ఇన్ని ప్రతిబంధకాల మధ్య చైనా వార్తా వెబ్ సైట్ ల ద్వారా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంపై కొన్ని చర్చలు జరుగుతున్నాయి. చైనాలో మైక్రో బ్లాగర్లు హజారే ఉద్యమాన్ని ప్రశంసిస్తూ వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించి వేలమందిని వీధుల్లోకి తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హజారే ఉద్యమాన్ని చైనా పరిస్ధుతులతో బేరీజు వేసుకున్నారు. చైనాలో అవినీతి పెచ్చరిల్లి ప్రజాగ్రహం విస్తృతంగా ఉన్నప్పటికీ నిరసన తెలిపే హక్కులపై ప్రభుత్వం పరిమితి విధిస్తుంది.
“కైజింగ్” అనే లిబరల్ పత్రిక హజారేను “నూతన గాంధీ”గా అభివర్ణించింది. ఆంగ్లంలో ట్విట్టర్ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ వలెనే చైనాలో “సినా వీబో” అనే వెబ్ సైట్ ఉంది. అందులో “కైజింగ్” పత్రిక తన కామెంట్ పోస్ట్ చేసింది. “కైజింగ్” ను 14 కోట్లమంది వినియోగిస్తున్నారని అంచనా. “ఇండియా కంటే చైనాలో ఎక్కువ అవినీతి ఉంది. కాని మనం నిరసనల్ని ఎప్పుడు పొందగలం?” అని ఒక మైక్రోబ్లాగర్ రాసుకున్నట్లుగా ‘ది హిందూ’ తెలిపింది. మరొక వ్యక్తి “చైనాలో కూడా ఓ గాంధీ పుట్టాలి” అని రాసుకున్నాడు.
చైనాలో అవినీతిపై ప్రజలలో ఆగ్రహం బాగా వ్యాపించి ఉంది. ఇటీవల చైనాలో జరిగిన హై-స్పీడ్ రైలు ప్రమాదం అవినీతిని ఎత్తి చూపింది. ఈ ప్రమాదం అనంతరం రైల్వే మంత్రి లియు ఝిజూన్ రాజీనామా చేయవలసి వచ్చింది. ప్రమాదం గురించిన వివరాలు బైటికి పొక్కకుండా చైనా జాగ్రత్తలు తీసుకుందని పశ్చిమ దేశాల పత్రికలు ఘోషించాయి. ఒక అధికారి $2.8 బిలియన్లను విదేశాలకు తరలించాడని వెల్లడి కావడంతో అక్కడ అవినీతిపై చర్చ జరుగుతోంది. మధ్య తరగతి ప్రజానీకంలో అవినీతిపై ఆగ్రహం పెల్లుబుకుతోంది.
స్ధానిక పభుత్వాలు, కింది స్ధాయి అధికారులు అవినీతికి పాల్పడినప్పుడు చైనా వార్తా పత్రికలు పెద్ద ఎత్తున వార్తలను రాసినా, ఉన్నత స్దాయిల్లోని అవినీతిపై నిశ్శబ్దం పాటిస్తాయి. వాటికా అనుమతి లేకపోవడమే అందుకు కారణం. ఇండియాలో ఉన్న పరిమిత నిరసన హక్కును కూడా చైనీయులు ప్రశంసిస్తుండగా, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పత్రికలు మాత్రం నిరసనలవలన తలెత్తే రాజకీయ అస్ధిరత పై దృష్టిని కేంద్రీకరించాయి. హజారే ఉద్యమం వెనుక అమెరికా హస్తముందన్న కాంగ్రెస్ ఆరోపణలను కూడా తమకు అనుకూలంగా వినియోగించాయి.
చైనా ఆంగ్ల పత్రిక “గ్లోపల్ టైమ్స్” ఎడిటర్ హు క్సిజిన్ హజారే ఉద్యమాన్ని “భారత దేశ అరబ్ ఉద్యమం” గా అభివర్ణించిన రాయిటర్స్ కధనాన్ని ఉటంకిస్తూ, నిస్పృహలో ఉన మధ్యతరగతి వర్గం, సామాజిక మీడియా, పత్రికా స్వేచ్ఛ లు భారత దేశంలో నిరసనలకు కారణమని అభిప్రాయం వ్యక్తం చేశాడు. “ఇరు దేశాల్లోనూ అవినీతి పెద్ద సమస్యే. అయితే ఇండియాలో లంచం అడగడానికి మొహమాటం ఉండదు. మొఖం మీదే అడిగేస్తారు. ఎంత ఖర్చవుతుందో చెప్పేస్తారు. కాని చైనాలో పరిస్ధితి అంత డైరెక్ట్ గా లేదు. పని పూర్తికావడానికి ఇంకా ఏమి కావాలో ఊహించవలసిందే” అని హు కొద్ది రోజుల క్రితం తన పత్రికలో రాశాడు.
