
ఫ్రాన్సు రెండో క్వార్టరు జిడిపి వృద్ధి సున్న నమోదైన వార్త ఫ్రాన్సు పత్రికల పతాక శీర్షికలను ఆక్రమించింది.
యూరోజోన్ గ్రూపుకి ఉన్న రెండు ప్రధాన స్తంభాల్లో ఒకటైన ఫ్రాన్సును రుణ సంక్షోభం తాకింది. ఫ్రాన్సు తన క్రెడిట్ రేటింగ్ AAA రేటింగ్ ని కోల్పోవచ్చన్న ఊహాగానాలు రాను రానూ బలంగా మారుతున్నాయి. మూడు ప్రధాన క్రెడిట్ రేటింగ్ సంస్ధలు ఫిచ్, ఎస్&పి, మూడీస్ లు ఫ్రాన్సు క్రెడిట్ రేటింగ్ కి ఇప్పుడప్పుడే వచ్చిన ప్రమాదం ఏమీ లేదని హామీ ఇస్తున్నప్పటికీ మార్కెట్లు వినిపించుకునే స్దితిలో లేనట్లు కనిపిస్తున్నది. లండన్ అల్లర్లకు బ్రిటన్ ప్రధాని కామెరూన్ తన సెలవుని రద్దు చేసుకుని పరిగెత్తుకుని వచ్చినట్లుగానే, ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజి కూడా తన సెలవుల్ని రద్దు చేసుకుని బీచ్ నుండి వెనక్కి వచ్చి చక్కదిద్దే ప్రయత్నాల్లో పడ్డాడు. నూతన పొదుపు విధానాలను అమలు చేయబోతున్నామని ఆయన ప్రకటించాడు.
రుణ సంక్షోభం వచ్చినప్పటినుండీ యూరప్ దేశాలు బడ్జెట్ లోటు తగ్గించే పేరుతో ప్రభుత్వ ఖర్చు తగ్గించాలంటూ ప్రజలపై దారుణమైన పొదుపు విధానాలు రుద్ధుతున్నాయి. జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్ లలో ఉన్న మితవాద ప్రభుత్వాలు ఈ పొదుపు విధానాలను తీవ్రంగా అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఖర్చులో కార్మికులు, ఉద్యోగులకి ఇస్తున్న సంక్షేమ సదుపాయాలే ప్రధానం అన్నట్లుగా వాటిలో తీవ్రంగా కోత విధించడమో, రద్దు చేయడమో చేస్తున్నాయి. గ్రీసుపై ఈ విధానాలను బలవంతంగా రుద్దినప్పటికీ అక్కడి సంక్షోభం సమసిపోక పోగా దాని అప్పు మరింత పెరిగి సంక్షోభం తీవ్రమైందే తప్ప శాంతించని సంగతిని అవి ప్రస్తావించకుండా ప్రజలని మోసం చేస్తున్నాయి. తమ స్వంత ప్రజలనే కాకుండా యూరప్ ప్రజలందర్నీ తప్పుదారి పట్టిస్తున్నాయి.
ఫ్రాన్సుని రుణ సంక్షోభం తాకడం అంటే, మొదటి అడుగుగా ఫ్రాన్సు సావరిన్ డెట్ బాండ్లపై చెల్లించవలసిన వడ్డీ రేటు (యీల్డ్) పెరిగిపోవడమే. ఫ్రాన్సు ట్రెజరీ విభాగం అప్పు సేకరణకోసం ఇప్పటికే జారీచేసిన బాండ్లపై ట్రెజరీ చెల్లించవలసిన వడ్డీ రేటు మారనప్పటికీ, సెకండరీ మార్కెట్ లో ఆ బాండ్లపై చెల్లించవలసిన వడ్డీ రేటు అనూహ్య స్ధాయిలో పెరుగుతున్నపుడు సంక్షోభ పరిస్ధితులు ఏర్పడినట్లు గుర్తిస్తున్నారు. సెకండరీ మార్కెట్లలో యీల్డ్ పెరుగుతున్నపుడు దాని ప్రభావం తాజాగా జారీ చేసే ట్రెజరీ బాండ్లపై పడుతుంది. అంటే ఫ్రాన్సు ట్రెజరీ తాజాగా సేకరించే అప్పు బాండ్లపై చెల్లించవలసిన వడ్డీ రేటు ఎక్కువగా ఇవ్వాలని బాండ్ల కొనుగోలుదారులు డిమాండ్ చేస్తారు. నవంబరు2010 తర్వాత మొదటి సారిగా ఫ్రాన్సు బాండ్లపై యీల్డ్ అధిక స్ధాయికి పెరిగినట్లుగా మార్కెట్ గణాంకాలు తెలుపుతున్నాయి.
