అన్నా హజారే పై కాంగ్రెస్ విసిరిన పాచిక పని చేస్తోందా? అవినీతి, లోక్ పాల్ బిల్లుల చుట్టూ తిరిగిన అన్నా హజారే పత్రికా సమావేశాలు కాంగ్రెస్ ఆరోపణలతో ఆవేశపూరితుడై ఒకింత ఆవేదనా పూరితుడై పట్ట కూడని బాట పట్టాడనిపిస్తోంది. “ప్రభుత్వం జన్ లోక్ పాల్ బిల్లునే పార్లమెంటులో ఆమోదించినా నా దీక్ష విరమించేది లేదు. నాపైన ఆరోపణలు చేస్తున్నారు కదా! నాకు వ్యతిరేకంగా ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేసి విచారణ అయినా జరపాలి. లేదా నాపై ఆరోపణలు నిజం కాదనైనా చెప్పాలి. అప్పటివరకూ, జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదించినా సరే, నా దీక్ష కొనసాగుతుంది” అని భీషణ, భీష్మ ప్రతిజ్ఞ చేశాడు.
అన్నా హాజారే, కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ ఆరోపణలపై తీవ్రంగా స్పందించాడు. హజారే నైతిక పునాదులని జస్టిస్ సావంత్ కమిషన్ బదా బదలు చేసిందని మనీష్ తివారీ చేసిన ఆరోపణను రుజువు చేయాలని సవాలు చేశాడు. “పౌర సమాజం తయారు చేసిన జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటు ఆమోదించినా నేను ప్రతిపాదిత ఆమరణ నిరాహార దీక్షనుండి విరమించను” అని సావంత్ కమిషన్, ట్రస్టుల నిధుల వినియోగంలో హజారే అవినీతికి పాల్పడ్డాడని తేల్చిందంటూ చేసిన ఆరోపణ అనంతరం ఆయన స్పందించాడు. “ప్రభుత్వం నాపైన ఎఫ్.ఐ.ర్ దాఖలు చేసి విచారణ జరిపి విచారణ జరపాలి” అని చెబుతూ తివారీ ఆరోపణలను అబద్ధాలుగా కొట్టిపారేశాడు.
“పార్లమెంటులో జన్ లోక్ పాల్ బిల్లుని ఆమోదించినా సరే, నా ఆమరణ నిరాహార దీక్షను విరమించేది లేదు. నాపైన ఆరోపణలను రుజువు చేయాలి లేదా వెనక్కి తీసుకోవాలి. ప్రజలకు ఈ విధంగా కళంకం అంటగడతారా?” అని తీవ్రంగా ప్రశ్నించాడు. “కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతూ మనల్ని డబ్బూ ఎక్కడినుండి వచ్చిందని అడుగుతోంది. మహారాష్ట్ర ప్రజలకు నాకు డబ్బు ఎక్కడినుండి వస్తుందో బాగానే తెలుసు. గత ఇరవై సంవత్సరాలుగా నేను సామాజిక సేవలో ఉన్నాను. ఎల్లపుడూ సంచిని నేను దగ్గరుంచుకుంటాను. నేను డబ్బుని సేకరించే పద్దతి అదే. ప్రతిదీ జమ చేయబడుతుంది. లెక్కలు ఇంటర్ నెట్ లో అందుబాటులోనె ఉన్నాయి” అని హజారే తెలిపాడు.
పార్టీ నిధికి విరాళాలు ఇచ్చినవరి పేర్లను వెల్లడించాలని హజారే కాంగ్రెస్ ప్రతినిధులు మనీష్ తివారీ, దిగ్విజయ్ సింగ్ లను కోరాడు. సావంత్ కమిషన్ తనపై వేలెత్తి చూపలేదనీ ఆరోపణలను ఎదుర్కొన్న నలుగురిలో ముగ్గురిని పేర్కొన్నదనీ తెలిపాడు. హింద్ స్వరాజ్ ట్రస్టు నిధుల్ని పుట్టిన రొజు వేడుకలకు వినియోగించారని, ఆ డబ్బు ట్రస్టుకి తిరిగి చెల్లించబడిందనీ చెబుతూ అది అవినీతి కాదని తెలిపాడు. తన జీవితమంతా అవినీతికి వ్యతిరేకంగా పోరాడననీ తనపై ఆరోపణలు చేయడం బురద జల్లడమే ననీ అన్నాడు. నలుగురు మంత్రులపై అవినీతి ఆరోపణలు చేసింది తానేననీ, నలుగురిలో ఒకరు తనపై ఆరోపణలు చేయడంతో తనపై కూడా విచారణ జరపాలని తాను కూడా కోరడంతో విచారణ జరిగిందని ఆయన తెలిపాడు. చర్య తీసుకోవాలని తాను కోరుతున్న ఇంతవరకూ చర్యలు లేవనీ తెలిపాడు. ఎనిమింది సి.ఎ లు తన కార్యాలయాల్ని వెతికి టెంపోకు సగం రికార్డుల్ని పట్టుకెళ్ళారనీ అయినా తనకి వ్యతిరేకంగా ఏదీ పట్టుకోలేక పోయారనీ తెలిపాడు.
చర్చ మెల్లగా రాజకియ నాయకులు, అధికారుల అవినీతిపై విచారణ జరగడానికి శక్తివంతమైన లోక్ పాల్ బిల్లు కావాలన్న డిమాండ్ నుండి అన్నా హజారే అవినీతిపైకి మళ్ళుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు దూషణ భూషణలు వెల్లువెత్తే అవకాశం లేకపోలేదు.
