ధనికుడి ఆర్ధిక సంక్షోభం, దరిద్రుడి ఆకలి సంక్షోభం -కార్టూన్


ప్రపంచం ఇప్పుడు సంక్షోభాలతో నిండిపోయింది. ఏ పత్రిక చూసినా, ఏ ఛానెల్ చూసినా అమెరికా రుణ సంక్షోభం, యూరప్ రుణ సంక్షోభం, రుణ సంక్షోభం ఆసియాను తాకుతుందా? చైనా, ఇండియాల పరిస్ధితి ఏమిటి? జర్మనీ, ఫ్రాన్సులు యూరప్‌ని ఒడ్డుని చేరుస్తాయా? ఈ ప్రశ్నలే ఎల్లెడలా! వీటన్నింటికీ అతీతంగా సర్వకాల సర్వావస్ధల యందు కూడా ఆకలి సంక్షోభం లో ఉన్నవారి సంగతి ఎవరికీ పట్టదు, అప్పుడప్పుడూ వచ్చే పరిశోధనాత్మక వ్యాసాలు తప్ప.

2008 ఆర్ధిక సంక్షోభం రాగానే ప్రపంచ ధనిక దేశాలతో పాటు ఎమర్జింగ్ దేశాలు కూడా జి20 రూపంలో సమావేశమైనాయి. జి7 దేశాలు, యూరోజోన్ దేశాలు, ఎమర్జింగ్ దేశాలు ఇలా అన్ని ముఖ్య దేశాలు గ్రూపుగా ఏర్పడి సంక్షోభ పరిష్కారానికి అర్జెంటుగా వందల బిలియన్ డాలర్ల బెయిలౌట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. “టూ బిగ్ టు ఫెయిల్”, విఫలం కావడానికి వీలు లేనంత పెద్ద కంపెనీలే ఈ బెయిలౌట్ల స్వీకరణకి అర్హులుగా నిర్ణయిం చేసేశాయి. బెయిలౌట్లు ఎక్కడి నుండి తేవాలి? ఇంకెవరు పన్నులు కడుతున్నారుగా అమాయకపు పక్షుల్లా! వారినుండే. చాలకపోతే అప్పులు తేవాలి. ఆ అప్పుల్ని మళ్ళీ మూలుగుతున్న జనాలపై వేసి పొదుపు ఆర్ధిక విధానాలతో జనం నుండే రాబట్టాలి.

ఆర్ధిక సంక్షోభానికి కారణమయిన బడా కంపెనీలని శిక్షించే బదులు ట్రిలియన్ల కొద్దీ డాలర్లు బెయిలౌట్లుగా ఎదురిచ్చి మరీ సత్కరించడానికి ప్రభుత్వాలు, అదే పనిగా జి20 సమావేశాలు జరిపాయి. కానీ దరిద్రంలో, కరువులో, దుర్భిక్షంలో, ఆకలితో, పౌష్టికార లోపంతో తీసుకుంటున్న వందల కోట్ల మంది కోసం జి20 ఒక్క సమావేశమూ జరపలేదు. ఆఫ్రికా కరువు పీడితుల కోసం సాయం కావాలని, ఐక్యరాజ్య సమితి కేకలు పెడుతున్నా, స్పందిస్తున్న ప్రభుత్వాలు లేవు.

ధనికుడి ఆర్ధిక సంక్షోభానికి ట్రిలియన్ల కొద్దీ డాలర్లు కురుస్తాయి. దరిద్రుడి ఆకలి సంక్షోభానికి మెతుకులు కూడా రాలవు.

Crises of haves and have nots

ధనికులు, పేదల సంక్షోభాలకు స్పందనలలో వ్యత్యాసాలు

కార్టూనిస్టు: కార్లోస్ లాతుఫ్, బ్రెజిల్

ధనికుడు: రేయ్ సంక్షోభం రా!

దరిద్రుడు: సంక్షోభం బాబు గారూ!

==================================================================

2 thoughts on “ధనికుడి ఆర్ధిక సంక్షోభం, దరిద్రుడి ఆకలి సంక్షోభం -కార్టూన్

  1. “ధనికుడి ఆర్ధిక సంక్షోభానికి ట్రిలియన్ల కొద్దీ డాలర్లు కురుస్తాయి. దరిద్రుడి ఆకలి సంక్షోభానికి మెతుకులు కూడా రాలవు.”

    ప్రపంచం తల్లకిందులుగా ఉంటోంది. దాన్ని సరైన స్థానంలో నిలబెట్టాలి అని కారల్ మార్క్స్ ఏనాడో అన్నాడు. ప్రపంచం ఎంత తలకిందులుగా ఉంటోందో తెలుసుకునేందుకు పై వ్యాఖ్య చాలు. అభినందనలు…

వ్యాఖ్యానించండి