ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు లోక్ పాల్ గురించి అసలు విననే లేదు -సర్వే


team-anna

ప్రభుత్వ లోక్‌పాల్ బిల్లు కాపీలను తగలబెడుతున్న అన్నా హజారే మద్దతుదారులు

అన్నా హజారే, ఆయన నాయకత్వంలోని పౌర సమాజ కార్యకర్తల బృందం సాగించిన ప్రచారం, కార్యకలాపాలు గత మూడున్నర నెలలనుండి లోక్ పాల్ వ్యవస్ధ గురించిన వార్తలను భారతీయ మీడియా తప్పనిసరిగా ప్రచురించేలా చేశాయి. లోక్‌‌పాల్ అనే వ్యవస్ధ భారత ప్రభుత్వంలోని అత్యున్నత స్ధాయిలో సాతుతున్న అవినీతిని అడ్డుకోవడానికి ఉద్దేశించిందని, అవినీతిపై వాళ్ళ ఆందోళన పతాక శీర్షికలకు ఎక్కేవరకూ చాలా మంది అక్షరాస్యులకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఐతే మొత్తం మీద చూస్తే భారతీయుల్లో నూటికి అరవై ఆరు మంది లోక్ పాల్ గురించి తాము ఇంతవరకూ వినలేదనో లేక దానిపై తమకేమీ అభిప్రాయం లేదనో చెప్పడం భారత దేశ వ్యవస్ధలో ప్రజల స్ధితిగతులను పట్టిచ్చే ముఖ్యమైన అంశం.

74 ఏళ్ళ గాంధేయవాది అన్నా హజారే, ఉన్నత స్ధాయి ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, మంత్రుల అవినీతిపై విచారణకు లోక్ పాల్ వ్యవస్ధను ఏర్పాటు చేయాలని గత ఏప్రిల్ నెలలో ఆమరణ దీక్ష పాటించిన సంగతి విదితమే. పాలకుల అవినీతితో విసిగిపోయి ఉన్న భారతీయులు అనేకులు అప్పటినుండీ హజారే ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్, సి.ఎన్.బి.సి-టి.వి18 వార్తా ఛానెళ్ళ సంస్ధలు సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించాయి. వివిధ అంశాలపైన జరిగిన ఈ సర్వేలో అవినీతి, లోక్ పాల్ బిల్లు, అన్నా హజారే బృంద కార్యకలాపాలు మున్నగు అంశాలను చేర్చారు. ఈ సర్వేలో కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలుగా అనిపించే కొన్ని సంగతులు తెలిసాయి.

కేవలం మూడవ వంతు మాత్రమే లోక్‌పాల్ బిల్లు గురించి విన్నట్లుగా లేదా తెలిసినట్లుగా ఈ సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న మొత్తం మందిలో  34 శాతం మాత్రమే లోక్‌పాల్ గురించి విన్నట్లు తేలింది. అందులోనూ 24 శాతం మందికి మాత్రమే లోక్‌పాల్ అంటే ఏమిటో నిజంగా తెలుసు. అయితే విద్యావంతుల్లో చూసినపుడు ఈ పరిస్ధితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా కాలేజ స్ధాయి, దానికి మించి చదివిన వారిలో లోక్‌పాల్ పట్ల మంచి స్పందన వ్యక్తమయ్యింది. 67 శాతం మంది లోక్‌పాల్ గురించి వింటే, 51 శాతం మందికి లోక్‌పాల్ అంటే ఏమిటో నిజంగా తెలుసు.

అన్నా హజారే జన్ లోక్‌పాల్ బిల్లుకూ, ప్రభుత్వం తయారు చేసిన లోక్ బిల్లుకూ మధ్య దేనిని ఎంపిక చేసుకుంటారన్న విషయంలో అభిప్రాయాల తేడా చాలా స్పష్టంగా ఉంది. 25 శాతం మంది అన్నా హజరే బిల్లు కావాలని కోరగా, 7 శాతం మంది మాత్రమే ప్రభుత్వ బిల్లుకు మద్దతు తెలిపారు. 63 శాతం మంది తమకేమీ అభిప్రాయం లేదని తెలిపారు. విద్యా వంతుల విద్యార్హతలు పెరిగే కొద్దీ హజారే బృందం ప్రతిపాదించిన జన్ లోక్‌పాల్ బిల్లుకు మద్దతు కూడా పెరుగుతూ పోవడం ఆసక్తికరం. అంటే అవినీతిపై ఒక దృక్పధం ఏర్పరచుకోవడంలో విద్య పాత్ర గణనీయంగా ఉందని స్పష్టమవుతోంది. సర్వే లో అడిగిన ప్రశ్నలు కూడా లోక్ పాల్ బిల్లులోని వివిధ అంశాలపైన ఉండడంతో వాటిని అర్ధం చేసుకోవడం విద్యావంతులకే సాధ్యమవడం ఈ పరిస్ధితికి దోహదపడింది.

అన్నా హజారే బృందం అవినీతి వ్యతిరేక చట్టాన్ని అంగీకరించవలసిందేనని చేసిన ఆందోళన డిమాండ్ల వల్లనే ప్రభుత్వం అవినీతి సమస్యను ఎలాగోలా పరిష్కరించవలసిన అగత్యం ఏర్పడిందని మొత్తం మందిలో 38 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయగా, కాలేజి అంతకు పైగా విద్యావంతులైనవారిలో 60 శాతం మంది ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్నా హజారే డిమాండ్లను ప్రభుత్వం తన బిల్లులో పొందుపరిచిందని చాలామంది అంగీకరించలేదు. 30 శాతం మంది లోక్ పాల్ వలన అవినీతి తగ్గుతుందని భావించారు. కాలేజి, ఆపైన విద్యావంతుల్లో సగం మంది అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే కొంతమంది లోక్ పాల్ బిల్లు ఉన్నా సి.బి.ఐ, సివిసి, లాంటి వ్యవస్ధలను శక్తివంతం చేయాలని భావించారు. మొత్తంలో 28 శాతం మంది లోక్ పాల్ ఏర్పాటుతో పాటు ఇతర అవినీతి వ్యతిరేక వ్యవస్ధలను శక్తివంతం కావించాలని కోరారు.

వ్యాఖ్యానించండి