పోలీసు ఉద్యోగాల నియామకాల కోసం హైద్రాబాదును ఫ్రీ జోన్ గా పరిగణిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన 14(F) ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్ధి సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ బందు విజయవంతమైనట్లుగా వార్తలు తెలుపుతున్నాయి. తెలంగాణ విద్యార్ధుల జాయింట్ యాక్షన్ కమిటీ, ఇతర తెలంగాణ ప్రజా సంఘాల మద్దతుతో తెలంగాణ బందును విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వార్తా ఛానెళ్ళు ప్రకటించాయి. 1975 రాష్ట్రపతి ఉత్తర్వులనుండి 14(F) క్లాజును తొలగించాలని తెలంగాణ విద్యార్ధులు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులు కొన్ని నెలల నుండి డిమాండ్ చేస్తున్నారు.
హైద్రాబాద్‌లో పోలీసులు, ఎస్.ఐ పోస్టుల నియామకం కోసం కొద్ది నెలల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినప్పటినుండీ ఈ వివాదం రగులుతూనే ఉంది. ఉద్యోగాల నియామకాలకు రాత పరీక్ష తేదీలను గతంలో ప్రకటించినప్పటికీ తెలంగాణ ఆందోళనల వలన అది కొనసాగలేదు. తెలంగాణ శాసనసభా పక్ష నాయకులు, ఎం.ఎల్.ఎ లు గట్టిగా డిమాండ్ చేయడంతో పరీక్ష వాయిదా వేసుకోక తప్పలేదు. ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా రాష్ట్రపతి ఉత్తర్వులనుండి 14(F) ఉత్తర్వులను తొలగించాలని ఒక తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఆ తర్వాత ఎందువల్లనో పోలీసుల పోస్టుల భర్తీ విషయం వెనక్కి వెళ్ళింది. ప్రభుత్వం మళ్ళీ పోస్టుల భర్తీకోసం ప్రయత్నాలు ప్రారంభించడంతో ఈ 14(F) చుట్టూ తెలంగాణ ప్రత్యేక రాష్ట ఉద్యమం కూడా అల్లుకుని తీవ్రమవుతూ వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ ఇప్పటికే 14(F) రద్దును కోరుతూ తీర్మానం పంపినప్పటికీ, మారిన పరిస్ధితుల నేపధ్యంలో అసెంబ్లీ మరొక్కసారి తీర్మానం ఆమోదించాలని ప్రకటించి చిదంబరం, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా ప్రతినిధుల ఆగ్రహానికి గురయ్యాడు. చిదంబరం కోరికను రాష్ట్ర ముఖ్యమంత్రి తిరస్కరించాడు. అప్పటి ఎం.ఎల్.ఎలు, పార్టీలే ఇప్పటికీ ఉన్నందున మరో తీర్మానం 14(F) రద్ధుపై చేయవలసిన అవసరం లేదని ప్రకటించి ఆమేరకు ప్రధానికి ఒక లేఖ కూడా రాశాడు. కాంగ్రెస్ ఎం.పిల బృందం ప్రధానిని కలిసి వినతిపత్రం ఇవ్వగా సి.ఎం లేఖ అందాక ఆ విషయం చూస్తానని చెప్పి శాంతపరిచాడు. ఐతే రాష్ట్ర ప్రభుత్వం మరో తీర్మానం అవసరం లేదు అని చెప్పేదాక పాత తీర్మానం ఇప్పటికీ చెల్లుబాటు అవుతుందన్న సంగతి చిదంబరానికి తెలియకపోవడమే విచిత్రంగా ఉంది.