సెలవుల నుండి తిరిగొచ్చి సర్కోజీ నూతన పొదుపు చర్యలు ప్రకటించాక, మార్కెట్లలో బ్యాంకుల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. సంక్షోభంలో ఉన్న ఇటలీ, గ్రీసుల అప్పు బాండ్లలో ఫ్రాన్సు బ్యాంకులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ప్రభావం కలిగిస్తోంది. అదీ కాక రెండవ క్వార్టర్ లో ఫ్రాన్సు జిడిపి వృద్ధి రేటు అచ్చంగా సున్న నమోదయ్యింది. దానితో ఫ్రాన్సు ఆర్ధిక పరిస్ధితిపై అనుమానాలు బలంగా వ్యాపించాయి. ఈ నేపధ్యంలో యూరోపియన్ మానిటరీ యూనియన్ ఉనికికే ప్రమాదం వచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రఖ్యాత అమెరికన్ ఆర్ధికవేత్త నౌరుబి, రానున్న ఐదు సంవత్సరాలలో ఇటలీగానీ, స్పెయిన్ గానీ యూరోజోన్ నుండి బైటికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. యూరోజోన్ నుండి బైటికి వెళ్లడం అంటే ఆ దేశాలు యూరో ను తమ కరెన్సీగా రద్దు చేసుకుని తమ పాత జాతీయ కరెన్సీని పునరుద్ధరించుకోవడమే. అమెరికా ఆర్ధిక, రాజకీయ ఆధిపత్యానికి, డాలర్ ఆధిక్యతకూ సవాలుగా ఎదుగుతూ వచ్చిన యూరో కరెన్సీ చివరికి డాలర్ ఆధిపత్యాన్ని దాటకుండానే కూలిపోతున్న సూచనలు అందుతున్నాయి.
రానున్న మంగళవారం జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజీలు పారిస్‌లో సమావేశం కానున్నారు. దీనిలో ఫ్రాన్సు రుణ సంక్షోభ పరిస్ధితులు చర్చకు రావచ్చునని భావిస్తున్నారు. యూరోజోన్ పరిరక్షణా నిధికి రెండవ పెద్ద చెల్లింపుదారు అయిన ఫ్రాన్సు క్రెడిట్ రేటింగ్ తగ్గిన పక్షంలో ఇతర యూరోజోన్ బలహీన దేశాలపై తీవ్ర ప్రభావం పడి సంక్షోభం మరింత తీవ్రమే వేగంగా యూరోజోన్ దేశాలను చుట్టవచ్చు. యూరోజోన్ పరిరక్షణా నిధిని ఏర్పాటు చేయడంలో ఫ్రాన్సు అధ్యక్షుడు సర్కోజి ప్రధాన పాత్ర పోషించాడు. జర్మనీ ఛాన్సలర్ తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ సర్కోజీ ఒక దశలో ఫ్రాన్సు యూరోజోన్ నుండి బైటికి వెళ్లక తప్పదని బెదిరించిమరీ నిధిని ఏర్పాటు చేయించాడు. ఇప్పుడా సంక్షోభం ఫ్రాన్సు సమీపానికే రావడం యాదృఛ్చికం కానేరదు. ఇటలీ, స్పెయిన్ దేశాల రేటింగ్ లను ఇప్పటికే క్రెడిట్ రేటింగ్ సంస్ధలు తగ్గించాయి. తదుపరి ఫ్రాన్సు రెటింగ్ పై ప్రభావం పడనున్నదని మార్కెట్లు బలంగా భావిస్తున్నాయి.
