అమెరికా సీనియర్ సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ (ఒబామాతో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిన రిపబ్లికన్) పాకిస్ధాన్ సైన్యం అధిపతి జనరల్ అష్‌ఫాక్ పర్వేజ్ కయాని తో సమావేశమై ఈ అంశాలను చర్చించాడని పాక్ పత్రిక జియో న్యూస్ పత్రిక వెల్లడించింది. పాక్-అమెరికా సంబంధాలను మెరుగుపరచడానికి ఏమి చర్యలు తీసుకోవలసిందీ చర్చించుకున్నారనీ, టెర్రరిజంకు వ్యతిరేకంగా ఉమ్మడి సహకారం పెంపొందించుకునే ప్రయత్నాలపైన కూడా చర్చించుకున్నారనీ ఆ పత్రిక తెలిపింది.
సమావేశంలో, పాకిస్ధాన్‌లోని అమెరికా దేశీయులను క్షోభకు గురి చేస్తుండడం పట్ల మెక్‌కెయిన్ తన ఆందోళనను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అమెరికా రాయబారుల కదలికలను అనుమతించడానికి “నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ కావాలన్న నిబంధనను ఎత్తివేయాలని కూడా ఈ సమావేశంలో మెక్‌కెయిన్ కోరినట్లు తెలుస్తోంది. పాకిస్ధాన్ రక్షణ బలగాలకు చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐ.ఎస్.పి.ఆర్) సంస్ధ ఈ విషయాలను తెలిపిందని ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తా సంస్ధ వెల్లడించింది.
అమెరికాకి చెందిన సి.ఐ.ఎ గూఛచారులను వందమంది వరకూ తమ దేశం నుండి పాకిస్ధాన్ వెళ్ళగొట్టింది. వారిని తిరిగి అనుమతించాలని అమెరికా ఆర్మీ కోరినప్పటికీ పాక్ అనుమతించలేదు. అమెరికా రాయబారులు సైతం గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో వారి కదలికలపై కూడా పాకిస్ధాన్ ఆంక్షలను విధించింది. ఈ నేపధ్యంలో అమెరికా నుండీ ఈ విజ్ఞప్తులు వెలువడడం గమానార్హం. సి.ఐ.ఎ గూఢచారులు పెద్ద సంఖ్యలో పాకిస్ధాన్‌లో ఉండడంపై అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేయడంతో పాక్ సైన్యం వారిని వెనక్కి పిలవాలని పదే పదే అమెరికాపై ఒత్తిడి తెచ్చి సాధించింది. అప్పటి నుండి అమెరికా, పాక్ పై కక్ష సాధింపు చర్యలు చేపట్టడంతో పాకిస్ధాన్ కూడా దానికి స్పందించడం ప్రారంభమయ్యింది.
శనివారం దాదాపు డజన్ మంది తుపాకులు ధరించినవారు ఒక అమెరికన్ ఉంటున్న ఇంటికి వెనకవైపు నుండి తలుపులు పగలకొట్టి జొరబడ్డారనీ, అతని గార్డులను లొంగదీసుకుని ఆయనని కిడ్నాప్ చేశారనీ పోలీసులు తెలిపారు. అమెరికా రాయబార కార్యాలయం కిడ్నాప్‌కి గురైన వ్యక్తి పేరు వారెన్ వీన్‌స్టీన్ అనీ ఒక ప్రవేటు కంపెనీ కోసం పని చేస్తున్నడనీ తెలుస్తోంది. ఆయన వయసు 60 సం.కి పైనే ఉంటుందని కూడా తెలుస్తోంది. అమెరికా తన పౌరులను వివిధ ముసుగుల్లో విదేశాల్లో దింపి దాదాపు అన్ని రకాల వారినీ గూఢచర్య సమాచారం సేకరించడానికి వినియోగిస్తుంది. ప్రభుత్వం తరపున పనిచేస్తున్నా, ప్రవేటు కంపెనీల తరపున పని చేస్తున్నా అమెరికన్లు చాలావరకూ గూఢచర్య కార్యకలాపాల్లో మునిగి తేలుతుంటారు. ఇండియాలో ఫోర్డ్ కంపెనీ ట్రస్టు తరపున నియమితులైన అమెరికన్లు స్వాతంత్రం వచ్చిన కాలం నుండే గూఢచర్యం నిర్వహించారన్న విషయం అందరికీ తెలిసిందే.
గత వారం అమెరికా తన పౌరులకు ఒక ట్రావెల్ సలహా జారీ చేసింది. పాకిస్ధాన్ లోని ఎయిడ్ వర్కర్లతో పాటు జర్నలిస్టు అమెరికన్లను గూఢచారులుగా గుర్తించి వేధిస్తున్నారని కనుక జాగ్రత్తగా ఉండాలనీ ఆ సలహా లో కోరింది. ప్రతి ఉద్యోగినీ గూఢచర్య కార్యకలాపాలకు వినియోగించడంతో అమాయక అమెరికన్లకు కూడా తిప్పలు తప్పడం లేదని దీన్నిబట్టి అర్ధమవుతోంది. ఇది జరగకుండా ఉండాలంటే, అమెరికా తన నడవడిని మార్చుకోవడం తప్ప గత్యంతరం లేదు. అది మాత్రం జరగని పని.
