కేవలం రెండేళ్ళలో 77 కోట్ల ఆస్తులను 365 కోట్లకు పెంచగలిగన జగన్మోహన్ రెడ్డి అలియాస్ జగన్ సంపాదించిన ఆస్తులు అక్రమార్జనగా భావించడానికి తగిన ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని నమ్ముతూ ఆంద్ర ప్రదేశ్ హైకోర్టు జగన్ ఆస్తుల సామ్రాజ్యంపై పూర్తి స్ధాయి విచారణ జరపాలని నిర్ణయించి అందుకు సి.బి.ఐ ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు చాలా మందికి పార్టీలతో సంబంధం లేకుండా అనేక మంది నాయకులను సంతోషపరిచింది. జగన్ నాయకత్వంలోని వై.ఎస్.ఆర్ పార్టీ మినహా దాదాపు మిగిలిన పార్టీలన్నీ హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేయడం తెలిసిందే అయినా విడ్డూరం.
ఎ.పి రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సి.బి.ఐ గత నెల జగన్ ఆస్తులపై ప్రాధమిక విచారణ నిర్వహించిన సంగతి తెలిసిందే. మొదట రెండు వారాల గడువులో విచారణ పూర్తి చేయాలని ఆదేశించిన కోర్టు, ఆ రెండు వారాల నివేదిక ఆధారంగా మరొక వారం గడువు సి.బి.ఐకి ఇచ్చింది. మూడువారాల పాటు క్షణం తీరిక లేకుండా దర్యాప్తు జరిపిన సి.బి.ఐ సమర్పించిన నివేదికను అధ్యయనం చేశాక వై.ఎస్.ఆర్ పార్టీ నేత జగన్ ఆస్తుల సంపాదనలో అవినీతి, అక్రమాలు, నేరాలు జరిగాయనేందుకు తగిన ప్రాధమికా సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టు భావించింది. పూర్తి స్ధాయి దర్యాప్తు చేయాలని కూడా ఆమోదించింది. ఐ.పి.సి, అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం అనే మూడు చట్టాల కింద నేరాలు జగన్ పై మోపి, సి.బి.ఐ దర్యాప్తు చేయనుంది.
జగన్ కంపెనీల్లో ఉత్తి పుణ్యానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన పాతిక కంపెనీలను సి.బి.ఐ విచారణ సందర్భంగా ప్రశ్నించింది. వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చట్ట విరుద్ధంగా అనేక ప్రయోజనాలు పొందడం వల్లనే ఆ కంపెనీలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు కనిపిస్తోందని హైకోర్టు భావించింది. జగన్ కంపెనీల ఆర్ధిక నేరాలన్నింటిపైనా సంపూర్ణ దర్యాప్తు జరిపేందుకు సి.బి.ఐ కి పూర్తి స్వేచ్ఛ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి కష్టాలు తెచ్చిన జగన్ వ్యవహారంలో అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్, జగన్ పై విచారణకు సంతోషించకపోయినా అడ్డు తగలకపోవచ్చు.
క్రిమినల్ కేసుల్లో పాత్రవహించినట్లుగా భావించపడుతున్న జగన్, అతని మిత్రులు త్వరలో అరెస్టు ఎదుర్కోవచ్చని న్యాయ నిపుణులు చెపుతున్నారు. “నేరారోపణ చేయబడిన వారు సాక్ష్యాలను రూపుమాపడానికి ప్రయత్నిస్తాడని సి.బి.ఐ భావించినట్లయితే ముద్దాయిల అరెస్టును అది కోరవచ్చు. దర్యాప్తు జరుగుతున్నంత కాలం కస్టడీలోకి తీసుకోవచ్చు” అని పిటిషనర్లలో ఒకరైన యెర్రం నాయుడు కౌన్సెల్ డి.శ్రీనివాస్ అన్నాడని ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తా సంస్ధ తెలిపింది. అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ చట్టం కింద నేరాలు రుజువైతే ఆస్తులు జప్తు చేయబడతాయని కూడా ఆయన చెప్పాడు.
