నేనున్నా లేకున్నా ఈ జ్యోతిని ఆరనివ్వకండి -తీహార్ వద్ద అన్నా


“నేనిక్కడ ఉన్నా లేకున్నా మండుతున్న ఈ జ్యోతిని మాత్రం ఆర్పకండి. భారత దేశం అవినీతి బంధనాలను తెంచుకునేవరకూ ఈ జ్యోతి మండుతూనే ఉండాలి” తీహార్ జైలునుండి బైటికి వచ్చిన అనంతరం తనను చూడడానికి, ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చిన వేలమంది మద్దతుదారులను చూసి, ఉద్వేగభరితుడైన అన్నా హజారే అన్న మాటలివి.

ఇంతకుమున్నెన్నడూ లేని రీతిలో ప్రజానీకం అన్నా హజారేను జైలునుండి వెలుపలికీ ఆహ్వానించడానికి పెద్ద సంఖ్యలో హాజరైనారు. మూడు రోజుల పాటు జైలులో గడిపిన హజారే, శక్తివంతమైన లోక్ పాల్ బిల్లుని తేవాలన్న డిమాండ్ నుండి వెనక్కి తగ్గలేదు. జైలులో ఉన్నన్ని రోజులు నిరాహార దీక్ష కొనసాగించిన అన్నా, తన దీక్షను రాం లీలా మైదాన్ వద్ద కొనసాగించనున్నారు.

తనను కలుసుకోవడానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రజల్ని చూసి అన్నా హజారే కదిలిపోయాడు. ఉద్వేగ భరితుడైనాడు. సమూహం శబ్దాల్ని అధిగమిస్తూ గొంతెత్తి నినదిస్తూ కొద్ది సేపు ప్రసంగించాడు. “స్వాతంత్ర్యం వచ్చిందంటున్న గత 64 సంవత్సరాలలో నిజానికి స్వతంత్రం రాలేదు” అని చెబుతూ అన్నా హాజారే, స్వాతంత్ర్య పోరాటం ఇప్పుడే మొదలైందని ప్రకటించాడు. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ తీహార్ వద్దకు చేరుకోవాలన్న ప్రజల స్ఫూర్తి ఏ మాత్రం తగ్గలేదు. తీహార్ గేటు నుండి లాల్ బట్టి చౌక్, మాయాపురి వరకూ వీధి మొత్తం నిండిపోయారని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.

అన్నా హాజరేతో పాటు ఆయన మిత్రులు కొందరు జైలు నుండి మాయాపురి వరకూ టాప్ లేని వాహనంలో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అక్కడి నుండి అన్నా ప్రవేటు కారులో రాజ్‌ఘాట్ కి వెళ్ళారు. రాంలీలా మైదానంలో వివరంగా మాట్లాడతానని అన్నా చెప్పి రాజ్ ఘాట్ కి వెళ్ళాడు.

జైలులో ఉండగా తనకు మద్దతుగా వచ్చిన ప్రజలకు అన్నా కృతజ్ఞతలు తెలిపాడు. “ఒక పద్ధతిని కొనసాగిద్దాం. శాంతిగా ఉందాం. ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగనీయకండి” అని అన్నా ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. రాంలీలా మైదాన్ వద్ద గుమిగూడిన ప్రజలను కిరణ్ బేడీ ఆహ్వానిస్తున్నారు.

50,000 మంది సామర్ద్యం గల రాంలీలా మైదాన్ లో దీక్షకు ఏర్పాట్లు ఇంకా కొనసాగుతున్నాయి. మునిసిపల్ కార్పొరేషన్ కి చెందిన అనేక ట్రక్కులు మైదాన్ ను చదును చేస్తూ, శుభ్రపరుస్తున్నాయి. పౌర సమాజ నాయకుల డిమాండ్లు నెరవేరేవరకూ దీక్ష కొనసాగుతుందని కేజ్రీవాల్ పత్రికలకు తెలిపాడు.

వ్యాఖ్యానించండి