రాహుల్ జోక్యంతో విడుదల ఉత్తర్వులు, విడుదలకు నిరాకరిస్తున్న హజారే


Supporters of Anna gather in front of Teehar Jail

తీహార్ జైలు ముందు అన్నా హజారే కోసం వేచి ఉన్న మద్దతుదారులు. దీక్షపై షరతులు ఎత్తివేస్తేనే జైలునుంచి బైటికి వస్తానని అన్నా అధికారులకు తెలిపాడు.

అన్నా హాజారే అరెస్టు పాలక కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలనే సృష్టించింది. కాంగ్రెస్ పార్టీలో పాత నెహ్రూవియన్ విధానాలకీ, గత రెండు సంవత్సరాలుగా వేళ్ళూనుకున్న నయా ఉదారవాద ఆర్ధిక విధానాల రూపకర్తలకూ మధ్య గల విభేధాలు అన్నా హజారే నిరాహార దీక్ష సందర్భంగా మరొక్కసారి వెల్లడయ్యాయి. అన్నా హజారేని ఉదయాన్నే అరెస్టు చేయించిన చిదంబరం, మన్మోహన్ ల ముఠా తీరా అరెస్టు చేసాక తలెత్తిన వ్యతిరేకతతో డంగైనట్లుగా కనిపిస్తున్నది.

హజారే బృందాన్ని అరెస్టు చేశేవరకూ అనుకున్నట్లు సాగినా వారిని కోర్టులో హాజరుపరిచాక జరిగిన పరిణామాలు, మన్మోహన్, చిదంబరం, కపిల్ సిబాల్ తదితర అవినీతి గుంపు అంచనాకి తగిన విధంగా లేవని వారి మాటల ద్వారా స్పష్టమవుతున్నది. ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచాక హజారే బృందం వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ తీసుకుని విడుదలవుతారని భావించారు. కాని అనూహ్యంగా వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడానికి అన్నా హజారే బృందం తిరస్కరించింది. దానితో పాటు పోలీసులు కూడా కొన్ని షరతులు విధించారు. బైటికి వచ్చాక నలుగురుకంటే ఎక్కువమందిని హజారే తదితర నాయకులు సమకూడనీయరాదనీ, తమ కార్యకర్తలచేత కూడా ఆ నిబంధన అమలు చేయించాలనీ పోలీసులు షరతు విధించారు.

ఈ షరతులు పూర్తిగా అవమానకరంగా ఉన్నాయి. వీటికి నిరాకరించడంతో జడ్జి అనివార్యంగా జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. ఈ మలుపుని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఊహించలేదు. అందుకే “అన్నా హజారే బృందాన్ని తీహారు జైలుకి పంపించాలని మేము కలలో కూడా భావించలేదు” అని కాంగ్రెస్ పెద్దలు అన్నట్లుగా ఎన్.డి.టి.వి టెలివిజన్ తెలిపింది. తీహార్ జైలుకి పంపాక కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ముందుకొచ్చాయి. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిని కలిసి అన్నా అరెస్టు తదనంతర పరిణామాలపట్ల వ్యతిరేకత తెలియజేయడంతో ప్రభుత్వం హజారే బృందాన్ని విడుదల చేయడానికి హుటాహుటిన నిర్ణయం తీసుకుంది.

సాయంత్రం ఆరు, ఏడు గంటల మధ్యలో కిరణ్ బేడి, శాంతి భూషణ్ లతో పాటు అరెస్టయిన ఇతర నాయకులను విడుదల చేశారు. కాని కధ అసలు మలుపు ఇక్కడే తిరిగింది. అన్నా హజారే జైలు నుండి బైటికి రావడానికి నిరాకరించాడు. తన నిరాహార దీక్షపై విధించిన షరతులను పూర్తిగా ఎత్తివేసి, బేషరతుగా తన దీక్షకు అంగీకరిస్తున్నట్లు ప్రకటిస్తేనే తప్ప తాను బైటికి రానని అన్నా చెప్పినట్లుగా కిరణ్ బేడి, శాంతి భాషణ్ లు తెలిపారు. అన్నా హజారే జైలులోనె తన దీక్షను కొనసాగిస్తున్నట్లుగా కూడా వారు తెలిపారు. తీరా బైటికి వచ్చాక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నందుకు మళ్ళి ఒక సారి తన దీక్షను భగ్నం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించవచ్చని కూడా హజారే ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అందులో నిజం ఎంతో స్పష్టం కాలేదు.

మొత్తం మీద ప్రభుత్వానికి హజారే దీక్ష మాత్రమే కాకుండా అరెస్టు కూడా శాంతి భద్రతల సమస్యగా మారినట్లు కనిపిస్తోంది. దీక్ష వలన వేలమంది వస్తారనీ దాని వలన శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని సాకు చూపిన ప్రభుత్వం జైలుకి పంపాక తీహార్ జైలు వద్ద పెద్ద ఎత్తున మద్దతుదారులు గుమి కూడడం కూడా శాంతి భద్రతల సమస్యగా మారింది.

వ్యాఖ్యానించండి