2009 పార్లమెంటు ఎన్నికల్లో జగన్ తన ఆస్తులు రు.77 కోట్లుగా పేర్కొన్నాడు. 2011 ఉప ఎన్నికలలో ఆస్తులు రు.365 కోట్లుగా జగన పేర్కొన్నాడు. రెండు సంవత్సరాల్లో దాదాపు ఐదు రెట్లు (500 శాతం) ఆస్తులు పెంచుకోవడం వాల్‌స్ట్రీట్ మోసకారి సంస్ధలకు కూడా సాధ్యం కాని పని. జగన్ పేర్కొన్నట్లు కష్టపడి సంపాదించింది నిజమే అయితే ప్రపంచంలో ఇక ఆకలి, దారిద్ర్యం, ఆత్మహత్యలు, నిరుద్యోగం, కరువు, దుర్భిక్షం లాంటి వైకల్యాలు ఏవీ ఉండవలసిన అవసరం లేదు. దేవుడి ఆదేశంతో జగన్, కష్టజీవులకి ఒక ఆశ్రమ పాఠశాల పెట్టి కష్టజీవుల సంపదలతో పాటు దేశ సంపదలని కూడా పెంచవచ్చు. అమెరికా, యూరప్ ల వద్ద దేహీ అనవలసిన అవసరం లేదు.
చేనేత మంత్రి శంకర రావు రాసిన లేఖను సుమోటోగా హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయం విదితమే. 2004లో జగన్ ఆస్తులు రు.11 కోట్లేననీ (ఎన్నికల అఫిడవిట్ ప్రకారం), అవి ఇప్పుడు 43,000 కోట్లకు చేరాయని శంకరరావు తన పిటిషన్ లో ఆరోపించాడు. పలు కంపెనీలు అవినీతి సొమ్ముని జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లు కోర్టు భావించింది. ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు, ఇరిగేషన్ కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ సంస్ధలు, మైనింగ్ సంస్ధలకు అనుకూలంగా నిబంధనలు సడలించడం, నిబంధనలకు అతీతంగా అనుమతులివ్వడం లాంటి మేళ్ళు చేయడం ద్వారా జగన్ కంపెనీల్లో అవినీతి డబ్బుని ఆకర్షించారని కోర్టు భావించింది. కొన్ని కంపెనీల షేర్ల ముఖవిలువలు 35 రెట్లు వరకూ పెంచారని కోర్టు తన పరిశీలనలో పేర్కొంది. పన్నుల భారం లేని దేశాల ద్వారా అక్రమ డబ్బుని కంపెనీల్లోకి మళ్ళించారనీ, సాక్షి పత్రిక ప్రచురణ కర్త జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ నడుపుతున్న సాక్షి టి.వి ఛానెల్ అందుకు ఉదాహరణలనీ కోర్టు డివిజన్ బెంచి పేర్కొంది.
అయితే జగన్ కోర్టు ఆదేశాలనుండి కూడా సానుభూతి ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇల్లలకగానే పండగ కాదన్నట్లు కేవలం దర్యాప్తు చేయమని ఆదేశాలివ్వడం తొనే అంతా అయిపోలేదు. విచారణ సజావుగా జరగాలి. విచారణను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకునే సి.బి.ఐ జరపాలి. విచారన సక్రమంగా జరిగినా ఈ లోపు జగన్ కాంగ్రెస్ ముందు సాగిలబడినట్లయితే కోర్టుల్లో సాక్ష్యాలు తారుమారు కావచ్చు. పదుల సంవత్సరాల తరపడి సాగిన బోఫోర్సు కేదు దర్యాప్తు ఏమైంది గనక? పాతిక సంవత్సరాలకు పైగా సాగీన్ విచారణలో శిక్షలు తర్వాత సంగతి, అసలు దోషులెవ్వరో తేలలేదు. దగ్గరుండి బాబ్రీ మసీదుని కూల్పించిన అద్వానీకి ఇప్పుడు బాబ్రీ మసీదు కూల్చడం అంటే ఏమిటో కూడా తెలియదు.
“చట్టం తనపని తాను చేసుకుపోతుంది” అన్న స్టేట్‌మెంట్‌కి ఒకే ఒక అర్ధం ఉందనుకోవడం నమ పొరబాటు. అధికారంలో ఉన్నవారికి అది బోలెడన్ని అర్ధాలని సరఫరా చేయగలదు.
