నిరవధిక నిరాహార దీక్ష కాదు, ఆరోగ్యం అనుమతించేవరకే


జన్ లోక్ పాల్ బిల్లు ను పార్లమెంటు ముందుకు తేవాలంటూ అన్నా హజారే తలపెట్టిన దీక్ష “నిరవధిక నిరాహార దీక్ష కాదనీ, అన్నా ఆరోగ్యం అనుమతించే వరకే” ననీ పౌర సమాజ కార్యకర్తలు ఢిల్లీ పోలీసులకు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ “నిరవధిక నిరాహార దీక్ష” (ఆమరణ నిరాహార దీక్ష కాదు) అని ప్రకటిస్తూ వచ్చిన అన్నా బృందం తమ నిర్ణయాన్ని మార్చుకున్నారా లేక మొదటినుండీ అదే ఉద్దేశ్యమా అన్నది తెలియరాలేదు.

అన్నా హజారే బృందం, ఢిల్లీ పోలీసుల మధ్య అంతిమ ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. దాని ప్రకారం సెప్టెంబరు 2 వరకూ (రెండు వారాలు) అన్నా హజారే దీక్ష కొనసాగడానికి అనుమతి లభించింది. అది కూడా అన్నా హజారే ఆరోగ్యం అనుమతించేవరకూ మాత్రమే దీక్ష కొనసాగుతుంది. రోజుకి మూడు సార్లు హజారే ఆరోగ్య పరిస్ధితిని సమీక్షిస్తారు. ఒప్పందంలో భాగంగా జె.పి.పార్కుకి బదులు మరింత విశాలమైన రాం లీలా మైదాన్ ను దీక్షకు పోలీసులు కేటాయించారు. రాం లీలా మైదాన్ ను దీక్షకు అనువుగా తయారు చేసే పని కొనసాగుతోంది.

రాంలీలా మైదాన్ సామర్ధ్యం 25,000 మంది. ఒప్పందం ప్రకారం దీక్షా సమయంలో హాజరయ్యేవారు అంతకు మించి ఉండ కూడదు. అన్నా హజారే ఆరోగ్యం పర్యవేక్షిస్తున్న డాక్టర్ నరేష్ త్రెహాన్, అన్నాకు వైద్య సేవలు అవసరమని భావించిన మరుక్షణమే ఆయనకి వైద్య సేవలు అందుతాయని కిరణ్ బేడీ తెలిపారు. జన్ లోక్ పాల్ ను పార్లమెంటు పరిగణించడానికైనా తీసుకెళ్ళాలని పౌరసమాజ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం, న్యాయవ్యవస్ధను బాధ్యురాలిని చేసే మంచి లోక్ పాల్ బిల్లుని ప్రతిపాదించినట్లయితే ఉన్నత స్ధాయి న్యాయ వ్యవస్ధను లోక్ పాల్ పరిధిలోకి తేవాలని తాము పట్టుపట్టబోమని పౌర సమాజ నాయకులు సూచించారని ‘ది హిందూ’ ప్రకటించింది.

దీక్షకు ఇచ్చిన అనుమతి షరతులతో కూడినదనీ, దీక్ష సెప్టెంబరు 2 వరకేననీ హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్.కె.సింగ్ పత్రికలకు తెలిపాడు. ఒప్పందం ఎవరికీ గెలుపు కానీ, ఓటమి కానీ కాదని ఆయన అన్నాడు. అన్నా బృందం పోలీసులకు రెండు పేజీల అండర్ టేకింగ్ ఇచ్చిందని ది హిందూ తెలిపింది. అండర్ టేకింగ్ పై అన్నా హజారే, కిరణ్ బేడి, శాంతి భూషణ్, ప్రశాంతి భూషణ్, అరవింద్ కేజ్రీవాల్ లు సంతకం చేశారు. వీరు షరతులు ఉల్లంఘిస్తే చట్టం ప్రకారం శిక్షార్హులవుతారు.

అండర్ టేకింగ్ ప్రకారం ప్రజల హాజరు మైదాన్ సామర్ధ్యానికి మించదు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగదు. సమీప రోడ్లమీదికి జనం గుమికూడడానికి వీల్లేదు. ట్రాఫిక్ పోలీసులతో నిరసనకారులు సహకరించాలి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మైక్రోఫోన్ ను రాత్రి పది గంటలవరకే వినియోగిస్తారు. తాగునీరు వసతి, వైద్య సహాయం, మొబైల్ టాయిలెట్లు, సరైన వెలుతురు తదితర సౌకర్యలు కల్పించాలి. కర్రలను గానీ మరే ఇతర ఆయుధాలను గానీ ధరించకూడరు. రెచ్చగొట్టే నినాదాలూ, ఉపన్యాసాలు ఇవ్వ కూడదు. మత, పార్ధనా స్ధలాలకు 200 మీటర్ల పరిధిలో రెచ్చగొట్టే నినాదాలు ఇవ్వరాదు. టపాసులు పేల్చరాదు.

ఈ ఒప్పందంతో దీక్ష, పోలీసులకు గానీ, ప్రభుత్వానికి గానీ ఇబ్బంది కలిగించదని అర్ధం చేసుకోవచ్చు. పరిమితులకు లోబడి జరిగే దీక్ష అంతం ముందే తెలిసినపుడు ప్రభుత్వం అన్నా డిమాండ్లకు ఎలా తలొగ్గుతుందో వేచి చూడవలసిందే. దీక్షకు మద్దతుగా హజరయ్యే జనం, అన్నా బృందం అంగీకరించిన షరతులను అతిక్రమించేదిగా ఉన్నపుడే దీక్షకు తగిన ఫలితం వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.

వ్యాఖ్యానించండి