ఒకసారి అసెంబ్లీ తీర్మానం ఆమోదించాక పరిస్ధితి మారిందని మళ్ళీ ఆమొదించాలని కోరితే ఆ నియమం ఎన్నింటికి వర్తించవలసి ఉంటుంది? రోజువారి కార్యక్రామాల నుండి అమెరికాతో కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం, పౌర అణు ఒప్పందం వరకూ ఆ నియమాన్ని అమలు చేయవలసి ఉంటుంది. వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం, పౌర అణు ఒప్పందం రెండూ యు.పి.ఎ-1 ప్రభుత్వంలో పార్లమెంటు ఆమోదించిన ఒప్పందాలు. ఇపుడున్నది ఆ ప్రభుత్వం కాదు. ఎన్నికల తర్వాత యు.పి.ఎ-2 ప్రభుత్వం ఏర్పడింది. అప్పటికీ, ఇప్పటికీ మంత్రివర్గ పొందికలో చాలా తేడాలు వచ్చాయి. మంత్రుల శాఖల్లో మార్పులు వచ్చాయి. కనుక ఆ రెండు ఒప్పందాలూ మళ్ళి తాజాగా పార్లమెంటు ఆమోదించాలని డిమాండ్ చేయవచ్చా? యు.పి.ఎ-1ప్రభుత్వం గట్టెక్కడానికి బి.జె.పి ఎం.పిలకు ముడుపులిచ్చారన్న “ఓటుకి నోటు” కుంభకోణం విచారణకు వచ్చినందున అప్పుడు యు.పి.ఎ-1 ప్రభుత్వం పొందిన విశ్వాసం రద్దయ్యి తాజాగా పొందవలసి ఉంటుందా?
14(F) క్లాజు తొలగించాలని తీర్మానం ఆమోదించడానికి ముందూ తెలంగాణ కోసం, సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు జరిగాయి. తర్వాతా జరిగాయి. ముందు జరిగిన వాటిని వదిలేసి తర్వాత ఆందోళనలు జరిగాయి కనుక మళ్ళీ ఆ తీర్మానం ఆమోదించాలని చిదంబరం చెప్పడం ఏ కోవలోకి వస్తుంది? కేంద్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్ మంత్రులు, ఆంద్ర ప్రదేశ్ లోని సీమాంద్ర మంత్రులు, ఎం.ఎల్.ఎ లు తెలంగాణకి సంబంధించిన ఏ డిమాండైనా వ్యతిరేకించాల్సిందే అన్న ఒక మూకుమ్మడి అభిప్రాయానికి మూర్ఖంగా వచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ కావాలి అంటే, అది సున్నితమైన విషయం, ఒక్క రాత్రిలో తేలేది కాదు, ఏకాభిప్రాయం కావాలి, ప్రశాంత పరిస్ధితులు ఏర్పడాలి, ఇతర పనులున్నాయి, రాజీనామాలు చేస్తే తెలంగాణ రాదు, ఇచ్చేదీ మేమే తెచ్చేదీ మేమే అని ఒకే పద్ధతిలో నిరంతరాయంగా పాడుతూ పోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి దాని నాయకులకూ అలవాటైపోయింది.
సంవత్సరం పైనుండి తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నలుగుతుంటే గులామ్ నబీ ఆజాద్ అని కొత్త ఇన్‌ఛార్జి అట, ఆయన జాదూ అట, రెండుసార్లు ఎ.పిలో కాంగ్రెస్ ని పవర్ లోకి తెచ్చాడట (మరి వై.ఎస్.ఆర్ ఏమైనట్లో తెలియదు), ఆయనొచ్చి తెలంగాణ “రాత్రికి రాత్రి తేలేది కాదు” అని ప్రకటిస్తాడు. రాత్రికి రాత్రి తేలేది కాదని ఈయనకి ముందే బోల్డంతమంది అమ్మగార్లు, అయ్యగార్లు చెప్పి పోయారు. దాదాపు నాలుగొంద రాత్రులనుండి తెలంగాణ డిమాండ్ నలుగుతుంటే ఆజాద్ వచ్చి ఇప్పుడు నిద్రలేచి వచ్చి ఫ్రెష్ గా “తెలంగాణా? అబ్బే రాత్రికి రాత్రే రాదు” అనంటే ఇన్నాళ్ళూ ఈయన ఏకన్నంలో ఉన్నట్లు? ఏ కుంభకర్ణుడి ఒడిలో నిదరోతున్నట్లు?
