ఐతే అన్నా హజారే బృందానికీ, ప్రభుత్వ డ్రాఫ్టుకీ ఎక్కడ తేడాలు వచ్చాయి? ఏ యే విషయాల్లో వారు విభేధిస్తున్నారు? పత్రికలు చెబుతున్నదాని ప్రకారం రెండు విషయాలు అర్ధం అవుతున్నాయి. ఒకటి ప్రభుత్వ డ్రాఫ్టు కోరలు లేనిది. రెండు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన మంత్రిలను లోక్ పాల్ పరిధిలోకి తేవాలని అన్నా బృందం కోరుతుండగా ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోంది. ప్రధానిని లోక్ పాల్ పరిధిలోకి తేవడం వలన రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇవి తప్ప చాలా మందికి ఇతర విషయాలు పెద్దగా తెలియవు.
అన్నా వెనుక ర్యాలీ అవుతున్న జనాన్ని పత్రికల వారు ప్రశ్నలు అడిగి వాళ్ళలో ఎవరికీ ప్రభుత్వం, హజారే ల మధ్య లోక్ పాల్ విషయంలో ఉన్న తేడాలేవీ తెలియవని రాస్తున్నారు. కాని ప్రజలు ప్రధానంగా అవినీతికి వ్యతిరేకంగానే అన్నా వెనుక సమకూరుతున్నారన్న విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. అన్నా బృందం అవినీతి వ్యతిరేక చట్టం గట్టిగా ఉండాలని చెబుతుంటే ప్రభుత్వం కోరలు లేని బిల్లు తెచ్చింది అన్న ప్రధాన అవగాహనతో ఉన్నారు. ఈ అవగాహన ఒక్కటి చాలు హజారే కు మద్దతు ఇవ్వడానికి. అసలు విషయానికి వస్తే….
1. ప్రధాన మంత్రిని లోక్‌పాల్ విచారణ పరిధిలోకి తేవాలని అన్నా బృందం డిమాండ్ చేస్తుండగా, పౌర సమాజ నాయకులు ప్రధానిని అవమానిస్తున్నారని భావిస్తున్నారు.
తమ విధానాల ద్వారా ప్రజల ఆర్ధిక స్ధాయిలను మెరుగుపరిచి అన్ని రంగాలలోనూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండడం ద్వారా ప్రధానికి గానీ ప్రభుత్వానికి గానీ గౌరవం రావాలి. అలా కాక వందిమాగధులంతా కలిసి ప్రధాని మన్మోహన్ సచ్ఛీలుడు, నిష్కళంకుడు అంటూ ఒకటే పనిగా సర్టిఫికెట్లు ఇచ్చేసుకుని అలాంటి ప్రధానికి అవమానం జరిగిందనడం మోసపూరిత వాదన. లక్షా డెబ్భై ఆరు వేల కోట్ల అవినీతి జరుగుతుంటే తెలిసి కూడా చూసీ చూడనట్లు ఊరుకోవడం సచ్ఛీలత ఎలా అవుతుందో ఈ మంత్రులు ప్రజలకి వివరించవలసి ఉంది. ప్రధానిగా తన విధులు నిర్వర్తించకుండా ప్రభుత్వం పడిపోతుందేమో అని భయపడి భాగస్వామ్య పార్టీల నాయకుల అవినీతికి ఓ.కే చెప్పడం నిష్కళంకత్వం కాదని మంత్రులు తెలుసుకోవలసి ఉంది.
2. సుప్రీం కోర్టు జడ్జిలతో సహా ఉన్నత స్ధాయి న్యాయ వ్యవస్ధ అధికారులను విచారించే అధికారం లోక్ పాల్ కి ఉండాలని అన్నా బృందం వాదిస్తుండగా ప్రభుత్వం న్యాయ వ్యవస్ధను తన డ్రాఫ్టు నుండి మినహాయించింది. ఐతే, న్యాయ వ్యవస్ధలోని ఉన్నతాధికారులను విచారించేందుకు సరైన అధికారాలను లోక్ పాల్ కి ఇచ్చినట్లయితే ఛీఫ్ జస్టిస్ ను లోక్‌పాల్ పరిధిలోకి తేవడానికి తాము పట్టుదలకు పోమని అన్నా బృందం తెలిపినట్లుగా ది హిందూ పత్రిక రెండ్రోజుల క్రితం రాసింది.
3. పార్లమెంటులో సభ్యుల ప్రవర్తన, పార్లమెంటరీ కమిటీలలో సభ్యుల పనితీరు లను లోక్‌పాల్ పరిధిలో ఉంచడానికి ప్రభుత్వం తిరస్కరించింది. పార్లమెంటు సభ్యులకు ఇచ్చిన ఈ అవకాశం చట్టం స్ఫూర్తికే వ్యతిరేకమని అన్నా బృందం గట్టిగా తెలిపింది.