ఈ సంవత్సరం మొదటి క్వార్టర్ లో 0.9 జిడిపి వృద్ధి నమోదు చేసిన ఫ్రాన్సు, రెండవ క్వార్టర్ లో వృద్ధి సున్న నమోదు చేసింది. ఈ సంవత్సరాంతానికి బడ్జెట్ లోటును ఫ్రాన్సు 5.7 శాతానికి తగ్గించవలసి ఉంది. ప్రస్తుతం ఫ్రాన్సు బడ్జెట్ లోటు జిడిపిలో 7.1 శాతంగా ఉంది. ఈ నేపధ్యంలో వినియోగదారుల వినియోగం గత దశాబ్దంలోనే తక్కువ స్ధాయికి తగ్గడం ఆందోళన కలిగిస్తొంది. అంటే వినియోగదారులు భవిస్యత్తులో గడ్డు రోజులు రానున్నాయన్న అంచనాలతో సొమ్ముని పొదుపు చేసుకుంటున్నారని అర్ధం. నికోలస్ సర్కోజి ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించడానికి మరంత కఠిన నిబంధనలు అమలు చేసేందుకు వీలుగా రాజ్యాంగంలో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తుండగా ప్రతిపక్ష సోషలిస్టులు అందుకు నిరాకరిస్తున్నారు. ఎన్నికల రాజకీయాలతోనే ఈ నిరాకరణ ముడిపడి ఉంది తప్ప సో కాల్డ్ సోషలిస్టులు అధికారంలో ఉన్నా వారు కూడా సర్కోజీ విధానాలే అనుసరిస్తారనడంలో సందేహం లేదు. గ్రీసు, స్పెయిన్, పోర్చుగల్ లలో ఈ సోకాల్డ్ సోషలిస్టులే అధికారంలో ఉండడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.
ఫ్రాన్సు పత్రికలన్నీ రెండవ క్వార్టర్ లోని సున్న వృద్ధి రేటుపైనే దృష్టిని కేంద్రీకరించాయి. ఆర్ధిక వృద్ధి స్తంభన పొదుపు విధానాలని కఠినంగా అమలు చేయవలసీ అవసరాన్ని సూచిస్తున్నదని మితవాద పత్రిక లె ఫిగారో పత్రిక రాసింది. ఫ్రాన్సు తన జిడిపి వృద్ధి రేటు లక్ష్యం 2 శాతం చేరుతుందని ప్రభుత్వం నచ్చ జెపుతోంది. సంక్షోభం తీవ్రం కాకుండ ఉండటానికి ఫ్రాన్సుతో పాటు మరికొన్ని ఉన్నత స్ధాయి క్రేడిట్ రేటింగ్ ఉన్న దేశాలు షార్ట్ సెల్లింగ్ ను నిషేదించాయి. అయినా ఇదేమీ సంక్షోభ పరిష్కారానికి దోహదపడవని లి ఫిగరో చెబుతోంది. లె మాండే పత్రిక జిడిపి లక్ష్యం మరీ ఆశావాదంతో ఉందని భావిస్తోంది. ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఈ లక్ష్యాన్ని తగ్గించుకోవడం తప్ప మరొ మార్గం లేదని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. జర్మనీ, ఫ్రాన్సులు యూరోజోన్ ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నా, అవి తమ సొంత ఆర్ధిక వ్యవస్ధలను నిలుపుకోగలవా అని లె మాండే ప్రశ్నించడం గమనార్హం.

Way out of the crisis is indicated by their own advisers,but it is doubtful whether the governments will follow them.West Europe and U.S.A. are rich and advanced countries . They can solve the problem but vested interests will not allow them.Instead they want expenditure on health and welfare to be cut affecting poorer sections.
అవును. మీరు చెప్పింది నిజం. మరొక సంగతి, స్వార్ధ ప్రయోజనాలు నెరవేరాలని కోరుతున్నవారితో ప్రభుత్వాలు మిత్రత్వం నెరపుతున్నాయి. ప్రభుత్వాలని పూర్తి అధికారాలతో నడవనిస్తే, అవి సమస్యలను పరిష్కరించడంలో ముందుండోచ్చు, కానీ అవి అలా నడవకపోవడమే వ్యవస్ధ లక్షణంగా చరిత్ర నిరూపించింది. ఇక ముందూ అవి అలాగే కొనసాగుతాయి, కూలిపోయేవరకు.