గతంలో యు.పి.ఎ-1 ప్రభుత్వంలో తెలంగాణ కావాలని కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీ వెళ్ళి అడిగినప్పుడల్లా “మాకంతా తెలుసు. మీరేమీ వర్రీ కాకండి. సరైన సమయంలో నిర్ణయిస్తాం” అని సోనియా చెప్పేవారని పత్రికలు రాసేవి. తీరా ఇప్పుడొచ్చేసరికి హోం మంత్రి చిదంబరం సాక్షాతూ లోక్ సభలోనే “ఆంద్ర ప్రదేశ్ ప్రజలనుండి పరిష్కారం రావాలి. మాచేతుల్లో ఏమీ లేదు” అని చేతులెత్తేశాడు. మరి ఇన్నాళ్ళు ఆ ఏడుపు ఎందుకు ఏడవలేదన్నదే ప్రశ్న. అంతకుముందు సోనియా కూడా కోర్ కమిటీ సమావేశంలో “అందరూ నాకు అప్పజెపితే నేనేం చేయను? నేనెలా తేల్చను?” అన్నట్లుగా పత్రికలు రాశాయి. మరయితే ఆరేడు సంవత్సరాలనుండీ “మాకంతా తెలుసు. సరైన సమయంలో…” అని ఎందుకన్నట్లు? మొన్న లోక్ సభలో సి.పి.ఐ ఎం.పి గురుదాస్ దాస్ గుప్తా గారు దీనిపై ఓ మాట అన్నాడు. “సరైన సమయంలో ఇస్తామంటారు. సరైన సమయం ఎప్పుడొస్తుంది? బహుశా చిదంబరం హోం మంత్రి పదవిలో లేనప్పుడు వస్తుందేమో” అని చమత్కరించారు.
ఇవన్నీ గమనిస్తే అర్ధమయ్యేది ఒక్కటే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ ప్రజలపైనా, వారి ఆకాంక్షలపైనా, వారి ఆందోళనలపైనా ఏమాత్రం పట్టింపు లేదు. వీలయితే తెలంగాణ ఉద్యమాన్ని తమ స్వార్ధ ప్రయోజనాలకోసం వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తాయి తప్ప వారి అసలు కోరికయిన తెలంగాణ రాష్ట్ర సాధనకు అంగీకరించవు. ఆరొందలు కుర్రాళ్లు కాదు, ఇంకో ఆరొందలు కాల్చుకున్నా వారంతే. ఇంతకంటె నిష్క్రియా పరమైన, బాధ్యతారాహిత్యంతో కూడిన నాసిరకం ప్రభుత్వం మళ్ళీ రాకూడదని తెలంగాణ ప్రజలు కొరుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్ధితులు నెలకొన్నాయి. బడ్జెట్ ఆమోదం పొందాలి మే వరకూ ఆగాలని చెప్పారనగానే టి.ఆర్.ఎస్ తో సహా పార్టీలన్నీ ఆందోళనలని పక్కన బెట్టి మే కోసం చూశారు. బడ్జెట్ పాసయ్యింది. మే నెల వచ్చింది, పోయింది కూడా. ఆందోళనలైతే మొదలయ్యాయి గానీ “మే దాకా ఆగండి” అన్నవారి నుండి స్పందన లేదు.
