రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ 50 సం. పూర్తి చేసుకున్న బారక్ ఒబామా


నెలల తరబడి సాగిన వేడి వేడి చర్చల అనంతరం, ఏకాభిప్రాయ సాధనకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు ఆగష్టు 4 తో 50 సంవత్సరాలు నిండాయి. ఆమెరికా కాంగ్రెస్‌లో మెజారిటీ ఉన్న రిపబ్లికన్ల నుండి దీని పట్ల తీవ్రం విమర్శలు వ్యక్తం అయ్యాయి.

“ప్రస్తుతం ఈ దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటుండగా, మనిషి జీవ పరిణామ క్రమంలో భాగమైన వయసు మీరే ప్రక్రియకు తన సమయాన్ని వెచ్చించడం, అమెరికన్లందరినీ అవమానించడమే” అని సెనేట్ మైనారిటీ నాయకుడు మిఛ్ మెక్ కొనెల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. బారక్ ఒబామా కనీసం  2013 శిశిరం వరకైనా 49 సంవత్సరాల వద్దనే నిలిచి ఉండేలా అవకాశం కల్పించాలన్న వాదనకు మెక్ కొనెల్ ఆద్యుడు.

“ఏక పక్షంగా ముందుకు కదలడానికి నిశ్చయించుకోవడం, తన జీవితంలోని తదుపరి సంవత్సరాన్ని ద్వైపాక్షిక మద్దతు లేకుండానే ప్రారంభించడం… ఒక దేశానికి నాయకత్వం వహించే వ్యక్తి అనుసరించ వలసిన పద్ధతేనా ఇది?” అని మెక్ కొనెల్ ప్రశ్నించాడు.

ఐతే, దీనికి వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. వైట్ హౌస్ కధనం ప్రకారం రిపబ్లికన్లతో కలిసి పనిచేయడానికి బారక్ ఒబామా ఆగష్టు 4 డెడ్ లైన్ వరకూ తీవ్రంగా ప్రయత్నం చేశాడు. అవన్నీ విఫలం కావడంతో బారక్ ఒబామా ఒక సంవత్సరం మేరకు వయసు మీరడానికి నిర్ణయించుకోక తప్పలేదు.

(రుణ పరిమితి ఒప్పందం చర్చలలో రిపబ్లికన్ల ప్రజా వ్యతిరేక, పనికి మాలిన అభ్యంతరాలను దృష్టిళో ఉంచుకుని రాసిన పేరడీ వార్త ఇది. ది ఆనియన్ వెబ్‌సైట్ నుండి)

వ్యాఖ్యానించండి