అన్నా హజారే దీక్ష వెనక అమెరికా ప్రోద్బలం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపణలు గుప్పించడంతో అమెరికా నోరు విప్పింది. అన్నా ఉద్యమంలో తమ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది. సామాజిక కార్యకర్త అన్నా హజారేకు మద్దతుగా భారత ప్రజలు చేస్తున్న నిరసనలపై అమెరికా అభిప్రాయాన్ని పత్రికలు పలుమార్లు కోరుతుండడంతో ఆ వ్యవహారం భారత దేశ అంతర్గత వ్యవహారంగా అమెరికా ప్రకటించింది. అంతర్గత వ్యవహారం అంటూనే అమెరికా తన పాత హెచ్చరికను మరోరూపంలో కొనసాగించింది.
స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి విక్టోరియా నూలంద్ ఈ విషయంపై మాట్లాడుతూ “ఇండియాలో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్ధితి భారతీయుల అంతర్గత వ్యవహారం. అమెరికా ఇందులో పాత్రం పోషించడం లేదు” అని ఆమె గురువారం విలేఖరులకు తెలిపింది. భారత దేశంలో పెరుగుతున్న నిరసనల పట్ల అమెరికాకి ఆందోళనగా ఉన్నదా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది.
“కానీ శాంతియుతంగా అభిప్రాయాలు తెలుపుకునే హక్కునూ, సమకూడే హక్కునూ అమెరికా గౌరవిస్తుంది. అన్ని దేశాలనూ, అన్ని పార్టీలను కూడా అలానే చేయాలని కోరుతుంది” అని విక్టోరియా అన్నది. “అమెరికా ఇండియాలు ఉమ్మడి సూత్రాలను, ఉమ్మడి ఆదర్శాలను కలిగి ఉన్నాయి. ఇరు దేశాల ప్రజల కోసం ఉమ్మడి లక్ష్యాలను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ వివాదాలను భారత ప్రభుత్వం, తన ప్రజాస్వామిక వ్యవస్ధ ద్వారా సమర్ధవంతంగా ఎదుర్కొనగలదని మాకు విశ్వాసం ఉంది. అవినీతి పై ప్రజల ఆందోళనలను పట్టించుకుని పరిష్కరించుకోగలదని నమ్మకం ఉంది” అని విక్టోరియా తెలిపింది.
అమెరికా చెప్తున్న వాటిలో నిరాహార దీక్ష చేసుకునే హక్కు కూడా ఉన్నదా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ “భారతీయులంతా కలిసి పరిష్కరించుకో వలసిన సమస్య అని మళ్ళీ చెబుతున్నాను. భారత ప్రజాస్వామిక సాంప్రదాయాల ప్రకారం వారు పరిష్కరించుకుంటారు” అని పేర్కొన్నది.
అబ్బే మాకేం సంబంధం అంటూనే అమెరికా, ఇండియాకి సుద్ధులు చెప్పడానికి ప్రయత్నిస్తున్న సంగతి విక్టోరియా ప్రకటన ద్వారా గమనించవచ్చు. “ఎలుక తోక పట్టి గోదారి ఈదినా నలుపు నలుపే కాని తెలుపు కాజాలదు” అని సామెత. ఓవైపు ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో చావు దెబ్బలు తింటూనే అమెరికా తన మాట చెలాయించుకోవడానికే ప్రయత్నిస్తున్నది.