కాంగ్రెస్ ఆడుతున్న నాటకాల్లో టి.ఆర్.ఎస్ పార్టీకి కూడా భాగస్వామ్యం ఉందన్న సూచనలు అప్పుడప్పుడూ వెల్లడవుతూనె ఉన్నా ఉద్యమకారులు ఆ విషయం ప్రశ్నించడంలో విఫలమవుతున్నారు. లేకుంటే కె.సి.ఆర్ ఇటీవల అవసరమైతే 2014 దాకా కూడా మా ఉద్యమాలు కొనసాగుతాయి అని ఎందుకంటాడు? అప్పటివరకూ తెలంగాణ అంశాన్ని నాన బెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా కనిపిస్తున్నదనీ, కనుక మనం కూడా అప్పటిదాకా ఉద్యమాలు కొనసాగించాలనీ కె.సి.ఆర్ పరోక్షంగా తెలంగాణ ప్రజలను తయారు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
తెలంగాణ వచ్చుడు సంగతి ఎలా ఉన్నా ఆ ఉద్యమం పుణ్యామాని కె.సి.ఆర్ దాదాపు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలోనె కొనసాగుతున్నాడు. ఉద్యమం పేరు చెప్ప ఆస్తుల్ని బాగా పెంచుకున్నాడు. టి.వి ఛానెల్ పెట్టాడు. సీమాంద్ర పెట్టుబడుదారుల తోనే వ్యాపారాలు చేస్తున్నాడు. ఎన్నికలు జరిగి తెలంగాణ ముఖ్యమంత్రె కాలేదు గానీ ఆయన, తెలంగాణనుండి అధికారంలో ఉన్నవారి కంటే ఎక్కువగానే ఇన్నాళ్ళూ సంపాదించుకున్నాడు. ఇక కె.సి.ఆర్ కి తెలంగాణ ఎందుకు చెప్పండి? బహుశా తెలంగాణ వస్తే కె.సి.ఆర్ కి అదనంగా వచ్చే సంపాదన ఉండదేమో. అధికారంలో ఉండగా ఏదైనా ఉద్యమం పేరు చెప్పి వసూళ్ళకు పాల్పడటం కుదరని పని. అదే అధికారంలో లేకుంటే నైతికత లాంటి పరేషాన్లు ఏవీ ఉండవు. స్వేచ్ఛగా ఉద్యమం అండతో పెట్టుబడులని తరిమేస్తాం అని బెదిరించి మరీ వసూళ్ళు చెయ్యొచ్చు. ఎన్ని అడ్డమైన పనులకి పాల్పడినా మళ్ళీ “జై తెలంగాణ” అనగానే బోల్దంత ఫాలోయింగ్. లక్షల గొంతులు ప్రతిధ్వనిస్తాయి. ఇక ముఖ్యమంత్రి గిరీ ఎందుకు? ఈ లెక్కనే కె.సి.ఆర్ కూడా డిసైడయినట్లు తోస్తోంది.
కోదండరాం గానీ లేక ఇతర నేతలు గానీ ఉపన్యాసాలు ఇస్తున్నపుడో, పత్రికా సమావేశాల్లో మాట్లాడుతున్నపుడో వారి కంఠాల్లో గానీ, వారి హావ భావల్లో కానీ తెలంగాణ రావలన్న ఆవేశం, ఇంకా రానందుకు ఆగ్రహంతో కూడిన ఆవేదన, ప్రజలంతా డిమాండ్ చేస్తున్నా స్పందించకపోవడం పట్ల నిస్పృహా ఇవన్నీ కనిపిస్తాయి. కాని కే.సి.ఆర్ గాని, ఆయన కుమారుడు తారక్ గానీ, ఆయన కూతురు కవిత గానీ ఎన్నడూ అటువంటి హావ భావాలు వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. పైగా వారి మొఖాల్లో ఒక విధమైన సంతృప్తి కనిపిస్తుంది. ఒక భరోసా కనిపిస్తుంది. వారు తలపెట్టిన కార్యక్రమాలన్ని విజయవంతం అవుతున్నపుడు వచ్చే సంతృప్తి అది. అవి ఉద్యమాల విజయం వల్ల పుట్టే సంతృప్తి కాదు. ఉద్యమాలు విజయవంతం ఐనపుడు వచ్చే సంతృప్తిలో ఉద్విగ్నత ఉంటుంది. తదుపరి కార్యక్రమం పట్ల చింతనా, బాధ్యతా ప్రతిఫలిస్తూ ఉంటాయి. కె.సి.ఆర్ కుటుంబంలో ఇవేవీ కానరావు. రాజకియనాయకులు పదవిలోకి వచ్చి కోట్లకు పడగలెత్తాలని కోరుకుంటారు. కాని ఆ కోట్లు ఎన్నికల శ్రమలేకుండానే వస్తే… అంతకంటే ఏం కావాలి? ఉద్యమాల్లోకి తాము స్వయంగా దిగవలసిన అవసరం లేదు. కాకుంటే కార్యకర్తలు అన్ని శ్రమలూ పడి మీటింగ్ పెడితే అక్కడికెళ్ళి చెణుకులతో, పిట్టకధలతో నాలుగు మాటలు చెబితే అదే పెద్ద ఉద్యమం. ఆ తర్వాత కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటే ఓ ప్రకటన, జైల్లో పెడితే మరొక ప్రకటన ఇలా ఎప్పటికప్పుడు స్పందిస్తుంటే సరిపోతుంది.
