ఈ వారంలో భారిగా నష్టపోయిన షేర్ మార్కెట్లు


ఈ శుక్రవారంతో ముగిసిన వారంలో భారత షేర్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా, యూరప్ ల రుణ సంక్షోభాలు నష్టాలకు ప్రధాన కారణంగా నిలిచాయి. అమెరికా, యూరప్ ల ఆర్ధిక వృద్ధిపై అనుమానాలు తీవ్రం అయ్యాయి. సోమవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజు మార్కెట్లకు సెలవు.

మంగళవారం ప్రారంభమయిన షేర్ మార్కెట్లలో బి.ఎస్.ఇ సెన్సెక్స్ 17055.99 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఈ రోజు శుక్రవారంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి 16141.67 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అంటే ఒక్క వారంలోనే సెన్సెక్స్ 914.26 పాయింట్లు కోల్పోయిందన్న మాట. ఇది 5.36 శాతం పతనానికి సమానం.

నేషనల్ స్టాక్ ఎక్ఛేంజి కూడా ఇదే స్ధాయిలో పతనమైంది. ఈ వారంలో మంగళవారం మార్కెట్లు తెరుచుకున్నపుడు 5125.75 పాయింట్ల వద్ద ఎన్.ఎస్.ఇ నిఫ్టీ సూచి ప్రారంభమయ్యింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 4845.65 వద్ద క్లోజయ్యింది. అంటే ఒక్క వారంలో 280.10 పాయింట్లు నష్ట పోయింది. ఇది 5.46 శాతం తగ్గుదలకు సమానం.

సెన్సెక్స్ సూచి 16000 మానసిక స్ధాయి కంటే తక్కువకి పడిపోగా, నిఫ్టీ సూచి 5000 పాయింట్ల మానసిక స్ధాయి కంటె అధికంగానే పడిపోయింది. ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు కొనుగోళ్లను పెంచే ఉత్ప్రేరకాన్ని అందించే వార్తాలేవీ లేకపోవడంతో షేర్ల పతనం కొనసాగుతోంది.

భారత ప్రభుత్వం మళ్ళీ సంస్కరణలకు సంబంధించిన ఏదో ఒక చట్టాన్ని తెచ్చినట్లయితే షేర్ మార్కెట్లు కొంత కోలుకునే అవకాశం ఉంది. అయితే అది తాత్కాలికమే. దేశ ఆర్ధిక వ్యవస్ధలోని వనరులన్నింటినీ విదేశీ కంపెనీల పరం చేస్తున్నపుడు శాశ్వతమైన ఆర్ధిక వృద్ధి అసాధ్యంగానే చెప్పుకోవాలి.

వ్యాఖ్యానించండి