హజారేకు అమెరికా మద్దతు వెనక ఆంతర్యం ఏమిటి? కాంగ్రెస్ అనుమానం


బుధవారం కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమైన ప్రశ్నను సంధించింది. అన్నా హజారే శాంతియుత నిరసన దీక్ష పట్ల భారత ప్రభుత్వం తగువిధంగా ప్రజాస్వామ్యబద్ధమైన సంయమనం పాటిస్తుందని ఆశిస్తున్నామని కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. అమెరికా తన వొంటి నలుపుని పక్కనబెట్టి నలుపు మచ్చల్ని వెతకడానికి ప్రయత్నించడం మామూలు విషయం. ప్రపంచ దేశాల్లో తన రాయబార కార్యాలయాల్ని గూఢచర్యానికి కేంద్రాలుగా మార్చిన వైనాన్ని బైటపెట్టిన అమెరికా సైనికుడు బ్రాడ్లీ మేనింగ్ ని చీకటి కొట్టంలో పడేసి చిత్ర హింసలు పెట్టినా తప్పు అనిపించదు. దేశాల పైన బాంబుల వర్షం కురిపిస్తూ లక్షల మందిని చంపుతూ కూడా ఏం జరగనట్లు ఇతర దేశాలపైన మానవ హక్కుల రికార్డులను తయారు చేసే గురివింద, అమెరికా.

కాంగ్రెస్ ప్రతినిధి రషీద్ ఆల్వి, రోజువారీ ఎ.ఐ.సి.సి వివరాలతో విలేఖరులతో మాట్లాడుతూ ఈ అంశాన్ని లేవనెత్తాడు. “భారత దేశానికి స్వతంత్రం వచ్చినప్పటినుండీ భారత దేశంలో ఏ ఉద్యమానికీ అమెరికా మద్దతు తెలపలేదు. అన్నా హజారే ఉద్యమాన్ని అనుమతించాలని అమెరికా అంటోంది. ఆయన ఉద్యమానికి ఆటంకాలు ఉండకూడదని కోరుతోంది. అమెరికాకి ఈ ప్రకటన ఇవ్వవలసిన అవసరం ఏముంది? ఈ ఉద్యమానికి మద్దతు ఏ శక్తయినా మద్దతు ఇస్తున్నదా, ప్రభుత్వాన్నే కాకుండా దేశాన్ని కూడా అస్ధిరం పాలు చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ శక్తి ఎవరో కనుగునే విషయాన్ని పరిగణించాలి. అమెరికా ప్రకటనను తీవ్రంగా తీసుకోవలసిన అవసరం ఉంది” అని రషీద్ అల్వీ అన్నాడు.

రషీద్ అల్వీ సంధిస్తున్న ప్రశ్నలు పార్టీ తరపున వేస్తున్నవేనా అనీ, పార్టీ తరపునే ఈ విషయాలను అడుగుతున్నారా అని ప్రశ్నించిన విలేఖరులకు రషీద్ అవుననే సమాధానం ఇచ్చాడు. “నేను చెప్పినదంతా మా పార్టీ తరపునే చెప్పాను” అని రషీద్ సమాధానం ఇచ్చాడు. హజారే ఉద్యమం వెనుక అమెరికా హస్తముందంటూ సూచిస్తున్న కాంగ్రెస్ అనుమానాలపైన పార్టీ ప్రాధమిక విచారణ ఏమన్నా జరిగిందా అన్న ప్రశ్నకు ఆయన “ప్రభుత్వం ఆ విషయంలో దర్యాప్తు జరిపి నిజాన్ని బైటపెట్టాలి” అని సమాధానం ఇచ్చాడు.

రషీద్ ఆల్వి వెల్లడించిన అనుమానాలు ఆధారరహితమేమీ కాదు. అమెరికాకి ఇటువంటి పనులకు కొత్త కూడా కాదు. లిబియా, సిరియాల్లో తిరుగుబాట్లను ఎగదోసిన అమెరికా బహ్రెయిన్, యెమెన్ లలో ప్రజల్ని ఊచకోత కోస్తున్నా చూడనట్లు నటిస్తుంది. అమెరికా ఇంతవరకూ భారత దేశంలో ఉద్యమాలకు సంబంధించి వాటికి మద్దతుగానో, వ్యతిరేకిస్తూనో బహిరంగంగా ప్రకటన జారీ చేయడం ఇదే మొదటి సారని చెప్పుకోవచ్చు.

ఆగష్టు 12 తేదీన అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి విక్టోరియా నూలంద్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నా హజారే ఆందోళనపై వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలో ఇండియాకు పరోక్ష హెచ్చరిక లాంటిది జారీ చేసింది కూడా. “మీకు తెలుసు, ప్రపంచవ్యాపితంగా శాంతియుతంగా, అహింసాయుతంగా నిరసన తెలిపే హక్కుకి మేము మద్దతునిస్తాము. అది చెప్పాక, భారత దేశం ప్రజాస్వామిక దేశం. శాంతియుత నిరసనలతో వ్యవహరించే పద్దతుల విషయంలో సరైన ప్రజాస్వామిక సంయమనం భారత ప్రభుత్వం పాటిస్తుందని మేము భావిస్తున్నాము” అని ప్రకటించింది.

