
అప్ డేట్ (2): యోగా గురు రాందేవ్, ఆర్ట్ ఆఫ్ లిగింగ్ ఫౌండేషన్ శ్రీ శ్రీ రవి శంకర్ లు కూడా తీహార్ జైలు బయట ఉన్న నిరసనకారులతో జత కలిసారు. రవి శంకర్, జైలు లోపలకి వెళ్ళి హజారేని కలిసినట్లు తెలుస్తోంది. అంతకుముందు బాబా రాందేవ్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ని కలిసి హజారే అరెస్టుకి వ్యతిరేకంగా మెమొరాండం ఇచ్చాడు. నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాందేవ్, ప్రజాస్వామ్యం పేరుతో ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించాడు.
అప్ డేట్ (1): అన్నా హజారేతో ప్రభుత్వం రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. జె.పి.పార్క్‌కి బదులు రాంలీలా మైదాన్‌ను దీక్షకు ప్రతి పాదించినట్లు తెలుస్తోంది. రాం లీలా మైదా న్ ఐతే, భద్రతకు అనుగుగా ఉంటుందని భావిస్తున్నట్లుగా న్యూఢిల్లీ టెలివిజన్ తెలిపింది. ప్రభుత్వ ప్రతిపాదనపై అన్నా బృందం స్పందన ఇంకా తెలియ లేదు.
అన్నా హజారేను అరెస్టు చేసి తీహార్ జైలుకి పంపించడంపై దేశవ్యాపితంగా నిరసన వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. అన్నా అరెస్టును పార్లమెంటులో ప్రధాని చేసిన ప్రకటనలో సమర్ధించుకున్నది. అయితే అన్నా దీక్షకు ప్రభుత్వం అనుమతించిందనీ కొద్ది సేపట్లో అన్న విడుదలై జె.పి.పార్కుకి వెళ్ళనున్నారనీ తీహార్ జైలు గేట్ వద్ద ఆందోళన చేస్తున్న కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రఖ్యాత పర్యావరణ ఉద్యమకారిణి మేధా పాట్కర్ తెలిపింది. జైలునుండి బైటికి వచ్చిన అనంతరం అన్నా హజారే జె.పి.పార్కుకి వెళ్తారనీ, అందరూ అందుకు సిద్ధంగా ఉండాలని ఇతర వక్తలు కూడా జైలు గేటు ముందు జరుగుతున్న ఆందోళనను ఉద్దేశిస్తూ చెప్పారు. దీనితో అన్నా హజారే విడుదలపై ఏర్పడిన స్తంభన ముగిసినట్లు భావించవచ్చు.
మంగళవారం ఉదయాన్నే పోలీసులు అన్నా హజారేను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచారు. ఆయనతో పాటు అరవింద్ కేజ్రివాల్, సీనియర్ లాయర్ శాంతి భూషణ్, మొట్టమొదటి మహిళా ఐ.పి.ఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి తదితరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని తీహారు జైలుకి తరలించడంతో దేశవ్యాపితంగా మంగళ వారం, బుధవారాలలో ఆందోళనలు తలెత్తాయి. అన్నా హజారేను దీక్షకు అనుమతించాలని కోరుతూ ప్రజలు ముఖ్యంగా అక్షరాస్యులైన యువకులు ఆందోళనలు చేపట్టారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని యువకులు హజారేని అరెస్టు చేసి తీహార్ జైలులో ఉంచడానికి వ్యతిరేకంగా చురుకుగా ముందుకొచ్చారు. తీహార్ జైలు వద్ద మంగళ వారం రాత్రినుండి పెద్ద ఎత్తున జనం గుమిగూడి అరెస్టుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బుధవారం మధ్యాహ్నం హజారే బైటికి రానున్నాడని ప్రకటించడంతో వారంతా ఎదురు చూస్తున్నారు.