పార్లమెంటులో సభ్యుల వ్యవహారం, పార్లమెంటు కమిటీలలో వారి తీరు లను లోక్ పాల్ పరిధినుండి మినహాయించడం అంటే ప్రభుత్వం దొడ్డి దారిన అవినీతిపరులు తప్పించుకోవడానికీ, అవినీతికి పాల్పడడానికీ అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నదని భావించవచ్చు. ప్రతి వ్యవహారాన్నీ పార్లమెంటులోనో, పార్లమెంటు కమిటీల్లోనో చర్చించడం ద్వారా లోక్‌పాల్ పరిధిలోకి రాకుండా మంత్రులు, ఎం.పిలు తప్పించుకోగలుగుతారు.
4. జాయింట్ సెక్రటరీ, ఆ పై అధికారులను మాత్రమే లోక్‌పాల్ విచారిస్తుందని ప్రభుత్వ డ్రాఫ్టు తెలుపుతోంది. అన్నా బృందం మొత్తం బ్యూరోక్రసీని లోక్ పాల్ విచారణ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తోంది.
ప్రతిరోజూ ఏ పని చేయాలన్నా చేయిచాచే ఉద్యోగులపై ఎక్కడ ఫిర్యాదు చేయాలని అన్నా హజారే ప్రశ్నిస్తున్నాడు. ఈ అంశం గురించిన పూర్తి వివరణ ఇంకా చూడాల్సి ఉంది. దిగువ స్ధాయి గుమస్తా వరకూ లోక్‌పాల్ పరిధిలోకి తేవాలని అన్నా బృందం చెబుతున్నట్లుగా కొన్ని పత్రికలు రాశాయి. లోక్‌పాల్ అనేది ఉన్నత స్ధానాల్లోని అవినీతిపై ఏర్పాటు చేయనున్న అధికార వ్యవస్ధ అని భావిస్తుండగా, గుమాస్తాలు ఎందుకు లోక్ పాల్ పరిధిలోనికి తేవలసి వచ్చిందో అర్ధం కాని విషయం. రాష్ట్ర స్ధాయి బ్యూరోక్రసీ లోకాయుక్త కిందికీ, కేంద్రం పరిధిలోని బ్యూరోక్రసీ లోక్‌పాల్ పరిధిలోనికి రావాలని అన్నా బృందం డిమాండ్ చేస్తున్నదేమో తెలియదు. అదలు బ్యూరోక్రసీ లోకి గుమాస్తాలు ఎందుకు వస్తారు? వారి అవినీతి కట్టడికి ఎ.సి.బి ఉంది కదా! ఈ ప్రశ్నలకు జవాబు తెలియవలసి ఉంది.
5. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా (సి.బి.ఐ), సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సి.వి.సి) లను లోక్ పాల్ లో విలీనం చేయాలని అన్నా బృందం చెబుతుండగా ప్రభుత్వం నిరాకరించింది.
సి.బి.ఐ, సి.వి.సి లను అలాగే కొనసాగనిస్తే వచ్చే నష్టం ఏమిటి? సి.బి.ఐ, సి.వి.సి లకు సరైన అధికారాలు లేవు గనక అవినీతి పరులు ఆ రెండిండి చేత విచారణ జరిపించుకుని బైటపడాలని ప్రయత్నిస్తారనా? ఈ అంశం కూడా వివరణ లభ్యం కావడం లేదు.
6. అవినీతి అధికారులను ఏ శిక్ష విధించాలన్న అంశంపై విభేధాలున్నాయి. అన్నా బృందం యావజ్జీవ కారాగార శిక్ష విధించాలనీ, ప్రభుత్వం గరిష్టం పది సంవత్సరాలు చాలనీ వాదించుకుంటున్నారు. ఇది పెద్ద విభేదం కాకపోవచ్చు.
7. పౌర సమాజ కార్యకర్తలు లోక్‌పాల్ నియామకం రాష్ట్రాల స్ధాయిలో జరగాలని కోరుతుండగా, ప్రభుత్వం అందుకు నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వం లోని వివిధ అంగాలలోని ఉన్నతాధికారులు లోక్‌పాల్ ని నియమిస్తారని తన డ్రాఫ్టులో పేర్కొంది. అంటే లోక్‌పాల్ నియామకం మళ్ళీ అవినీతి పరుల చేతుల్లోకే వెళ్తుందనేది అన్నా బృందం అభ్యంతరం కావచ్చు.
ఇవి ప్రధాన విభేధాలు. ఈ అంశాలపై పూర్తి వివరణ లభించలేదు. పాఠకులు ఎవరైనా తెలిసినవారు పై అంశాలపై మరిన్ని వివరాలను తెలియజేసి ఇతర పాఠకులకు అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి.

There is a nice powerpoint document in kiranbedi.com which compares both the lokpal bills.
ఫాంట్ సైజు చాలా చిన్నగా ఉండడం వల్ల మీ బ్లాగు చదవడం చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని కొంచెం పెంచండి.
ఓబుల్ రెడ్డి గారూ, ఈ ధీమ్‌కి ఫాంట్ సైజు పెంచే సౌకర్యం వర్డ్ ప్రెస్ వారు ఇవ్వలేదు. కంట్రోల్ ప్లస్ క్లిక్ చేస్తే సైజు పెరుగుతుంది. అలా ప్రయత్నించండి.