హజారేతో పాటు నలుగురికి 7 రోజుల జ్యుడీషియల్ కస్టడీ, తీహార్ జైల్లో ఉంచే అవకాశం


anna

అరెస్టు చేసిన తర్వాత హజారేను తీసుకెళ్తున్న పోలీసులు

ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన అన్నా హజారే, ఆయన బృందంలోని సభ్యులైన కిరణ్ బేడీ, అరవింద్ కేజ్రీవాల్, శాంతి భూషన్ లకు ప్రత్యేక మెజిస్టీరియల్ కోర్టు ఏడు రోజుల పాటు జ్యుడిషయల్ కస్టడీ విధించింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జయప్రకాష్ నారాయణ పార్కులో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని అన్నా హజారే ప్రకటించడంతో ఆయనని అరెస్టు చేశామని ఢిల్లీ పొలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అన్నా హజారే వ్యక్తిగత బాండు సమర్పించడం ద్వారా బెయిల్ పొందవచ్చునని కోర్టు షరతు విధించింది. బాండులో కోర్టు కోరిన విధంగా అండర్ టేకింగ్ ఇవ్వడానికి హజారే బృందం నిరాకరించడంతో కోర్టు వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నిరవధిక నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్నందున హజారే బృందాన్ని అరెస్టు చేసినప్పటికీ వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలన్న ఆసక్తి పోలీసులకు లేదని ఢిల్లీ పొలీస్ కమిషనర్ బి.కె.గుప్తా అన్నాడు.

వ్యక్తిగత బాండు సమర్పణతో బెయిల్ పై విడుదల కావాలంటే 144 సెక్షన్ ప్రకారం ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది సమావేశం కాబోమనీ, అతని మద్దతుదారులను కూడా అలా సమావేశం కాకుండా కోరాలనీ’ అన్నా హజారే అండర్ టేకింగ్ ఇస్తే పోలీసులు ఆయన విడుదలకి సమ్మతి తెలిపేవారని గుప్తా తెలిపాడు. అయితే అన్నా హజారేతో పాటు ఆయన తోటి కార్యకర్తలు అండర్ టేకింగ్ ఇవ్వడానికి నిరాకరించడంతో మెజిస్ట్రేట్, నలుగురినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపాడు.

అన్నా హజారే, సమాచార హక్కు కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ లాయర్ శాంతిభూషణ్, మాజీ ఐ.పి.ఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి లు అరెస్టయినవారిలో ఉన్నారు.

వ్యాఖ్యానించండి