కె.సి.ఆర్ కుటుంబానికి ఇలా గడుస్తున్నందున వారికి తెలంగాణ అవసరం లేదు. కావలసింది ప్రజలకే. వారు ఎంత త్వరగా ఇలాంటివారిని వదులుకుంటె అంత త్వరగా స్వయంగా తెలంగాణని సాధించుకోగలుగుతారు.

శేఖర్ గారు,
ఈ రోజు తెలంగాణ వస్తే “కే సీ ఆర్”, కి వచ్చేది ఏమిటి? పదవులన్నీ కాంగ్రెస్ వాళ్ళ కే దక్కుతాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టి, మధ్యంతర ఎన్నికలను తెస్తే “తె రా స” తెలంగాణ లో అత్యధిక సీట్లు గెలుస్తుంది. దాని కోసం ఆయన కాంగ్రెస్ నాయకులను రాజినామాలకు ప్రేరేపించటం ద్వారా ప్రయత్నించాడు. అది సఫలం కాలేదు. ఇక మిగిలింది ఉద్యమ వేడిని 2014 వరకూ కొనసాగిస్తూ, ఆ ఎన్నికలలో రాజకీయ లబ్ది పొందటం. వేడి మరీ ఎక్కువ కూడా అవ్వకూడదు. అందుకనే దాదాపు ఒక ఆరు నెలలల నుంచీ ఆయన “మనం ఆవేశ పడవద్దు, కీలెరిగి వాత పెడదాం” అంటూ తెలంగాణ శక్తుల ఆవేశాన్ని అదుపులో పెడటానికి ప్రయత్నిస్తున్నాడు.అప్పుడప్పుడూ కవిత లాంటి వారు సమైక్య వాదులు “క్విట్ తెలంగాన” అంటూ ఓ రెండు చితుకులు వేసి కొంచెం వేడి రగిలిస్తారు.
“ఇక తెలంగాన అవసరం ప్రజలకే”,అన్నారు.
ఏమిటి ఆ అవసరం? భావోద్వేగ పరమైన అవసరం కాకుండా వారి ఇంకే అవసరమైనా తీరుతుందా?
బొందలపాటి గారు
“తెలంగాణ డిమాండ్ పై అంతర్జాతీయ పెట్టుబడుల దృక్పధం ఎలా ఉంది?” ఆర్టికల్ లో ప్రజలకు ఏ ఉపయోగం ఉన్నదీ రాశాను. దానిపైనే మీరు మీ అభిప్రాయం కూడా రాశారు. శ్రమ అనుకోకపోతే ఒకసారి ఆ ఆర్టికల్ చదవగలరు.
భావోద్వేగాల వాదన అసలు ప్రజలకు సంబంధించిన వాదన కాదు. భావోద్వేగాలపై ఆధారపడి రాజకీయ, ఆర్ధిక డిమాండ్లు నెరవేర్చమనడం అసలు సరైంది కాదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వారి బతుకులకి సంబంధించినవి. తెలంగాణ ప్రజలకి చేకూరే ప్రధాన ప్రయోజనాలు నీటి పారుదల సౌకర్యాలు, రాష్ట్రంలోని వారికి మాత్రమే ఇవ్వగల ఉద్యోగాలు. ఇంకా ప్రభుత్వ బడ్జెట్ ద్వారా తెలంగాణ పెట్టుబడిదారులు పోందే కేటాయింపులలో రోడ్లు, ఆసుపత్రులు లాంటి సౌకర్యాలు కలుగుతాయి. ఆ సౌకర్యాలని ప్రజలకోసం కాకపోయినా పెట్టుబడిదారుల కంపెనీలు తదితర ప్రయోజనాల కోసం కలగజేస్తారు. అవి అనివార్యంగా ప్రజలకీ ఉపయోగపడతాయి.
