అన్నా హజారే జైలునుండి వెలుపలికి రావడంపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. పోలీసులు విధించిన “అంగీకార యోగ్యం కాని ఆరు షరతులను” ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అన్నా హజారే జైలులోనే కొనసాగుతున్నారు. ఎత్తివేసామని చెపుతున్నట్లుగా పోలీసులు 6 ఎత్తివేయలేదనీ, 5 1/2 (ఐదున్నర) షరతుల్ని మాత్రమే ఎత్తివేశారనీ అన్నా హజారే బృందం ఎత్తి చూపుతోంది. అందువలన హజారే ఈ రాత్రికి జైలులోనే కొనసాగే అవకాశం ఉందని కిరణ్ బేడి, జైలు గేటు దగ్గర ఉన్న మద్దతుదారులకు తెలిపారు.
అన్ని షరతుల్ని ఎత్తివేసినప్పటికీ దీక్ష ఎన్ని రోజులు కొనసాగాలి అన్న విషయంలోనే ప్రతిష్టంభన కొనసాగుతోంది. పోలీసులు తమ మూడు రోజుల షరతును ముందు ఐదు రోజులకు పెంచారు. చెల్లకపోవడంతో ఏడు రోజులకి పెంచారు. ఏడు రోజుల షరతు విధించినప్పటికీ తాము ఏడురోజులకే ముగించాలని పట్టు పట్టబోమనీ, ఆ తర్వాత గడువుని పొడిగిస్తామనీ పోలీసులు హామీ ఇస్తున్నారు. కాని నెల రోజులవరకూ పోలీసులు తమ జోలికి రాకూడదని అన్నా బృందం కోరుతున్నట్లుగా ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.
“ఏడు రోజులకు గడువు పెంచడం, అవి ముగిసాక మళ్లీ పొడిగించడం” అన్న షరతును పౌర సమాజ సభ్యులంతా అంగీకరించారనీ, ఒక్క అరవింద్ కేజ్రీవాల్ మాత్ర్రమే అంగీకరించడం లేదనీ, విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. నిరవధిక నిరాహార దీక్షను నెల రోజుల వరకూ అనుమతించాలని అప్పటివరకూ హజారే పట్టువిడవరాదని అరవింద్ కేజ్రీవాల్ కోరుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
పోలీసులు మూడు రోజుల షరతులతో పాటు దీక్ష కొనసాగించడానికి జె.పి.పార్క్ కంటె పెద్దదయిన రాం లీలా మైదాన్ కి మార్చడానికి అంగీకరించారు. ఈ మైదానంలోనే యోగా గురువు బాబా రాందేవ్ దీక్షను పోలీసులు విజయవంతంగా భగ్నం చేశారు. ఇదే మనసులో మెదులుతున్నదో ఏమో కాని అరవింద్ కేజ్రీవాల్ పట్టుదలతో, అన్నా హజారే బృందం నెల రోజుల వరకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడే ప్రతిష్టంభన కొనసాగుతోంది.