అమెరికాకి ఇది అనవసరం. ముందు అది ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్, లిబియా లనుండి సైన్యాన్ని ఉపసంహరించి తన దేశం సంగతి చూసుకోవాల్సి ఉండగా ఇండియా అంతర్గత విషయాల్లోకి జొరబడడం  క్షం తవ్యం కాదు. తన జోక్యం మానుకొమ్మని గట్టిగా హెచ్చరించాల్సిన అవసరం ఉంది. మన్మోహన్ నేతృత్వం లోని యు.పి.ఎ ప్రభుత్వంతో పాటు, బి.జె.పి నేతృత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం కూడా అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్ పైన దురాక్రమణ చెయ్యడాన్ని సమర్ధించాయి. అమెరికా మాటవిని ఇరాన్ నుండి పాక్ మీదుగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించే బృహత్తరమైన పధకాన్ని ఇండియా అటకెక్కించింది. ఇరాన్ తో శతృత్వం దాదాపుగా కొనితెచ్చుకుంది. పాలస్తీనా పోరాటానికి మద్దతు ఇవ్వడం మాని ఇజ్రాయెల్ తో స్నేహ హస్తాల్ని చాచింది. వాటన్నింటికీ మద్దతు ఇచ్చిన ఇండియా ఇప్పుడు ఇండియా వ్యవహారాల్లోకే జొరబడుతున్న అమెరికాని నిలవరించగలదా? నిలువరించే ఉద్దేశ్యం ఉన్నాదా?

పశ్చిమ బహుళజాతి కంపెనీలకి అవసరమైన సంస్కరణ విధానాలను అమలు చేయడంలో యు.పి.ఎ-2 ప్రభుత్వం వెనకబడింది. బ్యాంకుల పూర్తి ప్రవేటీకరణ, ఇన్సూరెన్సు రంగంలో విదేశీ కంపెనీల వాటాని పెంచడం, రిటైల్ సరుకుల అమ్మకాల రంగాన్ని ప్రవేటీకరించడం, త్వరితగతిన విదేశీ కంపెనీల భారత కొనుగోళ్లను అమోదించడం… ఇవన్నీ ఈ పాటికే ప్రభుత్వం చేయవలసి ఉంది. కాని యు.పి.ఎ ప్రభుత్వం చుట్టూ ముసురుకున్న కుంభకోణాలు, వివిధ సెక్షన్లప ప్రజల ఆందోళనలు వలన ఊపిరాడని పరిస్ధితిలో ఉంది. లెక్క ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రవేటీకరణకీ, విదేశీ కంపెనీల ప్రవేశానికి వ్యతిరేకంగా తలెత్తే ఉద్యమాలన్నింటినీ అణిచివేయాలి. కాంగ్రెస్ అలా చేయకుండా ఓట్ల కోసం వివిధ రాష్ట్రాల ఎన్నికల కోసం నిర్భందం అమలు చేయలేక పోతున్నది. సంస్కరణల చట్టాలను త్వరితంగా చేయలేకపోతున్నది.

ఇవన్నీ పశ్చిమ దేశాలకు కంటగింపుగా ఉంది. అసహనంగా కూడా ఉంది. అక్కడ అమెరికా, యూరప్ లేమో రుణ సంక్షోభం లో ఉన్నాయి. అమెరికా, యూరప్ ల సామ్రాజ్యవాద కంపెనీలు సంక్షోభం నుండి బైటికి రావడానికి అక్కడ ఉన్న కార్మికులు, ఉద్యోగులు తదితర శ్రామికులపై పొదుపు విధానాలు రుద్దుతూ ఆర్ధిక దాడులు చేస్తున్నాయి. అది చాలక అమెరికా, యూరప్ ల కంపెనీలు మూడో ప్రపంచ దేశాల వనరులను దోచుకుంటూ, అక్కడ మార్కెట్లని వశం చేసుకుంటూ తమ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని భావిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే భారత దేశంలో సంస్కరణలు వెనకపట్టుపట్టడం పట్ల అసహనంగా ఉన్నాయి.

అన్నా హజారేకి మద్దతుగా దేశ వ్యాపితంగా అర్బన్ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ నిరసనల్లో ఒక సామ్యం కనిపిస్తోంది అన్ని చోట్లా. నిరసనకారులు ప్రధానంగా “భారత్ మాతాకి జై” అని “వందే మాతరం” అనీ నినాదాలు ఇస్తున్నారు తప్ప అవినీతి వ్యతిరేక నినాదాలు తక్కువగా వినబడుతున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో ఒక్క అన్నా హజారేను మాత్రమే ఛాంపియన్ గా ముందుకు తెచ్చే ధోరణి కనిపిస్తోంది. ప్రజా ఉద్యమాలు ఎప్పుడయినా సమస్యలను ఎత్తి చూపించాలి తప్ప వ్యక్తులను కాదు. ప్రభుత్వం, అన్నా హజారే బృందం మధ్య జరుగుతున్న చర్చలలో ఏమి మాట్లాడుకుంటున్నదీ ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చాలా తక్కువగా కనిపిస్తోంది.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు. జాగ్రత్తగా పరిశీలించవలసిన అంశాలు. అమెరికా, ప్రభుత్వం స్దాయిలో, భారతదేశంలోని ఒకానొక ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అనేది తేలికగా తీసుకోవలసిన విషయమైతే కాదు. ఏ ప్రయోజనమూ లేకుండా అమెరికా ఒక్క మాటా అనదు, ఒక్క అడుగూ వెయ్యదు. భారత దేశంలోని సామ్రాజ్యవాద వ్యతిరేక సెక్షన్లు ఖచ్చితంగా పరిశీలించవలసిన అంశం ఇది.

వ్యాఖ్యానించండి