తెలంగాణకి సీమాంధ్ర కంటె బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది. దానిద్వారా ప్రజలకు చేస్తున్నామని చెప్పుకోవడానికి అక్కడ ప్రభుత్వాలు ఏవోకొన్ని చేస్తాయి. ఇప్పటి పరిస్ధితి కంటే అది ఉపయోగమే. ఎ.పి బడ్జెట్ అంటే అది ఎ.పిలో ఎక్కడైనా ఖర్చు చేయవచ్చు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయితే ఒక్క తెలంగాణలోనే ఖర్చు అవుతుంది. అది కూడా ప్రజలకి ఉపయోగమే.
మీరు రాసిన లాభాలు గుర్తున్నాయి. కానీ తెలంగాణ ప్రజలు ఈ సాపేక్ష లాభాలని దృష్టి లో ఉంచుకొని ఆ అవగాహన తో ఉద్యమం చేస్తున్నట్లు కనబడదు. చాలా వరకూ ఆంధ్ర వారి పై రెచ్చగొట్టబడిన ద్వేషం తోనే ప్రస్తుతం ఉద్యమం నడుస్తోంది.
సాపేక్ష లాభాలన్న తెలివిడి తెలంగాణ ప్రజలకు ఉండందండీ. ప్రజలకి అన్ని తెలివితేటలుంటే కె.సి.ఆర్ లు, తారక్ లు, జానా రెడ్డిలు, కావూరిలు ఎలా మనగలరు చెప్పండి?
ప్రజలకి తక్షణం తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటారు. వారికి ఈ విశ్లేషణలన్ని తెలియవు. రైతులకి నీరు కావాలి. గిట్టుబాటుధరలు కావాలి. నీరు వరకు దొరుకుతుంది. రెండోది భారత దేశమే ఇవ్వడం లేదు, ఇక తెలంగాణ ఎలా ఇస్తుంది? కూలీలకు రోజూ పని దొరకాలి. విద్యార్ధులకి తక్కువ ఖర్చు కాలేజీలు, చదివాక ఉద్యోగాలు కావాలి. కాలేజీల సంగతేమో కాని ఉద్యోగాల సంఖ్య సాపేక్షికంగా పెరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క వర్గానికీ ఏదో ఒక ప్రయోజనం పాక్షికంగా చేకూరుతుంది. కాని వారి మౌలిక సమస్యలు తీరవు. వాటికోసం ఎప్పటిలాగా కొట్లాడవలసిందే.
ఆంధ్రులపై ద్వేషంతోనే ఉద్యమం నడుస్తుందనడం నిజం కాదని నా అభిప్రాయం. వారి సమస్యలనుండే ప్రధానంగా ఉద్యమం తలెత్తింది. ఆ తర్వాత రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం చేసిన అడ్డగోలు ఉపన్యాసాలు వారినా స్ధితికి నెట్టాయి. ప్రతి ఉద్యమంలో ఇలాంటి ధోరణులు ఉంటాయి. మనం చూడవలసింది ఆ ఉద్యమం చేస్తున డిమాండ్లు, వాటిలో ఉన్న న్యాయబద్ధత, సాఫల్యత, చారిత్రక సంబంధాలు… ఇవన్నీ.
@ వారి సమస్యలనుండే ప్రధానంగా ఉద్యమం తలెత్తింది. ….
@చాలా వరకూ ఆంధ్ర వారి పై రెచ్చగొట్టబడిన ద్వేషం తోనే ప్రస్తుతం ఉద్యమం నడుస్తోంది…..
@మనం చూడవలసింది ఆ ఉద్యమం చేస్తున డిమాండ్లు, వాటిలో ఉన్న న్యాయబద్ధత,……..thats all…
@ భావోద్వేగ పరమైన అవసరం కాకుండా వారి ఇంకే అవసరమైనా తీరుతుందా?……no.