అమెరికా, పాక్ ల మధ్య చెడిన సంబంధాలను పునర్నిర్మించుకోవడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తున్న నేపధ్యంలో ఆ ప్రయత్నాలకు ఆటంకం కలిగించే ఒకసంఘటనను ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. లాడెన్ హత్యలో పాల్గొన్న స్టెల్త్ (రాడార్ల లాంటి పరికరాలకు దొరకనివి) హెలికాప్టర్లలో ఒకటి లాడెన్ ఇంటివద్దనే కూలిపోయింది. అత్యాధునిక పరికరాలు ఆ విధంగా కూలిపోయినపుడు వాటి గురించిన సమాచారం ఇతర దేశాలకు తెలియకుండా ఉండడానికి కూలిపోయిన వెంటనే అమెరికా ధ్వంసం చేస్తుంది. లాడెన్ స్ధావరంలో కూలపోయిన హెలికాప్టర్ బాడీ భాగాన్ని తీసుకెళ్ళినప్పటికీ తోక భాగం అక్కడే ఉండి పోయింది. ఆ తోక భాగాన్ని చూడడానికి, పరిశీలించడానికి పాకిస్ధాన్ అనుమతించిందన్న సంగతిని ఆదివారం ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్.టి) ప్రకటించింది.
కూలిన హెలికాప్టర్‌ని చూడ్డానికి చైనాని అనుమతించవద్దని సి.ఐ.ఏ ప్రత్యేకంగా కోరినప్పటికీ పాకిస్ధాన్ వినిపించుకోలేదనని ఎఫ్.టి తెలిపింది. తాజా వెల్లడి నిజమయితే పాక్ అమెరికాల సంబంధాలను అది మరింతగా దెబ్బతీయవచ్చు. లాడెన్ ఇంటిపై దాడిలో అమెరికా కొన్ని మార్పులు చేసిన బ్లాక్ హాక్ హెలికాప్టర్లను రెండింటిని వాడింది. వీటిలో ఒకటి అక్కడే కూలిపోయింది. ఆపరేషన్ రహస్యం కావడంతో కూలిన భాగాన్ని అక్కడే వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఈ హెలికాప్టర్లపై ప్రత్యేక పూతను పూసి రాడార్ కి దొరకకుండా చేయడంతో పాకిస్ధాన్ రాడార్లు వాటి రాక, పోకలను పసిగట్టలేకపోయాయని చెబుతున్నారు. అమెరికా గూఢచారి వర్గాలను ఉటంకిస్తూ ఎఫ్.టి ఈ వార్తను ప్రచురించింది.
“పాకిస్ధాన్, ముఖ్యంగా ఐ.ఎస్.ఐ అబ్బొత్తాబాద్ లో కూలిన హెలికాప్టర్‌ను చూడడానికి చైనాను అనుమతించిందని చెప్పడానికి మావద్ద సమాచారం ఉంది” అని అమెరికన్ గూఢచారిని, ఎఫ్.టి ఉటంకించింది. చైనాతో సన్నిహిత సంబంధాలున్న పాక్ చైనా అధికారులకు కూలిన హెలికాప్టర్ ఫోటోలు తీసుకోవడానికీ, దానిపై పూసిన ప్రత్యేక పూత శాంపిళ్ళను పట్టుకెళ్ళడానికి అనుమతించిందని తెలుస్తోంది. ఐ.ఎస్.ఐ, ఆర్మీల అధిపతులు ఈ వార్తను ఖండించారు. ఆ తర్వాత అమెరికా సెనేటర్ జాన్ కెర్రీ పాక్ సందర్శించినపుడు హెలికాప్టర్ తోక భాగాన్ని అమెరికాకి పట్టుకెళ్ళిపోయారని అమెరికా ఎంబసి తెలిపింది. దాడి జరిగిన కొద్దిసేపటికి కూలిన కాప్టర్ భాగాన్ని చూడ్డానికి చైనాని అనుమతిస్తామని ఆ వేడిలో పాకిస్ధాన్ ప్రకటించింది కూడా.
లాడెన్ స్ధావరంలో మిగిలిపోయిన భాగాలను చూడ్డానికి ఎవర్నీ అనుమతించవద్దని తాము ప్రత్యేకంగా కోరినా పాక్ ఖాతరు చేయలేదని గూఢచారి ఒకరు తెలిపాడు. లాడేన్ ఇంటిపై దాడి సంగతి పాక్ ప్రభుత్వానికి తెలియదని ఆ దేశాలు రెండూ చెబుతున్నాయి. చెప్పకుండా దాడి చేయడం పాక్ సార్వభౌమత్వానికి భంగమని పాక్ ప్రజలు తీవ్రంగా విమర్శించారు. పాక్ పాలకులు అమెరికాతో అంటకాగడం పట్ల వారు ఆగ్రహాందోళనలను వ్యక్తం చేశారు.
పాక్, అమెరికాల మధ్య ఎన్ని అర్ధాలూ, అపార్ధాలు తలెత్తినా అమెరికాకి పాకిస్ధాన్ తో అవసరం ఉంటే పాక్‌ని వదులుకోవడానికి అమెరికా ఇస్టపడదు. ఇది సార్వత్రిక నియమంగా చూడాలి. దశాబ్దాల తరబడి సహాయం పెరుతో బిచ్చం వేస్తున్నందున నయానో, భయానో దారికి తెచ్చుకుంటుంది. కాని సంబంధాలు దెబ్బతిన్నాయంటే దానికి కారణం పాకిస్ధాన్ తో అమెరికాకి మునుపటంత అవసరం లేకపోయి ఉండాలి. తాలిబాన్ తో చర్చలు, సైనిక ఉపసంహరణ ఇవన్నీ పాక్ అవసరాన్ని అమెరికాకి తగ్గించాయి. సి.ఐ.ఎ గూఢచారుల్ని కూడా వెళ్లగొట్టడంతో పాక్‌కి ఇచ్చే సహాయాన్ని కూడా అమెరికా తగ్గించుకుంది. అందువలనే పాకిస్ధాన్ అనివార్యంగా చైనా పంచన చేరడానికి ప్రయత్నిస్తున్నది. ఈ నేపధ్యంలోనే పాక్ అమెరికాల మధ్య సంబంధాలను చూడవలసి ఉంటుంది.
పాక్, చైనా పంచన చేరడానికి అమెరికా ఇష్టపడదు గనక పాకిస్ధాన్ తో అమెరికా సత్సంబంధాలను పరిమితి స్ధాయిలో కొనసాగిస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే చైనా పెట్టుబడులు పాకిస్ధాన్ లో గణనీయంగా ఉన్నాయి. పాక్ తో చైనా వార్షిక వాణిజ్యం ఖరీదు $9 బిలియన్లు. ఇండియాతో ఇరుదేశాలకూ ఉన్న సరిహద్దు తగాదాలు కూడా చైనా, పాక్ ల ప్రయోజనాలను కొంతవరకు ఒకటిగా చేశాయన్ చెప్పవచ్చు. ఆఫ్ఘనిస్ధాన్ లో ఇండియాకూడా ప్రభావం వేయడానికి ప్రయత్నిస్తున్నందున ఇండియాతో పాక్ ఘర్షణ వాతావరణం మరింత చిక్కబడింది.