బుధవారం పార్లమెంటులో అన్నా అరెస్టుపై దుమారం చెలరేగింది. ప్రధాని మన్మోహన్ అన్నా అరెస్టుపై ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు కోరారు. ప్రతిపక్షాల కోరికను అనుసరించి, ప్రధాని లోక్ సభలో చేసిన ప్రకటన నిరాశపరిచేదిగా ఉందని బిజెపి నిరసన తెలిపింది. తన ప్రకటనలో ప్రధాని అన్నా హజారే అరెస్టును సమర్ధించుకున్నాడు. మంగళవారం అన్నా విషయంలో ప్రభుత్వం చేసిన పనులన్నింటినీ ఏకరువు పెట్టి అవన్నీ సమర్ధనీయమే అని తెలిపాడు. బిల్లులను చట్టాలుగా మార్చేది ఎవరన్నదే ఇప్పుడు సమస్యగా మారిందని పాత పాట పాడాడు. జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటు ఆమోదించాలని అన్నా మొండి పట్టు పట్టాడని ఆరోపించాడు. అన్నా ఉన్నత విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తే ఐనప్పటికీ అవినీతి పరిష్కారానికి ఆయన ఎన్నుకున్న మార్గం సరికాదని అన్నాడు. అవినీతి ఒక్క ఉదుటన పరిష్కారం కాదన్నాడు.
అయితే ప్రధాని ప్రసంగం పట్ల బి.జె.పి నిరసన తెలిపింది. అవినీతి పరిష్కారానికి మంత్రదండం అవసరం లేదనీ, రాజకీయ చిత్తశుద్ధి ఉంటే చాలనీ బి.జె.పి పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ అన్నారు. హజారే వెనుక ఆర్.ఎస్.ఎస్ మద్దతు ఉన్నదని చెప్పడాన్ని ఎత్తి చూపుతూ, దేశభక్తి ఉన్న ఆర్.ఎస్.ఎస్ హజారే వెనక ఉన్నట్లయితే ఆ పరిస్ధితిని హోమంత్రి ఊహించలేడని వ్యాఖ్యానించిందావిడ. రాజకీయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పోలీసులను వినియోగిస్తున్నదని అరుణ్ జైట్లి రాజ్యసభలో అన్నాడు. అవినీతిని నిర్మూలించమని ప్రజలు కూరుతుంటే అన్నా హజారే అవినితిపరుడంటూ తప్పించుకుంటోందని ఎత్తి చూపింది. హజారే కోసం ఎదురు చూస్తున్నామనీ ఆయన వచ్చాక తామూ జె.పి.పార్కుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని జైట్లీ ప్రకటించాడు.
అన్నా హజారే మద్దతుదారులు అనేకులు ఛత్రాశాల్ స్టేడియం వద్ద కూడా గుమికూడారు అన్నా మద్దతుదారులను వందలమందిని మంగళవారం అరెస్టు చేశాక చత్రశాల్ స్టేడియంను తాత్కాలిక జైలుగా పోలీసులు మార్చి అక్కడికి తరలించారు. దానితో ఛత్రశాల్ స్టేడియం వద్ద జనం పెద్ద ఎత్తున గుమికూడి నినాదాలు ఇస్తున్నారు. స్వామి అగ్నివేష్, కిరణ్ బేడి, మేధా పాట్కర్ తదితరులంతా తీహార్ జైలు గేటు వద్ద హజారే రాక కోసం వేచి ఉన్నారు. హజారేను కలవడానికి బుధవారం ఉదయం మేధా పాట్కర్ ప్రయత్నించగా జైలు అధికారులు అందుకు అనుమతించలేదు. కాని ఆ తర్వాత మనసు మార్చుకుని హజారేని చూడడానికి అనుమతించారు. ప్రభుత్వం కనీస హక్కులను కూడా భరించలేకపోతున్నదని చెప్పడానికి ఇది తార్కాణం అని ఆవిడ అన్నారు.
తదుపరి జయ ప్రకాష్ నారాయణ్ పార్క్ లో నిరసన ప్రారంభం అవుతుంది. ఇప్పటికె అనేక కుంభకోణాల్లో ఇరుక్కుని సతమతమవుతున్న కాంగ్రెస్ సర్కారు అన్నా హజారే దీక్షకు ఎలా స్పందిస్తుందో చూడవలసిందే!
