందానికి మోకాలడ్డిన అమెరికా?

  1. “ఎరువుల ఎగుమతుల ద్వారా ఆర్ధికంగా కోలుకుందామని బెలారస్ భావిస్తే భావించవచ్చుగాక! అమెరికా ప్రయోజనాలను పక్కన పెట్టడం అమెరికాకి ఎలా కుదురుతుంది?”

    అహ్హహ్హహ్హహ్హా………..

వ్యాఖ్యానించండి